Roads పల్లె ప్రగతికి ‘బాటలు’
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:25 AM
Roads Pave the Way for Rural Progress వీబీజీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవిక మిషన్ ) పథకంలో గ్రావెల్ రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా గతంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరై మధ్య నిలిచిపోయిన రహదారుల పనులకూ మోక్షం కల్పించనుంది.
374 పంచాయతీల నుంచి వెళ్లిన ప్రతిపాదనలు
త్వరలోనే పనులు ప్రారంభం
పార్వతీపురం, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): వీబీజీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవిక మిషన్ ) పథకంలో గ్రావెల్ రహదారుల నిర్మాణాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా గతంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరై మధ్య నిలిచిపోయిన రహదారుల పనులకూ మోక్షం కల్పించనుంది. వీబీజీ రామ్‌జీ కింద జిల్లాలోని 451 పంచా యతీల్లో రహదారులు నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 374 పంచాయతీల పరిధిలో 2,243 గ్రావెల్ రహదారులు నిర్మాణాలకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ మేరకు 2,429 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణాలకు సంబంధించి త్వరలోనే ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో బలిజిపేట మండలంలో 162 రహదారులు, భామిని 74 , గరుగుబిల్లి 202 , గుమ్మలక్ష్మీపురం 32, జియ్యమ్మవలస 30, కొమరాడ 28 మండలంలో రహదారులకు ప్రతిపాదనలు అందాయి. కురుపాంలో ఏడు, మక్కువ 21, పాచిపెంట 24, పాలకొండ 26 , పార్వతీపురం 30, సాలూరు 27, సీతంపేట 24, సీతానగరం 36, వీరఘట్టంలో 34 రహదారుల నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రతిపాదనలు వెళ్లాయి. కాగా నాణ్యత లోపం తలెత్తకుండా గ్రావెల్ రహదారి నిర్మాణాలను చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. దీనిపై డ్వామా పీడీ రామచంద్రరావును వివరణ కోరగా.. ‘వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా త్వరలోనే జిల్లాలో గ్రావెల్ రహదారుల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరు చేస్తాం. కలెక్టర్ ఆమోదంతో ఈ పనులు మంజూరు చేస్తాం.’ అని తెలిపారు.