తగ్గుతున్న రౌడీషీటర్లు
ABN , Publish Date - May 11 , 2026 | 12:46 AM
జిల్లాలో రౌడీషీటర్ల విషయంలో పోలీసుల కృషి, శ్రమ సత్ఫాలితాలిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంతో పోల్చిచూస్తే వీరిసంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు పోలీసు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
- పోలీసుల దూకుడుతో వణుకు
- వారి కదలికలపై నిఘా.. అవసరమైతే ట్రీట్మెంట్‌ు
- సత్ఫాలితాలిస్తున్న ఎస్పీ చర్యలు
విజయనగరం క్రైం, మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రౌడీషీటర్ల విషయంలో పోలీసుల కృషి, శ్రమ సత్ఫాలితాలిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంతో పోల్చిచూస్తే వీరిసంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు పోలీసు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్నేళ్లుగా ఏటా క్రైమ్ రేటులో హెచ్చుతగ్గులు ఉంటున్నప్పటికీ, రౌడీషీట్లు సంఖ్యలో తగ్గుదల ఉండడపై పోలీసుశాఖపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 2021లో 454 మందిపై పోలీసులు రౌడీషీట్లు తెరవగా, 2022 నాటికి ఆసంఖ్య 394కి తగ్గింది. 2023లో 375 రౌడీషీట్లు ఓపెన్ చేయగా, 2024లో ఆసంఖ్య 371కి తగ్గింది. 2025లో ఆసంఖ్య గణనీయంగా తగ్గినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆ సంవత్సరంలో 286 రౌడీషీట్లు తెరిచారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 294 మందిపె రౌడీషీట్లు ఓపెన్ చేశారు. ఈ విధంగా 2021 నుంచి 2026 వరక జిల్లావ్యాప్తంగా 2,174 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేసిన పోలీసులు అంతటితో బాధ్యత తీరిపోయినట్టుకాకుండా వారి కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
శాంతిభద్రతలకు ప్రాధాన్యం..
జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్ పెంచిన పోలీసులు,ఆయాచోట్ల శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది అనుమానిత యువకులు నేరచరిత్రను విశ్లేషిస్తున్నారు. మళ్లీమళ్లీ నేరాలకు పాల్పడేవారికి ప్రాథమికంగా కౌన్సిలింగ్ ఇస్తూ మార్పు రాకపోతే రౌడీషీట్లు తెరచి వార్నింగ్ ఇస్తున్నారు. కొన్నాళ్లపాటు వారిపై తమదైన శైలిలో దృష్టి కేంద్రీకరించి వారిలో మార్పు కనిపించాక రౌడీషీట్లను ఎత్తివేస్తున్నారు. అయినప్పటికీ నిఘాను మాత్రం కొనసాగిస్తున్నారు. కొట్లాటలు, అనుమానిత మరణాలు, హత్యలే కాకుండా ఇతర కేసుల్లో పదేపదే ప్రమేయం ఉన్నట్టు రూఢీచేసుకున్న అనంతరం అటువంటివారిపై రౌడీషీట్లు ఓపెన్ చేసేవారు. అయితే, గత ఐదేళ్లలో వీటితోపాటు గంజాయి కేసులను కూడా రౌడీషీట్లు జాబితాలోకి చేర్చారు. ఈనేపథ్యంలోనే 2024కి ముందు రౌడీషీట్లు సంఖ్య ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక గంజాయిపై ఉక్కుపాదం మోపే చర్యలు చేపట్టడంతో నిందితుల్లో భయం ఏర్పడి రౌడీషీట్లు సంఖ్య తగ్గినట్టు ప్రజలు భావిస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో అల్లరిమూకలు,రౌడీ,గుండా ముఠాల్లో టెర్రర్ మొదలైందనేది వాస్తవం.