Share News

ముటేషన్‌కు రూ.3లక్షలు

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:12 AM

మండలంలోని చాకివలస ఇన్‌చార్జి వీఆర్వో అంబటి రామపైడి చిట్టిబాబు సోమవారం ఏసీబీకి పట్టుబడ్డారు.

 ముటేషన్‌కు రూ.3లక్షలు
తహసీల్దార్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ డీఎస్పీ రమ్య తదితరులు, ఏసీబీకి చిక్కిన వీఆర్వో చిట్టిబాబు

- డిమాండ్‌ చేసిన చాకివలస వీఆర్వో

- ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు

- రూ.లక్ష తీసుకుంటుండగా పట్టుకున్న వైనం

భోగాపురం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చాకివలస ఇన్‌చార్జి వీఆర్వో అంబటి రామపైడి చిట్టిబాబు సోమవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ భూమికి సంబంధించి ముటేషన్‌ చేసేందుకు రైతు నుంచి రూ.లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వివరాలను ఏసీబీ డీఎస్పీ రమ్య విలేకరులకు వెల్లడించారు. చాకివలస గ్రామానికి చెందిన లంక అప్పలనర్సింహులుకు సర్వే నెంబరు 8/2లో సుమారు 74 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి తన తండ్రి వారసత్వంగా వచ్చింది. ఇటీవల ఆయన తండ్రి మృతి చెందడంతో ఆ భూమిని ముటేషన్‌ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. దీనికోసం అప్పలనర్సింహులు బంధువు లంక బంగారునాయుడు.. సవరవల్లి గ్రామ సచివాలయ వీఆర్వోగా పని చేస్తూ చాకివలసకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అంబటిరామపైడి చిట్టిబాబును కలిశాడు. ముటేషన్‌ చేసేందుకు వీఆర్వో రూ.3లక్షలు డిమాండ్‌ చేశాడు. ఆఖరికి రూ.2.40లక్షలకు రైతుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బంగారునాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో బంగారునాయుడు వీఆర్వో చిట్టిబాబుకు రూ.లక్ష నగదు ఇచ్చాడు. ఆ నగదును వీఆర్వో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం తలుపులు వేసి విచారణ చేపట్టారు. రికార్డులు, ఆన్‌లైన్‌లో వివరాలు, అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. వీఆర్వో నివాసంలో కూడా సోదాలు చేశారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీఆర్వో చిట్టిబాబుపై కేసు నమోదు చేశామన్నారు. పూర్తిగా దర్యాప్తు చేసి మంగళవారం ఆయన్ను రిమాండ్‌కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ రమ్య తెలిపారు. కాగా, ఏసీబీ దాడులతో రెవెన్యూ సిబ్బందిలో ప్రకంపనలు మొదలయ్యాయి. వీర్వోలు, సిబ్బంది కార్యాలయానికి రాకుండా పరుగులు తీశారు. ఏ రైతు వచ్చి తమపై ఫిర్యాదు చేస్తారో అని ఆందోళనకు గురయ్యారు.

వీఆర్వోపై పలు ఆరోపణలు..

వీఆర్వో అంబటిరామపైడి చిట్టిబాబుది విజయనగరం మండలం జొన్నగుడ్డి గ్రామం. గుర్ల తహసీల్దార్‌ కార్యాలయం నుంచి బదిలీపై భోగాపురం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. సవరవల్లి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. రైతులు ఏ పని కోసం దరఖాస్తు చేసుకున్నా ఆయనకు లంచం ఇవ్వాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. దస్త్రాలు సక్రమంగా ఉన్నా రైతుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఐదు నెలలుగా తిప్పుతున్నాడు..

బాధిత రైతు లంకబంగారునాయుడు మాట్లాడుతూ.. ‘చాకివలసలో మా బంధువు అప్పలనర్సింహులకు సుమారు 74 సెంట్ల భూమి ఉంది. దీనికి సంబంధించి గత అక్టోబరులో ముటేషన్‌కు దరఖాస్తు చేశాం. దరఖాస్తును పరిశీలించాలని వీఆర్వో చిట్టిబాబును కలిస్తే ఐదు నెలలుగా తిప్పుతున్నాడు. ఏవో కారణాలు చెప్పి రిజక్టు చేసేవాడు. దీనిపై వారం కిందట పట్టుబట్టి మాట్లాడం జరిగింది. రూ.3లక్షలు ఇవ్వమని అడిగాడు. రూ.2.40 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాను. ముందుగా రూ.లక్ష ఇస్తానన్నాను. దీనిపై ఏసీబీని ఆశ్రయించాను.’అని తెలిపారు.

Updated Date - Feb 24 , 2026 | 12:12 AM