Share News

పత్తి కొనుగోలుకు కొర్రీలు!

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:03 AM

జిల్లాలో పత్తి పంటను అమ్ముకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రకరకాల కొర్రీలు పెడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు.

పత్తి కొనుగోలుకు కొర్రీలు!
వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన పత్తి

- తేమ, నాణ్యత అంటూ నిబంధనలు

- తగ్గుతున్న మద్దతు ధర

- దళారుల రంగప్రవేశం

- దగాకు గురవుతున్న రైతులు

- రాజాంకు చెందిన ఓ రైతు 53 క్వింటాళ్ల పత్తిని స్థానిక కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ఒక శాతం మాత్రమే తేమ ఉండడంతో క్వింటాను రూ.7,955 చొప్పున అక్కడి సిబ్బంది కొనుగోలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.8,110 ఉంది. కానీ, తేమ శాతం కారణంగా క్వింటాను రూ.155 తక్కువకు కొనుగోలు చేశారు. ఆ రైతు 53 క్వింటాళ్లపై రూ.8,215 కోల్పోయాడు.

- దత్తిరాజేరు మండలానికి చెందిన ఓ రైతు 80 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. కాయలు పేలిన సమయంలో వర్షాలతో నాణ్యత పోయింది. రాజాం కొనుగోలు కేంద్రానికి కొంత మచ్చును(శాంపిల్‌) తీసుకొచ్చాడు. దీనిని పరిశీలించిన అక్కడ సిబ్బంది కొనుగోలు చేయలేమని తేల్చేశారు. పంట పూర్తిగా నాణ్యత కోల్పోవడంతో కొనుగోలుకు తిరస్కరించారు.

రాజాం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పత్తి పంటను అమ్ముకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రకరకాల కొర్రీలు పెడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క మద్దతు ధర లభించక.. మరొపక్క అమ్ముకునే మార్గం లేక లబోదిబోమంటున్నారు. వర్షాభావం, వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడులు సైతం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 వేల ఎకరాల్లో పత్తి సాగవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విజయనగరం జిల్లాకు సంబంధించి దాదాపు 15 మండలాల్లో 6,234 ఎకరాల్లో పత్తిపంట సాగవుతోంది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రాజాం, సాలూరు, బొబ్బిలి, భామినిలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 52,980 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 18 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రైతులు తీసుకొచ్చిన పంటకు రకరకాల కొర్రీలను పెట్టి తింపి పంపుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తగ్గిన దిగుబడులు..

సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో పత్తిని సాగుచేస్తే 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ, ఈ ఏడాది 3 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి ప్రభుత్వం క్వింటా పత్తికి రూ.8,110 మద్దతు ధరగా నిర్ణయించింది. 8 నుంచి 12 మధ్యలో తేమశాతం ఉంటేనే ఈ మద్దతు ధర లభిస్తుంది. అయితే, ఈ ఏడాది కాయలు పేలిన సమయంలో వర్షాలు కురవడంతో పంట నాణ్యత కోల్పోయింది. తేమ శాతం తక్కువగా ఉండడంతో పాటు పత్తి రంగు మారిన కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద పంటను తీసుకోవడం లేదు. ఇదే అదునుగా దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. రకరకాల కారణాలు చెప్పి రైతుల వద్ద రూ.5 వేలకు క్వింటా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు రంగుమారిన, ఇతర కారణాలు చూపుతూ తూకంలో క్వింటాకు 5 కిలోలు అదనంగా తీసుకుంటున్నారు. ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టగా కనీసం రూ.20 వేలు అయినా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వచ్చే ఏడాది పత్తి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేస్తామని చెబుతున్నారు. పత్తిని ఎటువంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కేంద్రాలకు తరలించాలి

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలి. 8 నుంచి 12 మధ్యలో తేమ ఉంటే మంచి మద్దతు ధర లభిస్తుంది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకొని తేవాలి.

- రవికిరణ్‌, ఏడీ, మార్కెటింగ్‌ శాఖ, విజయనగరం

Updated Date - Jan 03 , 2026 | 12:03 AM