ROBs with Rs.150 crores రూ.150కోట్లతో ఆర్‌వోబీలు
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:27 PM
ROBs with Rs.150 crores
రూ.150కోట్లతో ఆర్‌వోబీలు
ప్రజా దర్బార్‌లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం/ గజపతినగరం, మార్చి9 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి మండలాల్లో ఆర్‌వోబీలకు రూ.150 కోట్లు పైబడి నిధులు మంజూరయ్యాయని, రెండు నెలల్లో పనులకు శ్రీకారం చుడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైల్వే మూడోలైన్ పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో అండర్ గ్రౌండ్ వంతెనలతో పాటు ఆర్‌వోబీ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రూ.120 కోట్లకు పైబడి పల్లెపండగ పనులు చేపట్టామన్నారు. జలజీవన్ మిషన్ నిధులు మంజూరు కావాల్సి ఉందని, మూడు నెలల్లో పనులు పూర్తిస్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గజపతినగరంలో జాతీయ రహదారి నుంచి మెంటాడ రైల్వేగేటు వరకు రూ.54లక్షలతో కల్వర్టు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్లాప్టిక్ నియంత్రణ కీలకమని, పల్లెలు, పట్టణ ప్రాంతాల పరిసరాలు కలుషితం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీదర్, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాలరాజు, గజపతినగరం, బొండపల్లి టీడీపీ మండల అధ్యక్షులు గంట్యాడ శ్రీదేవి, రాపాక అచ్చుంనాయుడు, పీఏసీఎస్ చైర్మన్ లెంకబంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం
మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, సెర్ప్, విదేశీవ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. సోమవారం విజయనగరంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఐదు లక్షల మందిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ మంది సభ్యులు డ్వాక్రా సంఘాల్లో ఉన్నారని, వారు పొదుపు చేసిన మొత్తం కూడా అధికంగా ఉందన్నారు. గతంతో పోల్చితే రుణాల పంపిణీ ప్రక్రియ మరింత సులభతరం చేశామన్నారు. కొత్తగా రెండు యాప్‌లను రూపొందించామని, ఆ యాప్‌ల ద్వారా రుణ వాయిదాల పరిస్థితిని ఇంటి వద్ద వుండి సెల్‌ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 175 నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటవుతున్నాయని, ఈ పార్కుల్లో కూడా డ్వాక్రా మహిళలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు.