Share News

Road Expansion… రహదారి విస్తరణ.. అంతేనా?

ABN , Publish Date - Mar 17 , 2026 | 11:55 PM

Road Expansion… Is That All? డివిజన్‌ కేంద్రం పాలకొండ పట్టణంలో రహదారి విస్తరణ పనులు జరిగేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు, పట్టణవాసులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడం లేదు.

Road Expansion…  రహదారి విస్తరణ.. అంతేనా?
పాలకొండ ప్రధాన రహదారిలో నిత్యం ఇదే పరిస్థితి..

  • రోజురోజుకూ జటిలమవుతున్న ట్రాఫిక్‌ సమస్య

  • ఆక్రమణ చెరలో ప్రధాన రహదారి

పాలకొండ, మార్చి17(ఆంధ్రజ్యోతి): డివిజన్‌ కేంద్రం పాలకొండ పట్టణంలో రహదారి విస్తరణ పనులు జరిగేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు, పట్టణవాసులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడం లేదు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాకు కనెక్ట్‌విటీగా ఉండే పాలకొండ మీదుగా రోజూ వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇది అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి కావడంతో ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భారీ వాహనాలు కూడా పట్టణం మీదుగానే ప్రయాణిస్తుంటాయి. విజయనగరం- పార్వతీపురం హైవేలో ఉన్న పారాది వంతెన పనులు నత్తనడకన సాగుతుండడంతో అటువైపు వెళ్లాల్సిన భారీ వాహనాలు కూడా పాలకొండ మీదుగా వస్తున్నాయి. దీంతో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. మరోవైపు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పాలకొండ ప్రధాన రహదారిలో వేలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఆ సమయంలో రహదారి రద్దీగా మారుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇక్కట్లు రెట్టింపవుతున్నాయి.

స్థానిక ఆర్టీసీ డిపో నుంచి వీరఘట్టం జంక్షన్‌ వరకు సుమారు 2.1 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి ఇరుకుగా ఉంటుంది. కేవలం 60 అడుగుల మేర మాత్రమే రహదారి ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. వంద అడుగులు మేర రహదారి విస్తరణ పనులు చేపడితేనే.. ట్రాఫిక్‌ నియంత్రణకు అవకాశం కలుగుతుంది. అయితే ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఐటీడీఏ, ఆర్‌అండ్‌బీ శాఖాధికారులతో పాటు ప్రజా ప్రతినిధులతో చర్చలు సాగినా.. ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. రహదారి విస్తరణకు కొంతమేర ఐటీడీఏ నిధులు వెచ్చిస్తామని, మరికొంత మేర ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి నిధులు సమకూరిస్తే పనులు వేగవంతమవుతాయని అప్పటి ఐటీడీఏ పీవో శ్రీధర్‌ తెలిపారు. అయితే అప్పటి ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. సీతంపేట, వీరఘట్టంలో మాత్రం ఐటీడీఏ-ఆర్‌అండ్‌బీ నిధులతో విస్తరణ పనులు జరిగాయి.

తప్పని ట్రాఫిక్‌ చిక్కులు...

రహదారి ఇరుకుగా ఉండడంతో నిత్యం వాహనదారులకు ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పడం లేదు. ప్రధానంగా బల్లంకివీధి, కోటదుర్గమ్మ కూడలి, నాగవంశపువీధి, గాంధీబొమ్మ జంక్షన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ , వడమ, ఏలాం కూడలిలో నిత్యం వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. రెండు బస్సులు ఎదురెదురుగా వస్తే చాలు .. ఇక అంతే సంగతి. ఇక భారీ వాహనాలు వస్తే గంటలకొలదీ ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే.

ఆక్రమణలో ప్రధాన రహదారి..

పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా వాణిజ్య, వ్యాపార సముదాయాలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలువలు, ఆర్‌అండ్‌బీ స్థలాలు ఆక్రమణకు గురైనట్టు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. అనధికారికంగా రోడ్డుకిరువైపులా ఎడాపెడా తాత్కాలిక ప్రాతిపదికన చిల్లర దుకాణాలు, తోపుడు బళ్లు వెలిశాయి. దీంతో ట్రాఫిక్‌ సమస్య మరింత జఠిలమవుతుంది.

రూ.17 కోట్లతో ప్రతిపాదనలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారులపై దృష్టిసారించింది. దీనిలో భాగంగానే ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో రహదారుల విస్తరణకు చర్యలు చేపట్టింది. కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం వరకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అందుకనుగుణంగా ఆర్‌అండ్‌బీ అధికారులు కొలతలు వేశారు. పీపీపీ పద్ధతిలో హైవే పనులు చేపట్టేందుకు వీలుగా ఆర్‌అండ్‌బీ శాఖాధికా రులు అప్పట్లో ఆర్టీసీ డిపో నుంచి వీరఘట్టం జంక్షన్‌ వరకు సుమారు 2.1 కిలోమీటర్ల మేర 80 అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణకు అవసరమైన స్కెచ్‌లను తయారు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో పీపీపీ పనులు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇటీవల కాలంలో పాలకొండ పట్టణంలోని ప్రధాన రహదారిలో 2.1 కిలోమీటర్ల విస్తరణ పనులకు రాష్ట్ర సర్కారు డీపీఆర్‌ అడగడంతో రెండు నెలల కిందటే సంబంధిత అధికారులు రూ.17 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఇదిలా ఉండగా ఆర్‌అండ్‌బీ శాఖ కళింగపట్నం పోర్టు నుంచి శ్రీకాకుళం మీదుగా పార్వతీపురం వరకు నేషనల్‌ హైవేకు ప్రతిపాదించింది. ఇది కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది.

హడావుడిగా కొలతలు వేసి..

రహదారి విస్తరణ కోసం వైసీపీ ప్రభుత్వ హయాంలో హడావుడిగా కొలతలు వేశారు. అయితే పనులు చేపట్టడం మరిచారు. మరోవైపు రోజురోజుకూ ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరమవుతుంది.

- ఏ.రామినాయుడు, పాలకొండ

=============================

రాకపోకలకు ఇబ్బందులు

పాలకొండ పట్టణంలో ప్రధాన రహదారి ఇరుకుగా ఉంది. దీంతో వాహనాలు రాకపోకలు సాగించడం కష్టసాధ్యమవుతుంది. రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ట్రాఫిక్‌ సమస్య మరింత జఠిలమవుతుంది. విస్తరణ పనులు చేపడితేనే ఇబ్బందులు తొలుగుతాయి.

- ఎం.జగదీష్‌, వ్యాపారి, పాలకొండ

=============================

విస్తరణ పనులకు ప్రతిపాదనలు

పాలకొండ పట్టణంలోని ప్రధాన రహదారిలో 2.1 కిలోమీటర్ల విస్తరణ పనులకు రెండు నెలల కిందటే రూ.17 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం.

- జగన్నాథరావు, డీఈఈ, ఆర్‌అండ్‌బీ

Updated Date - Mar 17 , 2026 | 11:55 PM