Share News

Supply Disruptions పెరిగిన వాడకం.. సరఫరాకు ఆటంకం

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:02 AM

Rising Demand, Supply Disruptions ఎల్‌నినో ప్రభావం విద్యుత్‌ వినియోగంపై పడింది. దీంతో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో వాడకం పెరిగింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడం, వేసవిని తలపించేలా ఎండ ఠారెత్తిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అడపాదడపా వానలు కురుస్తున్నా.. వాతావరణంలో వేడి, ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. దీంతో గతేడాదితో పోలిస్తే జిల్లాలో విద్యుత్‌ వాడకం గణనీయంగా పెరిగింది. ఇంధన సంస్థలు డిమాండ్‌ మేరకు విద్యుత్‌ను సరఫరా చేయలేక సతమతమవుతున్నాయి. దీంతో ‘ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌’ పేరుతో అప్రకటిత కోతలు తప్పనిసరి అవుతున్నాయి.

 Supply Disruptions  పెరిగిన వాడకం..  సరఫరాకు ఆటంకం
గరుగుబిల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

  • ఈఎల్‌ఆర్‌ పేరుతో కరెంట్‌ కోతలు.. రాత్రిపూటే అధికం

  • పల్లెలు, పట్టణాల్లో అదే పరిస్థితి

  • గిరిశిఖర గ్రామాల్లో తరచూ సరఫరా నిలిపివేత

  • రైతులు, ప్రజలకు తప్పని ఇబ్బందులు

పార్వతీపురం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం విద్యుత్‌ వినియోగంపై పడింది. దీంతో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో వాడకం పెరిగింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడం, వేసవిని తలపించేలా ఎండ ఠారెత్తిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అడపాదడపా వానలు కురుస్తున్నా.. వాతావరణంలో వేడి, ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. దీంతో గతేడాదితో పోలిస్తే జిల్లాలో విద్యుత్‌ వాడకం గణనీయంగా పెరిగింది. ఇంధన సంస్థలు డిమాండ్‌ మేరకు విద్యుత్‌ను సరఫరా చేయలేక సతమతమవుతున్నాయి. దీంతో ‘ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌’ పేరుతో అప్రకటిత కోతలు తప్పనిసరి అవుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో అనధికారిక విద్యుత్‌ కోతలు కొనసాగుతున్నాయి. ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) పేరుతో అర్ధరాత్రి సైతం సరఫరాను నిలిపివేస్తున్నారు. విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఎటువంటి కోతలు లేవని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే సరఫరాకు అంతరాయం కలుగుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలుండే చోట వర్షాభావం నెలకొంది. దీంతో నీటి లభ్యత లేదు. ఈ కారణంగా జల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో పవన, సోలార్‌ విద్యుత్‌ అవసరానికి సరిపడా ఉత్పత్తి లేదు. దీంతో అనధికారిక విద్యుత్‌ కోతలు తప్పడం లేదు. కొద్దిరోజులుగా రాత్రిపూట సరఫరా నిలిపివేస్తుండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

జిల్లాలో 2,56,004 గృహ విద్యుత్‌ కనెక్షన్లు , 21,903 వ్యవసాయ మోటార్లు కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సుమారు రెండు గంటల వరకు కోతలు విధిస్తున్నారు. అయితే రోజులో కరెంట్‌ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కోతల కారణంగా ఖరీఫ్‌ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పంపు కనెక్షన్లకు ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విద్యుత్‌ సరఫరా ఉండకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలో చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. అయితే కోతల ప్రభావం పలు ప్రాంతాల్లో ఉన్న రైస్‌మిల్లులపై పడుతోంది. దీనిపై ట్రాన్స్‌కో ఎస్‌ఐ త్రినాథరావును వివరణ కోరగా.. ‘రోజుకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తున్నాం. బ్రేక్‌ డౌన్‌ అయితేనే అప్పుడప్పుడు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు విధిస్తున్నాం. పట్టణాల్లో కోతలు లేవు. జిల్లాలో విద్యుత్‌ వినియోగం పెరిగింది. ’ అని తెలిపారు.

పలు ప్రాంతాల్లో ఇలా..

- గరుగుబిల్లి : మండలంలో పలు గ్రామాల్లో ఈఎల్‌ఆర్‌ పేరిట రెండు గంటల పాటు విద్యుత్‌ కోత విధిస్తున్నారు. అయితే రోజూ సాయంత్రం 5 గంటల నుంచి కోత విధిస్తుండగా.. తిరిగి ఎన్ని గంటలకు వస్తుందో తెలియని పరిస్థితి. ఒక వైపు చీకటి, మరోవైపు దోమలు, ఉక్కపోతతో గ్రామీణ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోటార్ల ఆధారంగా వ్యవసాయం చేసే రైతులు విద్యుత్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక రైస్‌మిల్లుల్లో పనిచేసేవారు ఉపాఽధికి దూరమవుతున్నారు. ‘విద్యుత్‌ వాడకం పెరిగిన కారణంగా రాష్ట్ర స్థాయిలోనే సరఫరా తగ్గింది. దీంతో పైస్థాయిలోనే కోతలు విధిస్తున్నారు. ప్రస్తుతం నాలుగైదు రోజుల ఉంచి విద్యుత్‌ కోతలు విధించడం లేదు.’ అని ఏఈ బి.శ్రీనివాసులనాయుడు తెలిపారు.

- సాలూరు: అప్రకటిత విద్యుత్‌ కోతలు పట్టణంతో పాటు మండవాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా గిరిశిఖర గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. చిన్న గాలివీచినా, వర్షం పడినా సరఫరా నిలిచిపోతోంది. మామి డిపల్లి, గంగన్నదొరవలస, మావుడిలో ఫీడర్లు ఉండగా వాటి పరిధిలోని గ్రామాలకు ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

- పాచిపెంట రూరల్‌: మండలంలో వారం కిందట రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కోతలు విధించేవారు. ప్రస్తుతం రోజులో ఒక గంట పాటు కోత విఽఽధిస్తున్నారు.

- వీరఘట్టం: వారం రోజుల కిందట రోజులో 2 గంటల పాటు మండలంలో విద్యుత్‌ కోత విధించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోయినా.. ఒక గంట వరకూ సరఫరా నిలిచిపోతుంది. మొక్కజొన్న, వరి పంటల రైతులకు రాత్రి సమయాల్లో పొలాలకు మోటార్లు వేసుకోవాల్సి వస్తోంది. భామిని మండలంలో కొద్దిరోజుల కిందట రాత్రి వేళల్లో నాలుగు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయేది. ప్రస్తుతం రోజులో రెండు గంటల పాటు కోత విధిస్తున్నారు. సీతంపేట ఏజెన్సీ, పాలకొండ మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో అన్ని వర్గాల వారు ఇబ్బందులపాలవుతున్నారు.

Updated Date - Sep 16 , 2026 | 12:02 AM