TRICOR’s ట్రైకార్‌కు పూర్వ వైభవం
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:38 PM
Restoring TRICOR’s Former Glory గిరిజనుల ఆర్థికాభివృద్థికి తోడ్పాటు అందించే పథకాల్లో ప్రధానమైన ట్రైకార్(ట్రైబల్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్)పథకానికి పూర్వ వైభవం వచ్చింది. ఈ పథకం ద్వారా పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో గిరిజనులకు సబ్సిడీపై వ్యవసాయ, ఉద్యాన యంత్రపరికరాలు అందజేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.
సబ్సిడీపై యంత్ర పరికరాలు
హర్షం వ్యక్తంచేస్తున్న గిరిపుత్రులు
రాయితీ యూనిట్ల కోసం భారీగా దరఖాస్తులు
సీతంపేట రూరల్, జనవరి13(ఆంధ్రజ్యోతి): గిరిజనుల ఆర్థికాభివృద్థికి తోడ్పాటు అందించే పథకాల్లో ప్రధానమైన ట్రైకార్(ట్రైబల్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్)పథకానికి పూర్వ వైభవం వచ్చింది. ఈ పథకం ద్వారా పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో గిరిజనులకు సబ్సిడీపై వ్యవసాయ, ఉద్యాన యంత్రపరికరాలు అందజేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. అర్హులైన గిరిజనులకు ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్(స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్స్ టు ట్రైబల్ సబ్‌స్కీమ్) నిధులు కేటాయించనున్నారు. 90శాతం సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేయగా లబ్ధిదారుడు కేవలం 10శాతం మాత్రమే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ యూనిట్ల కోసం సీతంపేట ఐటీడీఏ కార్యాలయానికి వందల సంఖ్యలో ధరఖాస్తులు వచ్చాయి. కాగా ట్రైకార్‌కు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై గిరిపుత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
వాస్తవంగా 1975లో ట్రైకార్ పథకాన్ని ప్రవేశపెట్టారు. గిరిజనులకు ఆర్థికసహాయం, సబ్సిడీపై రుణాలు, వ్యవసాయ పరికరాలు, స్వయం ఉపాధి యూనిట్లు , నైపుణ్య శిక్షణ అందించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. గత టీడీపీ ప్రభుత్వ హయాం(2014-19)లో సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 20సబ్‌ప్లాన్ మండలాల్లో 3,700 పైగా ట్రైకార్ యూనిట్లు మంజూరు చేశారు. వాటిలో 3,150 వరకు యూనిట్లు గ్రౌండ్ అయ్యాయి. అయితే వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసింది. గిరిబిడ్డలకు ట్రైకార్ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో వారు సబ్సిడీ పథకాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ట్రైకార్ పథకం పూర్వవైభవం సంతరించుంది. త్వరలోనే గిరిజనులకు అవసరమైన ఉద్యాన,వ్యవసాయ యంత్రపరికరాలను అందజేయనున్నారు.
మంజూరు ఇలా..
సీతంపేట ఐటీడీఏ పరిధిలో పసుపు సాగు చేస్తున్న గిరిజనరైతులను ప్రోత్సహించేందుకు రూ.7.93కోట్ల మేర ట్రైకార్ నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో సమగ్ర ప్రాజెక్ట్‌కు అను మతులు వచ్చాయి. గిరిజన రైతులకు 90శాతం సబ్సిడీపై పసుపు విత్తనాలతో పాటు యంత్ర పరికరాలను అందించనున్నారు. యంత్ర పరికరాలకు సంబంధించి ట్రైకార్ కింద సీతంపేట ఐటీడీఏకు రూ.2.99కోట్లు , పార్వతీపురం ఐటీడీఏకు రూ.3.30కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో సీతంపేటలో గిరిజన రైతులకు 25 మినీ ట్రాక్టర్లు, 12 నూర్పుడి యంత్రాలు , 28 పవర్‌టిల్లర్‌లు , 53 పవర్‌వీడర్లు , 80 ఆయిల్ ఇంజన్‌లు , టార్పాలిన్లు, స్ర్పేయర్లు, గడ్డికోత యంత్రాలు, చేతిరంపాలు తదితర వాటిని అందించనున్నారు.
ఆనందంగా ఉంది
ట్రైకార్ పథకం ద్వారా సబ్సిడీపై ఉద్యాన, వ్యవసాయ పరికరాలను కూటమి ప్రభుత్వం అందించడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు నాలుగు ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. గతంలో ఐటీడీఏ ద్వారా సబ్సిడీపై ఇచ్చిన యంత్రపరికరాలను వినియోగించి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు చేపట్టా. అయితే గడిచిన ఐదేళ్లుగా ట్రైకార్ యూనిట్ల కోసం ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.
- సవరతోటయ్య, గిరిజన రైతు, దిగువదారబ
==================================
వినియోగించుకుంటాం
సీతంపేట ఐటీడీఏ ద్వారా 90శాతం సబ్సిడీపై అందించనున్న ట్రైకార్ యూనిట్లను వినియోగించుకుంటాం. ట్రైకార్ యూనిట్ కోసం ఇప్పటికే ఐటీడీఏకు దరఖాస్తు చేసుకున్నా. యూనిట్ మంజూరు కోసం ఎదురుచూస్తున్నా.
- సవరబోగేసు, గిరిజన రైతు, నౌగూడ
=======================================
త్వరలో పంపిణీ చేస్తాం
ట్రైకార్ పథకం ద్వారా అర్హులైన గిరిజన రైతులను ఎంపికచేసి ఉద్యాన, వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై పంపిణీ చేస్తాం. ఇక సబ్‌ప్లాన్ మండలాల్లో పసుపు సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు గాను సమగ్ర ప్రాజెక్ట్ కింద నిధులు మంజూరయ్యాయి. టెండర్‌లు పూర్తయిన తరువాత గిరిజన రైతులకు అవసరమైన పసుపు విత్తనాలు, యంత్ర పరికరాలు అందజేస్తాం.
- ఆర్‌వీ గణేష్, హార్టికల్చర్ అధికారి, సీతంపేట ఐటీడీఏ