Robbery of jewelry మెడపై కత్తిపెట్టి నగల దోపిడీ
ABN , Publish Date - May 21 , 2026 | 12:10 AM
Robbery of jewelry నగల కోసం అమానవీయంగా ప్రవర్తించారు. వృద్ధురాలు అన్న జాలి కూడా లేకుండా దారుణానికి తెగించారు. మెడపై కత్తి పెట్టి నగలను డిమాండ్ చేశారు. ఆపై చెవుల కమ్మలను బలవంతంగా తెంపేశారు. నొప్పిపుడుతోందని ప్రాధేయపడినా వదలకుండా తెంపుకుని పారిపోయారు. దుండగుల దాడిని ఆమె కన్నీరు పెడుతూ స్థానికులకు తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ఘటన గురించి ఆమె తెలిపిన వివరాల మేరకు..
మెడపై కత్తిపెట్టి నగల దోపిడీ
వృద్ధురాలి పట్ల అమానవీయ ప్రవర్తన
చెవుల కమ్మలను బలవంతంగా తెంపిన దుండగలు
కుమరాంలో ఘటన
జామి, మే 20 (ఆంధ్రజ్యోతి):
నగల కోసం అమానవీయంగా ప్రవర్తించారు. వృద్ధురాలు అన్న జాలి కూడా లేకుండా దారుణానికి తెగించారు. మెడపై కత్తి పెట్టి నగలను డిమాండ్ చేశారు. ఆపై చెవుల కమ్మలను బలవంతంగా తెంపేశారు. నొప్పిపుడుతోందని ప్రాధేయపడినా వదలకుండా తెంపుకుని పారిపోయారు. దుండగుల దాడిని ఆమె కన్నీరు పెడుతూ స్థానికులకు తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ఘటన గురించి ఆమె తెలిపిన వివరాల మేరకు..
కుమరాం గ్రామానికి చెందిన పల్లంట్లి పాప (65) తన ఇంట్లో ఒక్కర్తే ఉంటోంది. కుమారుడు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ విజయనగరంలో నివాసం ఉంటున్నాడు. కుమార్తె తన ఇంటి ఎదురుగా వేరొక ఇంట్లో ఉంటోంది. వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్న విషయం గమనించిన అగంతకులు ప్రణాళిక ప్రకారమే దాడికి ఒడిగట్టారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంటి గేటు తాళం పగులకొట్టారు. ముందుడోరును తీసేందుకు చాలా సేపు ప్రయత్నించి రాకపోవడంతో తలుపును బలంగా లోపలికి నెట్టేశారు. ఆ శబ్దానికి మేల్కొన్న వృద్ధురాలు పాప ఎవరంటూ భయంతో కేకలు పెట్టారు. వచ్చిన ఇద్దరిలో ఒక్కరు ఆమె మెడపై కత్తిపెట్టి అరిస్తే చంపేస్తామని బెదిరించారు. దీంతో వృద్ధురాలు మిన్నకుండిపోయింది. ఇదే సమయంలో మెడలో వున్న నాలుగు తులాల బంగారు నగతో పాటు చెవులకు ఉన్న తులం కమ్మలు బలవంతంగా లాగేశారు. నొప్పిగా ఉందని ప్రాధేయపడినా వీడలేదు. బాధతో వృద్ధురాలు గట్టిగా అరవడంతో వారు పారిపోయారు. అనంతరం పక్కంటివారి సహాయంతో బుధవారం వేకువజామున 3గంటల సమయంలో డయల్ 100 ద్వారా సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ వైవీ జనార్ధన్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విజయనగరం నుంచి క్లూస్ టీం, డాగ్‌స్క్యాడ్ రప్పించారు. ఇంటి సమీపంలో వున్న ఐదు సీసీ కెమెరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్‌ఐ జనార్దన్ తెలిపారు.