ఆర్టీసీ బస్సు, కారు ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:06 AM
పాలకొం డ- రాజాం రహదారిలో బూరాడ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొన్నాయి.
రేగిడి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పాలకొం డ- రాజాం రహదారిలో బూరాడ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న గరివిడి మండలం ఏనుగులవలసకు చెందిన గేదల రాంబాబు, చీపురుపల్లి మండలం అగ్రహారానికి చెందిన లక్ష్మణరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాలకొండ నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు... రాజాం నుంచి పాలకొండ వెళుతున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు అతివేగంగా వస్తున్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు, బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన ఇద్దరిని రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ బాలకృష్ణ సందర్శించారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ తెలిపారు.