Share News

కౌలు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:28 AM

జిల్లాలో కౌలు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి ఆదేశించారు. సీసీఆర్‌ కార్డులు బ్యాంకు రుణాల మంజూరులో నిర్లక్ష్యం తగదన్నారు. అర్హులైన కౌలు రైతులకు అండగా నిలవాలని సూచించారు.

కౌలు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి జేసీ వైశాలి

పార్వతీపురం, జూలై7ఆంధ్రజ్యోతి): జిల్లాలో కౌలు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి ఆదేశించారు. సీసీఆర్‌ కార్డులు బ్యాంకు రుణాల మంజూరులో నిర్లక్ష్యం తగదన్నారు. అర్హులైన కౌలు రైతులకు అండగా నిలవాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ, ఎల్‌డీఎం బ్యాంకు ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీసీఆర్‌ కార్డులు కలిగిన ప్రతి రైతుకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాకు 12 వేల సీసీఆర్‌ కార్డుల లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు. ఈ కార్డులపై అవగాహన కల్పించి.. భూ యజమానులు, రైతులకు అవగాహన కల్పించి.. మరింత మందికి ప్రయోజనం చేకూర్చాలని అధికారులకు సూచించారు. రుణాల మంజూరులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, రైతుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఏ సమస్యలున్నా కౌలు రైతులు తన కార్యాలయాన్ని సంప్రదించొచ్చని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.

పర్యవేక్షణ తప్పనిసరి

ఖరీఫ్‌ రైతులకు సకాలంలో ఎరువులు అందేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఇన్‌చార్జి జేసీ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆమె మాట్లాడుతూ.. ఎరువుల వినియోగం, ఆధునిక సాగు విధానాలు తదితర వాటిపై రైతులకు అవసరమైన సలహా సూచనలు సకాలంలో అందించాలన్నారు. ఎవరైనా ఎరువులను అధిక ధరలకు విక్రయించడం, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటివి చేస్తే సహించేది లేదన్నారు. ఎరువుల దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయాలని ఆదేశించారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 46,100 మెట్రిక్‌ టన్నుల ఎరువుల సరఫరాకు ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. ప్రస్తుతం 13,528 మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు జిల్లాకు 21,286 మెట్రిక్‌ టన్నులు వచ్చాయని తెలిపారు. యూరియా 7985 టన్నులు, డీఏపీ 851 టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 3034 టన్నులు, సూపర్‌ పాస్పేట్‌ 1302 టన్నులు ఉన్నాయని వివరించారు. ఎరువులు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా డీలర్ల వద్ద రశీదులు పొందాలన్నారు. ఎరువుల కోసం ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటే పార్వతీపురం డివిజన్‌లో 83310 56268, కురుపాంలో 83310 56266, పాలకొండ డివిజన్‌లో 83310 56206 నెంబర్లకు ఫోన్‌ చయాలని సూచించారు. ఈ సమావేశలో డీఈవో భవానీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 10:54 AM