Share News

Reve 'New' Bhumaya రెవె‘న్యూ’ భూమాయ

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:53 PM

Reve 'New' Bhumaya రెవెన్యూ అధికారులు నడిపించిన భూ బాగోతమిది. యజమానులకు తెలియకుండా భూమిపై వేరొకరి పేరున 1బీలు జారీ చేసి వాటిపై పీఏసీఎస్‌లో ఏకంగా రూ.15 లక్షల రుణం తీసుకోవడానికి తోడ్పడ్డారు. రైతులను, రెవెన్యూశాఖను, ఇటు సహకారం సంఘాన్ని బోల్తా కొట్టించారు. కర్లాం గ్రామంలో తాజాగా వెలుగు చూసిన ఘటనిది.

Reve 'New' Bhumaya రెవె‘న్యూ’ భూమాయ
తమ రిజిస్ట్రేషన్‌ పత్రాలను చూపిస్తున్న భూ యజమానులు

రెవె‘న్యూ’ భూమాయ

విచారణ లేకుండానే 1బీ

సృష్టించిన రెవెన్యూ ఉద్యోగులు

హక్కుదారులకు తెలియకుండానే వేరే వారికి రిజిస్ట్రేషన్‌

నకిలీ పత్రాలతో రూ.15 లక్షల రుణం తీసుకోవడంలో తోడ్పాటు

లబోదిబోమంటున్న అసలైన భూ యజమానులు

రెవెన్యూ అధికారులు నడిపించిన భూ బాగోతమిది. యజమానులకు తెలియకుండా భూమిపై వేరొకరి పేరున 1బీలు జారీ చేసి వాటిపై పీఏసీఎస్‌లో ఏకంగా రూ.15 లక్షల రుణం తీసుకోవడానికి తోడ్పడ్డారు. రైతులను, రెవెన్యూశాఖను, ఇటు సహకారం సంఘాన్ని బోల్తా కొట్టించారు. కర్లాం గ్రామంలో తాజాగా వెలుగు చూసిన ఘటనిది.

చీపురుపల్లి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): కర్లాం గ్రామం సర్వే నం.76లో అదే గ్రామానికి చెందిన శనపతి గరికమ్మ 50 సెంట్లు, కొమ్మన పైడమ్మలు 66 సెంట్ల భూమిని 1980లో రిజిస్టర్‌ చేసుకున్నారు. దాట్ల వెంకటకృష్ణమూర్తి రాజు అనే వ్యక్తి వారికి రిజిస్టర్‌ చేశారు. అలాగే సర్వే నం.76లోనే గణపతిరాజు అచ్యుతరామరాజు మరో 50 సెంట్ల భూమిని బాలి పాపినాయుడు పేరున రిజిస్టర్‌ చేశారు. ప్రస్తుతం ఆ భూములు వారి పిల్లల సాగులోనే ఉన్నాయి. అయితే వారు రిజిస్టర్‌ చేసుకున్న భూముల వివరాలు రెవెన్యూ రికార్డులో నమోదు కాకపోవడాన్ని గమనించిన ఓ గ్రామ అధికారి.. తహసీల్దారు కార్యాలయ అధికారుల సహకారంతో 2024 సెప్టెంబరు 5న విక్రయదారులకు బంధువుగా చెప్పుకుంటున్న ఒక మహిళ పేరున 1బీలు తయారు చేయించారు. అనంతరం ఆ భూములను ఆమె తన కుమార్తెకు విక్రయించినట్లు గుట్టుచప్పుడు కాకుండా విజయనగరంలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆమె కుమార్తె ఆ భూములపై 2025 నవంబరులో కర్లాం పీఏసీఎస్‌లో రూ.15 లక్షల రుణం తీసుకున్నారు. ఇదిలా ఉండగా భూముల అసలు యజమానులు శనపతి మల్లేశ్వరరావు, సూర్యనారాయణ, కొమ్మన గవరయ్య, వీరభద్రుడు రుణం పొందేందుకు స్థానిక పీఏసీఎస్‌ను ఆశ్రయించడంతో రెవెన్యూలోని అక్రమాల గుట్టు రట్టయ్యింది. వారు లబోదిబోమంటూ విలేకరుల వద్ద తమ సమస్యను శనివారం విన్నవించారు. క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లి భూములను చూపించారు.

విచారించి న్యాయం చేస్తాను

కర్లాంలోని సర్వే నం 76లో వివాదం నా దృష్టికి రాలేదు. సాగు తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో ఎటువంటి విచారణ లేకుండా 1బీలు ఇవ్వడం సరికాదు. సాగులో ఉన్న హక్కుదారులు తమకు ఫిర్యాదు చేస్తే విచారిస్తాను. వారికి తగిన న్యాయం చేస్తాను.

- డి.ధర్మరాజు, తహసీల్దారు

Updated Date - Feb 07 , 2026 | 11:53 PM