Share News

'Revenue' with both handsరెండు చేతులా ‘రెవెన్యూ’

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:04 AM

'Revenue' with both hands ఆయనో రెవెన్యూ ఉద్యోగి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తుంటాడు. అంతే కాదు రైతుల నుంచి తక్కువ ధరకే భూములను చేజెక్కించుకుని కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట కొనుగోలు చేస్తుంటాడు. ఇదే విధంగా జిల్లాలో కీలక ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను ముందుగా తెలుసుకుని సమీప ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేశాడు. వ్యవసాయేతర భూమిగా మార్పు చేసి ప్రాజెక్టుకు అందజేసి భారీగా పరిహారం పొందేందుకు ప్రణాళిక రచించాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తున్నారు.

'Revenue' with both handsరెండు చేతులా ‘రెవెన్యూ’

రెండు చేతులా ‘రెవెన్యూ’

ఒక వైపు ఉద్యోగం... మరోవైపు రియల్‌ వ్యాపారం

కుటుంబ సభ్యులు, స్నేహితుల పేరిట ఎక్కడికక్కడే భూముల కొనుగోలు

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను ముందే గుర్తించిన ఆ అధికారి

కొనుగోలు చేసుకున్న భూమిని వ్యవసాయేతరగా మార్పు

ప్రభుత్వం నుంచి భారీగా పరిహారం పొందేందుకు వ్యూహం

ఆయనో రెవెన్యూ ఉద్యోగి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తుంటాడు. అంతే కాదు రైతుల నుంచి తక్కువ ధరకే భూములను చేజెక్కించుకుని కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట కొనుగోలు చేస్తుంటాడు. ఇదే విధంగా జిల్లాలో కీలక ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను ముందుగా తెలుసుకుని సమీప ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేశాడు. వ్యవసాయేతర భూమిగా మార్పు చేసి ప్రాజెక్టుకు అందజేసి భారీగా పరిహారం పొందేందుకు ప్రణాళిక రచించాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తున్నారు.

విజయనగరం, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): రెండు చేతులా డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకున్న ఓ రెవెన్యూ ఉద్యోగి ఆదాయార్జనకు వివిధ మార్గాలను ఎంచుకున్నాడు. రియల్‌ వ్యాపారం ఒకటి కాగా సంపాదించిన డబ్బు ఇంతలింతలు చేసే సరికొత్త ఆలోచన చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ ముందుగా తెలుసుకున్నాడు. రైతులను మభ్య పెట్టి ఆయా భూములను కొనుగోలు చేశాడు. ఆపై వ్యవసాయేతర భూమిగా మార్పు చేసి కుటుంబ సభ్యులు, బంధువుల పేరున రిజిస్ట్రేషన్‌ చేశాడు. అనంతరం ప్రాజెక్టుకు అందజేశాడు. తద్వారా భారీ స్థాయిలో పరిహారం కాజేసేందుకు వ్యూహం రచించాడు. ఈయన గతంలో గంట్యాడ మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో కీలక బాధ్యతలు చూశాడు. ఆ సమయంలోనే అదే మండలంలోని కొత్తవెలగాడ, కొండతామారాపల్లి గ్రామాల్లో వివిధ సర్వే నెంబర్లలో 2023, 2024లో రైతుల నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేరిట దాదాపు 15 ఎకరాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఎకరం సుమారు రూ.20లక్షల నుంచి రూ.30 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు తెలిసింది. తల్లి పేరున కొండతామరాపల్లి గ్రామంలో దాదాపు ఎకరా 74 సెంట్లు భూమి కొన్నాడు. ఈ భూమి ఆరు సర్వే నెంబర్లలో ఉంది. తన బంధువు పేరున అదే గ్రామంలోని ఐదు సర్వే నెంబర్లలో ఎకరా 16 సెంట్లు కొనుగోలు చేశాడు. అలాగే ఇద్దరు రెవెన్యూ ఉద్యోగుల పేరున కూడా భూములు కొన్నాడు. ఇవే కాకుండా స్నేహితుల పేరిట కూడా భూమిని కొన్నట్లు సమాచారం.

ఫ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించిన అలైన్‌మెంట్‌ ఈయన కొనుగోలు చేసిన భూముల మీదుగా ఉంటుందని ల్యాండ్‌ కన్వర్షన్‌(వ్యవసాయేతర) చేసుకున్నాడు. ఆపై ప్రాజెక్టుకు అందజేశాడు. ప్రస్తుతం పరిహారం కోసం ఎదురుచూస్తున్నాడు.

సాధారణంగా ఏదైనా ప్రాజెక్టుకు రైతుల నుంచి భూములు సేకరిస్తే వ్యవసాయ భూమిగా ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం తక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్న మార్కెట్‌ ధర ప్రకారం రెండున్నర రెట్లు పరిహారం మాత్రమే అందుతుంది. అదే లాండ్‌ కన్వర్షన్‌ చేసిన భూమికి అయితే గజాల లెక్కన పరిహారం చెల్లిస్తుంది. ఇదిలా ఉండగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి లక్ష రూపాయలు దాటిన వస్తువు అయినా, స్థిర ఆస్తి కొనుగోలు చేయాలన్నా సంబంధిత శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. మరి ఈ ఉద్యోగి ఆ శాఖ నుంచి అనుమతి తీసుకుని భూములు కొనుగోలు చేశారా? లేదా నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారా? అనేది వారికే తెలియాలి. ఈ ఉద్యోగి వ్యవహారంపై కొంతమంది స్థానికులు సీఎంవోకి ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నారు. జిల్లా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

-----------------------

Updated Date - Jun 05 , 2026 | 12:04 AM