ఆర్వో ప్లాంట్లు పనిచేయట్లే!
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:41 PM
జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు.
- పాఠశాలల్లో మూలకు చేరిన పరికరాలు
- గత వైసీపీ ప్రభుత్వంలో నాణ్యతకు తిలోదకాలు
- రూ.కోట్లలో ప్రజాధనం వృథా
- వచ్చే విద్యాసంవత్సరానికైనా బాగుపడేనా?
రాజాం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. విద్యార్థులకు శుద్ధ జలాలను అందించాలనే లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అయితే, పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. నాసిరకం పరికరాలను అమర్చడంతో అవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. దీంతో చాలా ప్లాంట్లు మూలకు చేరాయి. ఫలితంగా విద్యార్థులు ఇంటి నుంచి తాగునీటిని తీసుకువస్తున్నారు. మరో వారం రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించనుంది. వచ్చే విద్యాసంవత్సరానికైనా ఈ ఆర్వో ప్లాంట్లను బాగు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
రూ.400 కోట్లు ఖర్చు..
వైసీపీ హయాంలో జిల్లాలో తొలి విడత ‘నాడు-నేడు’ పథకంలో భాగంగా 841 పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు మంజూరయ్యాయి. కానీ, 680 పాఠశాలల్లో మాత్రమే ఏర్పాటు చేశారు. ఇందుకుగాను రూ.183 కోట్లు ఖర్చుచేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రెండో విడతలో 738 పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు మంజూరుకాగా.. రూ.231 కోట్లు ఖర్చుచేశారు. రెండు విడతల్లో కలిపి ఆర్వో ప్లాంట్ల నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా ఈ ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. అప్పట్లో ఆహ్లాద ఇంజనీర్స్ లిమిటెడ్, ఇన్నోవేటివ్ ఇండస్ర్టీస్, లివ్‌ప్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పలు కంపెనీల నుంచి ఆర్వో ప్లాంట్లను తెప్పించారు. సాంకేతిక సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. కానీ, ప్రస్తుతం ప్లాంట్లు పనిచేయడం లేదని హెచ్‌ఎంలు ఫోన్ చేస్తుంటే టెక్నికల్ సిబ్బంది స్పందించడం లేదు. దీంతో హెచ్‌ఎంలు సైతం మౌనం దాల్చల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్వో ప్లాంట్లు పనిచేయకపోవడంతో తాగునీటి కోసం విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్వో ప్లాంట్లను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. అయితే, బాగు చేసిన కొన్ని రోజులకే మళ్లీ పనిచేయడం లేదు. నాసిరకం పరికరాలు కావడడమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీంతో విద్యార్థులు బోర్లు, కుళాయిల నీటిని తాగుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యంనాయుడును వివరణ కోరగా.. ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమే. అయినాసరే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం. దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. ఇప్పటికే సంబంధిత కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి బాగుచేయాలని చెప్పాం.’ అని తెలిపారు.