``Right Right'' despite being in trouble ఇబ్బంది పడుతున్నా ‘రైట్ రైట్’
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:31 PM
``Right Right'' despite being in trouble జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యానికి అంతులేకుండా పోతోంది. అధికారుల అండ, అలసత్వం చూసుకొని పేట్రేగిపోతున్నారు. ప్రయాణ అవసరాలను అవకాశంగా తీసుకుని నచ్చినట్లు వ్యాపారం చేస్తున్నారు. ఒక బస్సుకి బుక్ చేస్తే వేరేదానికి టికెట్‌ను బదిలీ చేయడం, గమ్యస్థానానికి ఆలస్యంగా చేర్చడం, కనీస సౌకర్యాలను విస్మరించడం చేస్తున్నారు.
ఇబ్బంది పడుతున్నా ‘రైట్ రైట్’
ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యం
ఒక బస్సుకి బుక్ చేస్తే వేరేదానికి టికెట్ బదిలీ
సకాలంలో గమ్యస్థానాలకు చేరడం అనుమానమే
కనీస సౌకర్యాలు కరువు
నైట్ ట్రిప్పులతో దాడులకు దొరక్కుండా ఎత్తుగడ
జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యానికి అంతులేకుండా పోతోంది. అధికారుల అండ, అలసత్వం చూసుకొని పేట్రేగిపోతున్నారు. ప్రయాణ అవసరాలను అవకాశంగా తీసుకుని నచ్చినట్లు వ్యాపారం చేస్తున్నారు. ఒక బస్సుకి బుక్ చేస్తే వేరేదానికి టికెట్‌ను బదిలీ చేయడం, గమ్యస్థానానికి ఆలస్యంగా చేర్చడం, కనీస సౌకర్యాలను విస్మరించడం చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారు.
విజయనగరం క్రైం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు దాదాపుగా 20 దాటి ఉంటాయని అంచనా. విజయవాడ, హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు వెళ్లేందుకు జిల్లాకేంద్రం నుంచి డైరెక్ట్ ఆర్టీసీ బస్సులు లేకపోవడం, ఉన్నా పరిమితం కావడంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రతిరోజూ ఇటువంటి ప్రయాణికుల సంఖ్య కనిష్ఠంగా 200 పైనే ఉంటున్నారు. వీరిలో అత్యధిక శాతం ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఇక్కడే కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొదట్లో టికెట్స్ బుక్ అయితే ఇబ్బందులు ఉండవు ఆఖరులో బుక్ చేసుకున్న వారికి నిర్వాహకులు చుక్కలు చూపిస్తున్నారు. చివరి నిమిషం వరకు ఏదీ చెప్పకుండా వేరే బస్సుకి టికెట్లను బదలాయించడం పనిగా పెట్టుకుంటున్నారు. ఆ బస్సు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. నిర్వాహకులు కూడా ఏ విషయమూ స్పష్టంగా చెప్పరు. టికెట్‌ను బదిలీ చేశామన్న సమాచారమిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ఈబదిలీ సమాచారం కూడా అందరికీ తెలియడం లేదు.
ఐదారు గంటలు ఆలస్యంగా..
వారు బదిలీ చేసిన బస్సు ఒక్కోసారి ఐదారు గంటలు ఆలస్యంగా వస్తూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. మర్నాడు ఉదయం విజయవాడ లేదా హ్తెదరాబాదులో డ్యూటిలో చేరాల్సినవారు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. టెన్షన్‌తో ప్రయాణం చేస్తున్నారు.
- బస్సు మరమ్మతులకు గురైతే అప్పుడు కూడా బదలాయింపు తిప్పలు తప్పడంలేదు. బదలాయించిన బస్సు వచ్చేవరకు నిరీక్షణ ప్రయాణికులకు నరకప్రాయంగా మారుతోంది.
నంబరు ప్లేట్ల మాయాజాలం
ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల బరితెగింపులో నంబర్ ప్లేట్ల మాయాజాలం అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ప్రతి ట్రావెల్ నిర్వాహకుడు బస్సు నంబర్ ప్లేటుకు నాలుగైదు డూప్లికేట్లు సిద్ధంగా ఉంచుకుంటున్నారు. బుక్ చేసుకున్న బస్సు బ్రేక్ డౌన్ అయినా, మరే కారణంతో బయలుదేరకపోయినా, అప్పటికప్పుడు తీసుకొచ్చే బస్సు నంబర్ ప్లేటును తొలగించి ఆ స్థానంలో తమ బస్సుకు సంబంధించిన స్పేర్ నంబర్ ప్లేటును తగిలిస్తున్నారు.
ఎవరు బాధ్యులు ?
బుక్ చేసుకున్న బస్సు కాని, టికెట్ బదలాయించబడిన బస్సు కాని మార్గమధ్యలో ప్రమాదానికి గురైతే ఆ నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్నకు ఏ నిర్వాహకుడి వద్ద సమాధానం ఉండడంలేదు. టికెట్ బుక్ చేయకపోయినా సీట్లు ఖాళీగా ఉంటే ప్రయాణికులను మార్గమధ్యలో ఎక్కిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. అధికారులు తనిఖీ చేయకపోవడంతో వారు చేసిందే రైట్ అయిపోతోంది.
సౌకర్యాలు అడగొద్దు
చాలా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో సౌకర్యాలు ఎండమావిని గుర్తుచేస్తున్నాయి.పైపై హంగులు, మెరుపులతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న నిర్వాహకులు సౌకర్యాలు గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. బెర్తులు, సీట్లు మురికిపట్టి ఉన్నా స్పందించరు. బస్సులోపల పరిశుభ్రత అంతంతమాత్రమే. ప్రైవేటు ట్రావెల్స్ విషయంలో రవాణాశాఖ అధికారుల తీరుపై ప్రయాణికుల్లో అసహనం పెరుగుతోంది. వారి ఉదాసీనత వల్లే నిర్వాహకుల్లో నిర్లక్ష్యం పేరుకుపోతోందని ఆవేదన చెందుతున్నారు.