Road Construction at a Cost of ₹105 Crore రూ.105 కోట్లతో రహదారుల నిర్మాణం
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:55 PM
Road Construction at a Cost of ₹105 Crore జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సుమారు రూ.105 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నామని వెల్లడించారు. ఆదివారం సాలూరులోని తన నివాసంలో విలేఖర్లతో మాట్లాడారు.
మంత్రి సంధ్యారాణి
సాలూరు, జనవరి4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సుమారు రూ.105 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నామని వెల్లడించారు. ఆదివారం సాలూరులోని తన నివాసంలో విలేఖర్లతో మాట్లాడారు. ‘ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పించాలనే ఉద్దేశంతో ఏజెన్సీలో రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గత సంవత్సరం రూ.1300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల కోసం రూ.350 కోట్లు వెచ్చించాం. ఈ ఏడాది ఆయా చోట్ల ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్లు, మెస్‌ల ఏర్పాటుకు రూ.37.50 కోట్లు మంజూరయ్యాయి. సాలూరు నియోజకవర్గానికి రూ.93 లక్షలు , పార్వతీపురానికి రూ.35 లక్షలు, పాలకొండకు రూ.39 లక్షల చొప్పున విడుదలయ్యాయి. మొత్తంగా జిల్లాలో 236 మరుగుదొడ్లు, నాలుగు ఆర్వో ప్లాంట్లు, ఆరు మెస్‌ల నిర్మాణానికి రూ.8.69 కోట్లు మంజూరయ్యాయి. సాలూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూలేని విధంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారు. వారు పద్ధతి మార్చుకోవాలి. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి తప్ప లేనిపోనివి మాట్లాడకూడదు.’ అని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ, టీడీపీ పట్టణ నాయకులు తిరుపతిరావు, వేణుగోపాలనాయుడు, పరమేశు తదితరులు పాల్గొన్నారు.