స్పందించండి..ప్రాణాలు కాపాడండి
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:59 PM
: రోడ్డు ప్రమాదంలో ఎవరైన తీవ్రంగా గాయపడినా, లేదా దారిలో హఠాత్తుగా ఎవరికైనా గుండెపోటు వచ్చి కిందపడిపోయినా వెంటనే జనం గుమిగూడుతారు. కొందరు సహాయం చేయడానికి బదులు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీస్తుంటారు.
- తొలి గంటే కీలకం
- అత్యవసర వైద్య సేవలకు సమాచారం ఇవ్వండి
- ప్రథమ చికిత్స అందించండి
- భయం వద్దంటున్న పోలీసులు
- వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే
విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఎవరైన తీవ్రంగా గాయపడినా, లేదా దారిలో హఠాత్తుగా ఎవరికైనా గుండెపోటు వచ్చి కిందపడిపోయినా వెంటనే జనం గుమిగూడుతారు. కొందరు సహాయం చేయడానికి బదులు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీస్తుంటారు. మరికొందరు పోలీసు, వైద్య పరమైన ఇబ్బందులు వస్తాయన్న భయంతో ముందుకు రావడానికి వెనుకాడతారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో తొలి గంటలో అందించే సరైన ప్రథమ చికిత్స వారి ప్రాణాలను నిలబెట్టడంలో కీలకంగా మారుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం, అత్యవసర వైద్య సేవలకు సమాచారం ఇవ్వడం, తెలిసిన మేరకు సురక్షితంగా ప్రథమ చికిత్స అందించడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. నేడు (సెప్టెంబరు రెండో శనివారం) వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం
తొలి గంట అత్యంత కీలకం
ప్రమాదం లేదా తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి తరువాత చికిత్స అందే వరకూ గడిచే సమయం అత్యంత కీలకం. దీనినే గోల్డెన్ అవర్ అంటారు. ముఖ్యంగా గుండె ఆగిపోవడం, శ్వాస నిలిచిపోవడం, తీవ్రమైన రక్తస్రావం వంటి సందర్భాల్లో ప్రతి నిమిషం విలువైనదే. గుండె ఆగిపోయినప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. అందుకే అత్యవసర వైద్య సేవలకు తక్షణమే సమాచారం ఇవ్వడంతో పాటు అటువంటి పరిస్థితుల్లో తగిన ప్రథమ చికిత్సను ప్రారంభించడం అత్యవసరం.
గుండె ఆగితే.. సీపీఆర్
ఎవరైనా వ్యక్తి గుండెపోటుకు గురై కింద పడిపోతే అక్కడున్నవారు వెంటనే అత్యవసర వైద్య సేవలకు సమాచారం ఇవ్వాలి. సంబంధిత వ్యక్తిని గట్టి నేలపై పడుకోబెట్టి సీపీఆర్ చేయాలి. ఛాతి మధ్యభాగంలో రెండు చేతులను ఉంచి నిమిషానికి 100 నుంచి 200 చొప్పున ఒత్తాలి. శిక్షణ పొందిన వారు అయితే 30సార్లు ఒత్తడంతో పాటు నోటి ద్వారా రెండు శ్వాసలు అందించవచ్చును.
- రక్తస్రావం అయితే, గాయంపై శుభ్రమైన కాటన్ గుడ్డతో నొక్కి పట్టి ఉంచాలి.
-నీట మునిగితే: బాధితుడ్ని సురక్షితంగా నీటి నుంచి బయటకు తీసిన తరువాత శ్వాసను పరిశీలించాలి. శ్వాస లేకపోతే, వెంటనే సీపీఆర్ ప్రారంభించాలి. నీటిని బయటకు తీయడానికి బాధితుడ్ని తలకిందులుగా పెట్టడం, పొట్టపై ఒత్తడం వంటి పనులు చేయకూడదు.
- విషం తీసుకుంటే: విష ద్రావణం, లేదా పదార్థాలు తీసుకున్నట్టు అనుమానాలు ఉంటే, స్వయంగా వాంతులు చేయించే ప్రయత్నం చేయకూడదు. ఏ పదార్థం తీసుకున్నారో తెలుసుకుని వైద్య సాయం అందించాలి. రసాయనం కళ్లలో లేదా చర్మంపై పడితే, ముందుగా కలుషిత దుస్తులను తొలగించి స్వచ్ఛమైన నీటిని నిరంతరంగా కడగాలి. కంటిని రుద్ద కూడదు.
-విద్యుత్ షాక్ తగిలితే: విద్యుత్ సరఫరా కొనసాగుతున్నప్పుడు బాధితుడ్ని చేతితో తాకకూడదు. వీలైతే మెయిన్ స్వీచ్‌ను ఆపాలి. విద్యుత్ పూర్తిగా నిలిచిందని నిర్ధారించిన తరువాత బాధితుడి వద్దకు వెళ్లాలి. శ్వాస లేకపోతే, సీపీఆర్ ప్రారంభించి, అత్యవసర వైద్య సాయం పొందాలి
- కాలిన గాయాలు: కాలిన ప్రాంతాన్ని వీలైనంత త్వరగా ప్రవహించే చల్లటి నీటితో సుమారు 20 నిమిషాల పాటు చల్లబరచాలి. గాయాలపై ఐస్, టూత్‌పేస్ట్, పసుపు వంటి పదార్ధాలను పోయకూడదు. చర్మానికి అంటుకున్న దుస్తులను బలవంతంగా లాగకూడదు. సంఘటన జరిగిన వెంటనే తక్షణమే వైద్య సాయం అవసరం.
-ఎముకలు విరిగితే: ఎముకలు విరిగినట్టు అనుమానించిన భాగాన్ని అవసరం లేకుండా కదలించకూడదు. గాయాల తీవ్రతను బట్టి ఆ భాగాన్ని ఉన్న స్థితిలోనే స్థిరంగా ఉంచి వైద్య సాయం అందించాలి. ఎముక బయటకు కన్పిస్తే, దానిని లోపలనెట్టే ప్రయత్నం చేయకూడదు.
- పాము కరిస్తే: పాముకాటుకి గురైన వ్యక్తిని కంగారు పెట్టకుండా ప్రశాంతంగా ఉంచాలి. కాటు వేసిన అవయవాన్ని వీలైనంత తక్కువగా కదిలిస్తూ స్థిరంగా ఉంచాలి. గాయాన్ని కోయడం, విషాన్ని నోటితో పీల్చడం, బిగుతుగా తాడు కట్టడం వంటి పద్ధతులు పాటించకూడదు.
- ప్రమాదం జరిగినప్పుడు సెల్‌ఫోన్ తీసి వీడియోలు, ఫొటోలు తీయడం కంటే అత్యవసర సేవలకు సమాచారం అందించడం, ట్రాఫిక్‌ను నియంత్రించడం, బాధితుడికి తెలిసిన మేరకు సురక్షితమైన ప్రథమ చికిత్స అందించడం చేయాలి. ఒకరి ప్రాణం కాపాడేందుకు మనం కేటాయించే కొన్ని క్షణాలు ఆ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే సాయంగా మారుతోంది.
భయం వద్దు
రోడ్డు ప్రమాద బాధితుడ్ని కాపాడేందుకు ముందుకు వచ్చేవారు ఎలాంటి భయాందోళనకు గురికావల్సిన అవసరం లేదు, గుడ్ సమారీటన్ నిబంధన ప్రకారం సదుద్దేశంతో సాయం చేసేవారికి చట్ట పరమైన రక్షణ ఉంటుంది. బాధితుడ్ని ఆసుపత్రికి చేర్చిన వ్యక్తిని అనవసరంగా పోలీసు స్టేషన్ పిలిచి ఇబ్బంది పెట్టరు. ప్రజలు ధైర్యంగా స్పందించి 112 లేదా 100, 108కి సమాచారం అందించాలి. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ పోలీసు శాఖ అండగా ఉంటుంది.
-ఏఆర్ దామోదర్, ఎస్పీ విజయనగరం
ప్రాణదాతగా మారాలి..
చాలా మంది ప్రమాదం జరగగానే భయపడి విలువైన సమయాన్ని వృథా చేస్తారు. తొలుత ఒకటి నుంచి 60 నిమిషాల్లో అందించే చిన్న సహాయమే రోగి ప్రాణాలను కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ మెలకువలను నేర్చుకోవాలి. ప్రతి ఇంట్లో లేదా తమ వాహనంలో బ్యాండేజీ, శానిటైజర్, దూది, సీజర్లతో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు ఫోన్లలో వీడియోలు తీసి లైక్‌లు సంపాదించడం కాదు. సమయానికి స్పందించి ఒక ఊపిరి నిలిపి ప్రాణదాతగా మారడమే నిజమైన మానవత్వం.
-డాక్టరు ఎస్ జీవనరాణి, డీఎంహెచ్‌ఓ, విజయనగరం