Robust Strategy for Water Security నీటి భద్రతకు పటిష్ఠ వ్యూహం
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:27 AM
Robust Strategy for Water Security ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వనరులు రోజు రోజుకూ అడుగంటిపోతున్నాయి. సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో కరువు ఛాయలు అలము కుంటున్నాయి. ఈ నేపథ్యంలో జల సంరక్షణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే నీటి భద్రత దీనిలో భాగంగానే వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది.
హద్దులు, ఆక్రమణలు గుర్తించే పనిలో అధికారులు
ఫీడర్ చానళ్ల పునరుద్ధరణ, చెక్‌డ్యాముల నిర్మాణానికి అవకాశం
జియ్యమ్మవలస, ఏప్రిల్15(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వనరులు రోజు రోజుకూ అడుగంటిపోతున్నాయి. సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో కరువు ఛాయలు అలము కుంటున్నాయి. ఈ నేపథ్యంలో జల సంరక్షణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే నీటి భద్రత దీనిలో భాగంగానే వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో ఒక కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా జిల్లాలో మైనర్ ఇరిగేషన్ చెరువులు, ఫీడర్ చానళ్లు సరిచేయడంతో పాటు అవసరం ఉన్న చోట చెక్‌డ్యాముల నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. కాగా జల సంరక్షణ చర్యల్లో భాగంగా అధికారులు ఉమ్మడి జిల్లాలో చెరువులను గుర్తించే పనిలో ఉన్నారు. వాటి విస్తీర్ణం ప్రకారం హద్దులు నిర్ణయించి.. ఆక్రమణలు తొలగిస్తే.. ఉమ్మడి జిల్లావాసులకు సాగు, తాగునీటి ఇక్కట్లు తొలగనున్నాయి.
వంద రోజుల ప్రణాళిక ఇలా..
నీటి భద్రత కోసం ఈ నెల 6 నుంచి జూలై 14వ తేదీ వరకు టైమ్‌లైన్ (సమయపాలన)ను ప్రభుత్వం అందించింది. అందులో భాగంగా ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు (పది రోజులు) పనులు గుర్తించాలి. ఈ నెల 16 నుంచి 2 వరకు మంజూరు ప్రక్రియ చేపట్టాలి. ఈ నెల 21 నుంచి జూలై 19 వరకు పనులు చేపట్టాలి. జూలై 10 నుంచి 14 వరకు నివేదన , డాక్యు మెంటేషన్ పూర్తి చేయాల్సి ఉంది.
చేయాల్సిన కీలక కార్యకలాపాలు
నీటి భద్రతలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, నీటి సంఘం అధ్యక్షులు కలిసి.. గ్రామసభలో చెరువు పనులపై తీర్మానం చేసి మండల కమిటీకి పంపాలి. ఆ తరువాత తీర్మానం కాపీ మండల కమిటీ నుంచి కలెక్టర్ అధ్యక్షతన ఉన్న జిల్లా కమిటీకి వెళ్తుంది. అనంతరం చెరువులు, ఫీడర్ చానళ్ల పునరుద్ధరణతో పాటు వాటికి సమీపంలో ఉన్న సాగునీటి కాలువలను ఎగువ చెరువులతో అనుసంధానం చేయనున్నారు. కాలువల్లో ఉన్న నీటిని, వర్షపు నీటిని చెరువుల్లోకి మళ్లించనున్నారు. చెక్‌డ్యాములు నిర్మించనున్నారు. కాలువ, చెరువు గట్లుపై మొక్కలు పెంచనున్నారు.
ఇలా చేయాలి
ప్రస్తుతం భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పడిపోతోంది. ఇప్పుడు భూగర్భ జల లోతు 15 మీటర్లకు మించి ఉంది. దీనిని 3 నుంచి 6 మీటర్ల మధ్య ఉండేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం నీటి సంఘాలు ఆయకట్టును పరిశీలించాలి. అక్కడ ఆయకట్టు లేని ప్రాంతాల్లో వర్షపాతం, భూగర్భ జలాలు, నేల తేమ లభ్యతను గుర్తించాలి. నీటి బడ్జెట్ తయారు చేయాలి. అన్ని రకాల నీటి వనరులు, నికర నీటి లభ్యత, దాని వినియోగాన్ని సక్రమంగా అంచనా వేయాలి. నీటి వినియోగంలో సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు రైతులు అవలంబించేలా చేయాలి. దీనికోసం వ్యవసాయ, ఉద్యానవన, జల వనరుల శాఖల సమన్వయంతో ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. నీటిని పొదుపుగా వాడడంపై అవగాహన కల్పించాలి.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో వంద ఎకరాలు దాటి ఆయకట్టు ఉన్న మైనర్ ఇరిగేషన్ (ఎంఐ) చెరువులు 107 వరకూ ఉన్నాయి. దీని మొత్తం ఆయకట్టు 22 వేల ఎకరాలు. ఇదికాకుండా వంద ఎకరాలు కంటే తక్కువ ఆయకట్టు ఉన్న కాలువలు, గెడ్డలు, ఇతర నీటి వనరులు 59 వరకూ ఉన్నాయి. వాటి పరిధిలో 23 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. వంద ఎకరాలు కంటే తక్కువగా ఉన్న చెరువులు 2,749 ఉండగా, వీటి ఆయకట్టు విస్తీర్ణం 50 వేల ఎకరాల వరకూ ఉంది. మొత్తంగా మన్యంలో 2,915 చెరువులు, కాలువలు, గెడ్డలు, ఇతర నీటి వనరుల పరిధిలో 95 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా జిల్లాలో చెరువుల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలే. ఎక్కడిక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపడుతుం డడంతో కొన్ని చోట్ల అసలు చెరువులే కనిపించడం లేదు. దీనివల్ల ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదు.
విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లా పరిధిలో వంద ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులు 42 ఉన్నాయి. వాటి పరిధిలో 8 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. వంద ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు ఉన్న చెరువులు 1,308 ఉన్నాయి. వాటి పరిధిలో 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది కాకుండా వంద ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న కాలువలు, గెడ్డలు ఎనిమిది ఉన్నాయి. వాటి పరిధిలో 2,500 ఎకరాలు ఆయకట్టు ఉంది. ‘నీటి భద్రత విషయంలో నీటి సంఘాలతో కలిసి పూర్తిస్థాయిలో పనిచేస్తాం. పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది పూర్తిస్థాయిలో సహకారాన్ని అందించాలి.’ అని నీటి పారుదలశాఖ ఏఈ బి.శంకరరావు తెలిపారు.