Return Journey తిరుగు ప్రయాణం
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:02 AM
Return Journey సంక్రాంతి పండుగ ముగియడంతో వలస జీవులు పల్లె నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. పండుగ జ్ఞాపకాలను మదిలో నింపుకుని .. పిల్లా పాపలు, కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి కోసం పరుగులు తీశారు. మూడు రోజుల పాటు సొంతూర్లలో బంధువులు, స్నేహితుల మధ్య సంతోషంగా గడిపిన వారు ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు పయన మయ్యారు.
పల్లెల నుంచి పయనమైన వలసజీవులు
రద్దీగా బస్సులు, రైళ్లు
పాలకొండ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ ముగియడంతో వలస జీవులు పల్లె నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. పండుగ జ్ఞాపకాలను మదిలో నింపుకుని .. పిల్లా పాపలు, కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి కోసం పరుగులు తీశారు. మూడు రోజుల పాటు సొంతూర్లలో బంధువులు, స్నేహితుల మధ్య సంతోషంగా గడిపిన వారు ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు పయన మయ్యారు. దీంతో జిల్లాలో బస్ , రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. సాలూరు, పార్వతీపురం, పాలకొండ ఆర్టీసీ డిపోల నుంచి విశాఖ, విజయవాడ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అయితే ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు టిక్కెట్ల ధరలను అమాంతం పెంచేశారు. ఏదేమైనా సకాలంలో గమ్యస్థానాలకు వెళ్లాలనే ఉద్దేశంతో వలస జీవులు వారు అడిగిన మొత్తం చెల్లిస్తున్నారు.
ఆర్టీసీకి పండుగే..
సాలూరు రూరల్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కలిసోచ్చింది. సాలూరు, పార్వతీపురం, పాలకొండ ఆర్టీసీ డిపోల ద్వారా ఈ నెల 10 నుంచి 16 వరకు 7.29 లక్షల మంది ప్రయాణించారు. మూడు డిపోల ద్వారా రోజుకు 238 బస్సులతో పాటు మరో 24 ప్రత్యేక సర్వీసులను నడిపారు. వాటి ద్వారా తద్వారా ఆర్టీసీకి రూ. 3.31 కోట్లు ఆదాయం లభించింది. 262 బస్ సర్వీసుల ద్వారా ఏడు రోజుల్లో 4.07 లక్షల మంది మహిళలు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణించారు. 1.87 లక్షల మంది పురుషులు ప్రయాణించారు. ఆర్టీసీకి వచ్చిన ఆదాయంలో నగదుగా రూ. 1.87 కోట్లు, స్త్రీ శక్తి ద్వారా రూ. రూ.1.44 కోట్లు వచ్చింది. ‘సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆర్టీసీకి ఓఆర్ రేటు పెరిగింది. ఈ నెల 10 నుంచి 16 వరకు నడిపిన బస్సుల ద్వారా రూ. 3.31 కోట్లు ఆదాయం వచ్చింది.’ అని డీటీపీవో వెంకటేశ్వరరావు తెలిపారు.