అంగన్‌వాడీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:21 AM
అంగన్‌వాడీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు.
సాలూరు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాలూరులో అంగన్‌వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని అంగన్‌వాడీ కేంద్రాలకు 50 టీవీలు... అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు 1.736 యూనిఫాం చీరలు, అంగన్‌వాడీ పిల్లల కోసం 5,670 ప్లేట్లు, 5,670 గ్లాసులను ఆమె పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పిల్లల్లో శారీరక, మానసిక, సాంఘిక ఎదుగుదలకు అంగన్‌వాడీ కేంద్రాలు బలమైన పునాది వేస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంతా ల్లోని గర్భిణులు, బాలింతలకు బాల సంజీవని సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా మల్టీ గ్రెయిన్ అట్టా, రాగిపిండి, ఎండు ఖర్జూరం, చిక్కి, బెల్లం, బియ్యం, కందిపప్పు, నూనె, గుడ్లు, పాలు క్రమం తప్పకుండా అందిస్తున్నామన్నారు. చిన్నారులకు డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు టీవీలను అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 11వేలు అంగన్‌వాడీ ఉద్యోగాలను భర్తీ చేయగా, ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే 499 పోస్టులను భర్తీ చేశామన్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల రాష్ట్రంలోనే సాధారణ ప్రసవాల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.