Share News

Revenue Services క్షేత్రస్థాయిలో రెవె‘న్యూ’ సేవలు

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:38 AM

Revenue Services at the Field Level కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి గత నెల 26 నుంచి ‘గ్రామస్థాయిలో రెవెన్యూ క్లినిక్‌’కు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ వరకు రావాల్సిన అవసరం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

Revenue Services   క్షేత్రస్థాయిలో  రెవె‘న్యూ’ సేవలు
పార్వతీపురం మండలం సంగంవలస రెవెన్యూ క్లినిక్‌లో అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటున్న అధికారులు (ఫైల్‌)

  • పలు సమస్యలపై వినతుల వెల్లువ

పార్వతీపురం, మార్చి1(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిద్వారా అర్జీదారులకు తక్షణ న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో ప్రతి సోమ వారం నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు వినతుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ఇది విజయవంతంగా కొనసాగుతుండడంతో సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కాగా రోజుల వ్యవధిలోనే పాస్‌పుస్తకం, అడంగల్‌, వన్‌బీ, దీర్ఘకాలిక భూమి సమస్యలకు మోక్షం కల్పిస్తుండడంతో జిల్లానలుమూల నుంచి అర్జీదారులు వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్‌కు చేరుకుంటున్నారు. అయితే దీనిని గుర్తించిన కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి గత నెల 26 నుంచి ‘గ్రామస్థాయిలో రెవెన్యూ క్లినిక్‌’కు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ వరకు రావాల్సిన అవసరం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి గురువారం వీఆర్వోలు గ్రామాల్లో రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించి, ప్రజా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఒక వేళ వేరే సచివాలయాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తే శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించాలని, డిజిటల్‌ అసిస్టెంట్లను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 943 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. ఈ నెల 26న పలు గ్రామాల్లో రెవెన్యూ క్లినిక్‌ ప్రారంభించారు. పార్వతీపురం, పాలకొండ డివిజన్ల పరిధిలో 236 వినతులు రాగా, అందులో 44 అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. పార్వతీపురం డివిజన్‌ పరిధిలో 440 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. పలు చోట్ల నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌కు 125 అర్జీలు వచ్చాయి. తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు వాటిని పరిశీలించి.. అక్కడికక్కడే 25 వినతులను పరిష్కరించారు. ఇక పాలకొండ డివిజన్‌ పరిధిలో 503 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. 141 గ్రామాల్లో 87 వినతులు రాగా.. 19 అర్జీలను పరిష్కరించారు.

- ‘రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలో రెవెన్యూ క్లినిక్‌ ప్రారంభించాం. రాష్ట్రం లోనే తొలిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. క్షేత్ర స్థాయిలో బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లోనూ రెవెన్యూ క్లినిక్‌లను ప్రారంభించాం. ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రెవెన్యూ సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.’ అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

అవగాహన అవసరం...

జిల్లా కేంద్రానికి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తే గాని సమస్య పరిష్కారం కాదనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారులకు అర్జీలు ఇచ్చినా.. పరిష్కారం లభిస్తుందని ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహిస్తే జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా వారికి సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. దీనిపై రెవెన్యూ సిబ్బందితో పాటు మండల స్థాయి అధికారులు పల్లెల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:38 AM