Share News

Rice ఇంకా కొన్ని డిపోలకు బియ్యం చేరలే!

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:36 AM

Rice Yet to Reach Several Depots జిల్లాలో పలు రేషన్‌ డిపోలకు ఈ నెల ఇంకా బియ్యం పంపిణీ కాలేదు. వాహనాల కొరత, రవాణా చార్జీలు గిట్టుబాటు కాకపోవడంతో వాహన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఏడో తేదీ దాటిపోయినా ఇంకా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి అనేక రేషన్‌ డిపోలకు బియ్యం చేరలేదు.

Rice  ఇంకా కొన్ని డిపోలకు  బియ్యం చేరలే!
జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌

  • వేధిస్తున్న వాహనాల కొరత

  • గిట్టుబాటు కాని రవాణా చార్జీలు

  • ఈ కారణాలతో ముందుకు రాని వాహనదారులు

  • 15వ తేదీలోపు పూర్తి స్థాయిలో పంపిణీ ఎలా?

  • ఆందోళనలో కార్డుదారులు

పార్వతీపురం, జూలై7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు రేషన్‌ డిపోలకు ఈ నెల ఇంకా బియ్యం పంపిణీ కాలేదు. వాహనాల కొరత, రవాణా చార్జీలు గిట్టుబాటు కాకపోవడంతో వాహన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఏడో తేదీ దాటిపోయినా ఇంకా ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి అనేక రేషన్‌ డిపోలకు బియ్యం చేరలేదు. దీంతో కార్డుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా ఈనెల 15లోపు పూర్తిస్థాయిలో సరఫరా జరుగుతుందా? లేదా! అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ పరిస్థితి...

- జిల్లాలో 578 డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలో 2,82,865 రేషన్‌కార్డులు ఉన్నాయి. ప్రతినెలా 8,41,899 మంది కార్డుదారులకు 21,690 క్వింటాళ్లు బియ్యం సరఫరా చేస్తున్నారు. పార్వతీపురం, సీతంపేట, మక్కువ, పాచిపెంట ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ , సాలూరు, గుమ్మ లక్ష్మీపురం, కురుపాం జీసీసీ గోడౌన్ల నుంచి డిపోలకు బియ్యం సరఫరా జరుగుతుంది. అయితే తాజాగా ఈ నెలలో పార్వతీపురం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి కొమరాడ మండలంలో దలైపేట, కొట్టు, మాదలంగి, తుడుము, కె.గుంప, కళ్లికోట, నిమ్మలపాడు, చీడిపల్లి గ్రామాల్లో రేషన్‌ డిపోలకు రైస్‌ పంపిణీ కాలేదు. గరుగుబిల్లి మండలం నాగూరు, లక్నాపురం, ఉల్లిభద్ర, వల్లరగొడబ, పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం, బిలిజిపేట మండలం చాకరాపల్లి గ్రామాల్లోని డిపోల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

- ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి డిపోలకు బియ్యం రవాణా చేసేందుకు అధికారులు స్థాని కంగా వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పెరుగుతున్న డీజిల్‌ ధరలు , హమా లీలు వేతనాలకు తగ్గట్టుగా వాహనాలకు చెల్లిస్తున్న రవాణా ఖర్చులు గిట్టుబాటు కావడం లేదు. మరో వైపు వాహన కొరత కూడా ఉండడంతో వాహనదారులు బియ్యం సరఫరాకు ముందుకు రావడం లేదు. ఇకపై ఈ సమస్య ఉత్పన్నమవకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

చెల్లింపులు ఇలా..

- గతంలో పార్వతీపురం నుంచి మైదాన ప్రాంత రేషన్‌ డిపోలకు బియ్యం సరఫరా చేసేందుకు క్వింటాకు రూ.21.30 చొప్పున వాహనాలకు ఇచ్చేవారు. ఆ తర్వాత 15 శాతం పెంచి 37.45గా నిర్ణయించారు.

- సీతంపేట ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి వాహనాలకు గతంలో రూ.24.05 ఇచ్చేవారు. తాజాగా 20 శాతం పెంచి రూ.28.86 చెల్లిస్తున్నారు.

- గతంలో మక్కువ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి రూ.23.06 అందించేవారు. తాజాగా 15 శాతం పెంచి రూ. 27.14 అందిస్తున్నారు.

- పాచిపెంట ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి డిపోలకు బియ్యం రవాణా చేసేందుకు గతంలో రూ.20.45 ఇచ్చేవారు. 15 శాతం పెంచి ఇప్పుడు రూ.23.511 ఇస్తున్నారు.

- పాలకొండ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి బియ్యం డిపోలకు రవాణా చేసేందుకు వాహ నాలకు గతంలో రూ.21.60 ఇచ్చేవారు. తాజాగా 9.9 శాతం పెంచి రూ.23.73 చెల్లిస్తున్నారు. ఘాట్‌రోడ్లపై ఉన్న రేషన్‌ డిపోలకు బియ్యం సరఫరా చేసేందుకు కూడా వాహనాలకు గతంలో కంటే అధికంగా రవాణా చార్జీలు పెంచారు. అయినప్పటికీ వాహనదారులు మాత్రం బియ్యం సరఫరాకు ముందుకు రావడం లేదు.

- హమాలీలకు కూడా గతంలో ఇచ్చే వేతనం కంటే 12.5 శాతం అదనంగా పెంచి ఇస్తున్నారు.

రేషన్‌ సరుకులు సకాలంలో అందించాలి: కలెక్టర్‌

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు సకాలంలో నిత్యావసర సరుకులు అందించా లని అధికారులను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెలలో జిల్లాకు 42,230.44 మెట్రిక్‌ టన్నుల బియ్యం, చక్కెర కేటాయించగా.. 578 రేషన్‌ దుకాణాల్లో 563 డిపోలకు 97 శాతం సరఫరా అయిందన్నారు. మిగిలిన దుకాణాలకు వెంటనే సరుకులు చేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకానికి సక్రమంగా పోషకాహార సరుకులు సరఫరా చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు త్వరగా పెండింగ్‌ చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు.

===============================

పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తాం

వాహనాల కొరత, వర్షం, హమాలీల సమ్మె తదితర కారణాల వల్ల ఈ నెల కొన్ని డిపోలకు సకాలంలో బియ్యం పంపిణీ జరగని మాట వాస్తవమే. కొన్ని బియ్యం బిస్తాలు తడిసిపోయాయి. ఇంకా 15 డిపోలకు బియ్యం వెళ్లాల్సి ఉంది. రేపటిలోగా పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తాం. పార్వతీపురం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పరిధిలో 167 డిపోలకు గాను 152 డిపోలకు బియ్యం సరఫరా చేశాం. మరో 15 డిపోలకు బియ్యం పంపించాల్సి ఉంది. పాచిపెంట మండలం జీలికి వలస గ్రామ రహదారి బాగో లేకపోవడం వల్ల బియ్యం సరఫరా కాలేదు.

- కె.శ్రీనివాసులు, మేనేజర్‌, జిల్లా సివిల్‌ సప్లైస్‌

Updated Date - Jul 08 , 2026 | 12:36 AM