No Irrigation Water! చెంతనే నది ఉన్నా.. సాగునీటికి అవస్థే!
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:14 PM
River Nearby, Yet No Irrigation Water! వంశధార నది చెంతనే ఉన్నా.. భామిని మండల రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఖరీఫ్, రబీ సీజన్లలో బోర్లుపై ఆధారపడి సాగు చేపట్టాల్సి వస్తోంది. ఏటా ఈ పరిస్థితి ఉన్నా.. పట్టించుకునేవారే కరువయ్యారు.
వంశధార నుంచి అందని నీరు
బోర్లు ఆధారంగా సాగు
మరికొన్నిచోట్ల వరుణుడు కరుణిస్తేనే సేద్యం
ఏటా రైతులకు తప్పని ఇబ్బందులు
భామిని, మార్చి9(ఆంధ్రజ్యోతి): వంశధార నది చెంతనే ఉన్నా.. భామిని మండల రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఖరీఫ్, రబీ సీజన్లలో బోర్లుపై ఆధారపడి సాగు చేపట్టాల్సి వస్తోంది. ఏటా ఈ పరిస్థితి ఉన్నా.. పట్టించుకునేవారే కరువయ్యారు. మండలంలో గురండి, నేరడి, కాట్రగడ, బత్తిలి, భామిని తదితర గ్రామాల్లో రైతులు రబీ కింద వరిసాగు చేపడుతున్నారు. లివిరి, దిమ్మిడిజోల, బాలేరు, ఘనసర, తాలాడ, కీసర, కోసలి గ్రామాల్లో మొక్కజొన్న, కూరగాయలు పంటలు వేశారు. కాగా గురండి, నేరడి కాట్రగడలో అత్యధికంగా 959 బోర్లు ద్వారా రబీ సాగు చేస్తున్నారు. ఇతర గ్రామాల్లో 20 శాతం వరకే బోర్లు పడుతున్నాయి. శివ్వకొండ దిగువ ప్రాంత గ్రామాలకు బోర్లు పడడం లేదు. దీంతో ఏటా వరుణుడిపైనే ఆధారపడి వారు పంటలను పండించాల్సి వస్తోంది.
మండలంలో సుమారు 30కిలోమీటర్ల మేర వంశధార నది ప్రవహిస్తున్నా.. ఇక్కడి భూములకు చుక్కనీరందని కారణంగా.. కాట్రగడ, నేరడి వద్ద 2019లో టీడీపీ ప్రభుత్వం రెండు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. మరోవైపు జలయజ్ఞంలో భాగంగా భామిని సమీపంలో చేపట్టిన కొండలోయగెడ్డ రిజర్వాయర్ పనులు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వంశధార వరద కాలువ పనులు కూడా పూర్తి కావడం లేదు. దీంతో పిల్లకాలువల ద్వారా భూములకు సాగునీరండం రైతులకు కలగానే మిగిలింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై ఏవో తిలక్‌ను వివరణ కోరగా.. ‘రబీలో భాగంగా సుమారు 2,500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఎరువుల నిల్వలు ఉన్నాయి. మండలానికి 180 టన్నులు యూరియా, 40 టన్నుల డీఏపీ అందుబాటులో ఉంచాం.’ తెలిపారు. కాగా వ్యవసాయ బోర్లుకు తొమ్మిది గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు ఏఈ రాజ్‌కుమార్ చెప్పారు. ‘వంశధార పనులు పూర్తి చేసి.. పిల్ల కాలువల ద్వారా భామిని మండలానికి సాగునీరు అందిస్తాం. కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్లే 87వ ప్యాకేజీలో పనులు జరగడం లేదు. దీనిపై నోటీసులు అందించాం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి తగు చర్యలు తీసుకుంటాం.’ ప్రాజెక్టు ఎస్‌ఐ రామచంద్రరావు తెలిపారు.