స్థానిక ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:10 AM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆధేశించారు.
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి
- కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆధేశించారు. శనివారం వెబెక్స్ ద్వారా ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 75 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు ఒకే అభ్యర్థికి పోలైన పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని సూచించారు. ‘గతంలో రీపోలింగ్ జరిగిన కేంద్రాలను కూడా పరిశీలించాలి. ఘర్షణలు, గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడికి గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి.’ అని తెలిపారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ.. గతంలో నమోదైన కేసులు, ఘర్ఘణలు, ఎన్నికల సమయంలో తలెత్తిన సమస్యలతో పాటు ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన పోలీసులు బందోబస్తు, నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చందక సత్తిబాబు, జడ్పీ సీఈవో లోవరాజు, పంచాయతీ అధికారి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.