Development? ఆదాయం సరే.. అభివృద్ధి మాటేంటి?
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:48 PM
Revenue Is Fine, But What About Development? సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పరిస్థితి దయనీయంగా మారింది. ఏటా రూ.కోట్లలో పన్ను వసూలవుతున్నా.. కనీస అభివృద్ధికి నోచుకో వడం లేదు. వాన కురిస్తే చాలు.. కార్యాలయ భవనం కారిపోతోంది. యార్డులో పంటలను ఆర బట్టేందుకు ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫాంలు పూర్తిగా శిథిలమయ్యాయి.
శిథిలావస్థలో కార్యాలయ భవనం
లింకు రోడ్లు, గోదాములు, యార్డుల నిర్మాణానికి చర్యలేవీ?
ప్రతిపాదనలకే పరిమితమైన గత వైసీపీ సర్కారు
రైతులకు పూర్తిస్థాయిలో అందని సేవలు
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
సాలూరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పరిస్థితి దయనీయంగా మారింది. ఏటా రూ.కోట్లలో పన్ను వసూలవుతున్నా.. కనీస అభివృద్ధికి నోచుకో వడం లేదు. వాన కురిస్తే చాలు.. కార్యాలయ భవనం కారిపోతోంది. యార్డులో పంటలను ఆర బట్టేందుకు ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫాంలు పూర్తిగా శిథిలమయ్యాయి. ఏఎంసీ రక్షణ గోడ కూలే స్థితిలో ఉంది. గోదాములు కూడా మరమ్మతులకు గురయ్యాయి. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వం ఏఎంసీపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నిర్వహణను గాలికొదిలేసింది. లింకు రోడ్లు, గోదాములు, యార్డుల నిర్మాణానికి రూ.13 కోట్లతో ప్రతిపాదనలు చేసింది తప్పా పైసా కూడా కేటాయించలేదు.
మరోవైపు సాలూరు ఏఎంసీ నుంచి రైతులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఏటా రూ.2 కోట్లపైబడి పన్ను వసూలవుతోంది. అధికారులు, సిబ్బందికి జీతాలు పోను ప్రస్తుతం కమిటీ ఖాతాలో రూ.6.84 కోట్లున్నాయి. అయితే గత ఎనిమిదేళ్లుగా చెప్పుకోదగ్గ పనులేవీ చేపట్టలేదు. పంట ఉత్పత్తులను పట్టణాలు, మండల కేంద్రాలకు చేర్చేందుకు అవసరమైన లింకు రోడ్లను నిర్మించడం లేదు. అన్నదాతలకు రుణాలు అందించడం లేదు. పశువైద్య శిబిరాలు వంటివి నిర్వహించడం లేదు. మరోవైపు పంటలను గోదాముల్లో నిల్వ చేసుకునే సౌకర్యం లేక ఏటా సాలూరు, మక్కువ, పాచిపెంట, మక్కువ, మెంటాడ పరిధిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఆరబోసుకునేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మొత్తంగా రైతులు పండించే పంటలపై పన్ను వసూలు చేస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ వారికి అందించాల్సిన సేవలపై మాత్రం వెనుకడుగు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాలూరు పట్టణంలో ఏఎంసీ ఆధ్వర్యంలో 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.36 లక్షలతో రైతు బజారు నిర్మించారు. అయితే ఆ తరువాత దాని నిర్వహణను పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం అది పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్, కోటవీధి, పెద్దబజార్‌తో పాటు అనేక కూడళ్లలో చేపలు, మాంసం దుకాణాలను నిర్వహిస్తున్నారు. వాటిని ఏఎంసీ ఆధ్వర్యంలో నడిచే రైతుబజార్‌కు తరలించేందుకు అనేకసార్లు అధికారులు ప్రయత్నించి విఫలమయ్యారు. మొత్తంగా సుమారు ఎనిమిదేళ్ల కిందట సుమారు రూ.40 లక్షలతో నిర్మించిన రైతుబజార్ నిరుపయోగంగా మారడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.2.85 కోట్లతో ప్రతిపాదనలు..
గతేడాది ఏఎంసీ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు, చైర్మన్ చాంబరు, సమావేశ మందిరానికి రూ.35 లక్షలు, రక్షణ గోడ నిర్మాణానికి రూ.కోటి, పాచిపెంట ఏఎంసీ గోదాములకు రక్షణ గోడ నిర్మాణానికి రూ.కోటితో ప్రతిపాదనలు పంపారు. కానీ నిధులు మంజూరు కాలేదు. దీనిపై సాలూరు ఏఎంసీ కార్యదర్శి నరేష్‌కుమార్‌ను వివరణ కోరగా.. ‘అభివృద్ధి పనుల కోసం గతేడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కానీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఆయా పనులు చేపడతాం.’ అని తెలిపారు.