Share News

Rice prices on the rise... బియ్యం ధరలు పైపైకి..

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:35 AM

Rice prices on the rise... మార్కెట్‌లో పేరుమోసిన బ్రాండ్‌ బియ్యం 25 కిలోల బస్తా ధర జూన్‌ నెలలో రూ.1300గా ఉండేది. ప్రస్తుతం అదే బ్యాగు ధర రూ.1670కు చేరుకుంది. మధ్యలో జూలై నెలలో రూ.1570గా ఉండగా.. ఈ రెండు నెలల్లోనే మరో రూ.100 పెరిగింది. దీంతో వినియోగదారులపై మూడు నెలల కాలంలో రూ.370 భారం పడింది. మిగతా బ్రాండ్లు కూడా అటుఇటుగా రూ.300 వరకు ధర పెరిగాయి.

Rice prices on the rise...    బియ్యం ధరలు పైపైకి..

బియ్యం ధరలు పైపైకి..

మూడు నెలల్లో రూ.300!

అమాంతం పెరిగిన సన్నబియ్యం ధరలు

సామాన్యులు, మధ్యతరగతి వారిపై భారం

రైతుబజార్లలో రాయితీపై విక్రయాలు అంతంతమాత్రం

మార్కెట్‌లో పేరుమోసిన బ్రాండ్‌ బియ్యం 25 కిలోల బస్తా ధర జూన్‌ నెలలో రూ.1300గా ఉండేది. ప్రస్తుతం అదే బ్యాగు ధర రూ.1670కు చేరుకుంది. మధ్యలో జూలై నెలలో రూ.1570గా ఉండగా.. ఈ రెండు నెలల్లోనే మరో రూ.100 పెరిగింది. దీంతో వినియోగదారులపై మూడు నెలల కాలంలో రూ.370 భారం పడింది. మిగతా బ్రాండ్లు కూడా అటుఇటుగా రూ.300 వరకు ధర పెరిగాయి.

రాజాం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో బియ్యం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వారు నిర్ఘాంతపోతున్నారు. మూడు నెలల కిందట వరకూ కిలోరూ.50గా ఉన్న సన్నబియ్యం ధర..ప్రస్తుతం రూ.80 వరకూ పెరిగింది. దాదాపు అన్నిరకాల బ్రాండ్ల సన్న బియ్యానిదీ అదే పరిస్థితి. ఎల్‌నినో నేపథ్యంలో ముందు ముందు ఎలా ఉంటుందోనని సగటు జిల్లా వాసి ఆందోళన చెందుతున్నాడు. ఈ ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. జిల్లాలో రెండు లక్షల 60 వేల ఎకరాల వరకూ వరి సాగు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకూ పావు వంతు కూడా ఉబాలు జరగలేదు. ప్రస్తుతం వర్షాలు పడడంతో కొంతవరకూ దమ్ములు చేపట్టే అవకాశం ఉంది. కానీ ఈ ఏడాది వరి పంటపై రైతులు పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. అధికారులు సైతం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో బియ్యం కొరత ఏర్పడవచ్చు. ప్రస్తుతం కూడా రైతులు పాత ధాన్యాన్ని తమ వద్ద ఉంచుకోగా.. ఇదే అదునుగా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బియ్యాన్ని అధిక ధరకు విక్రయిస్తున్నారు.

ఆ బ్రాండ్ల వినియోగం అధికం..

జిల్లాలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు ఎక్కువగా సన్నబియ్యం వినియోగిస్తున్నారు. 20 రకాల బ్రాండ్ల వరకూ సన్నబియ్యం అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కువగా సమీర, లలిత, బెల్‌, అక్షయ వంటి బ్రాండ్లను వినియోగిస్తుంటారు. గత రెండు నెలల కాలంలో 25 కిలోల బస్తా వద్ద రూ.370 ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జూన్‌లో బస్తా రూ.1280-రూ.1300 మధ్య ఉండేది. ప్రస్తుతం రూ.1600, రూ.1670 వరకూ చేరుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబంలో రోజుకు సగటున కిలోచొప్పున నెలలో 30 కిలోల వరకూ వినియోగిస్తున్నారు. దీంతో ఖర్చు భారీగా పెరుగుతోంది. జీవనంపై ప్రభావం చూపుతోంది.

రాయితీ బియ్యం ఎక్కడ?

రాయితీపై సన్న బియ్యాన్ని అందిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. రైతుబజార్లలో ప్రత్యేక స్టాళ్ల ద్వారా అందిస్తామని చెప్పింది కానీ జిల్లాలో అరకొరగానే అందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి తెల్ల రేషన్‌కార్డుదారుడికి 10 కిలల స్టీమ్‌ రకం బియ్యాన్ని కిలో రూ.52, సాధారణ రకం రూ.50 చొప్పున విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 5.71 లక్షల మంది తెల్ల రేషకార్డుదారులు ఉన్నారు. నెలకు వీరికి రేషన్‌ కింద 9159.165 టన్నుల బియ్యాన్ని అందిస్తున్నారు. ఈ లెక్కన రాయితీపై 5,700 టన్నులకుపైగా అందించాలి. ప్రస్తుతం విజయనగరంలో రెండు రైతుబజార్లతో పాటు మరో ఐదు చోట్ల ఉన్నాయి. 22 కౌంటర్లు ఏర్పాటుచేసి విక్రయిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకూ 1118 మందికి 110.65 క్వింటాళ్లు మాత్రమే అందించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విక్రయించాల్సిన అవసరం ఉంది.

అందరికీ సన్నబియ్యం అందజేస్తాం

జిల్లా వ్యాప్తంగా రాయితీపై సన్నబియ్యం విక్రయాలు చేపట్టేలా చూస్తాం. ప్రతి తెల్ల రేషన్‌కార్డుదారుడికీ సన్న బియ్యం అందించేలా చేస్తాం. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ అవకాశాన్ని రేషన్‌కార్డుదారులు వినియోగించుకోవాలి.

మురళీనాథ్‌, పౌరసరఫరాల అధికారి, విజయనగరం

-------------------

Updated Date - Aug 24 , 2026 | 12:35 AM