Land Disputes భూ వివాదాల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:53 PM
Resolving Land Disputes Is the Goal భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తోందని.. దీనిలో భాగంగానే రైతులకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోందని ప్రభుత్వ విప్ జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం బిన్నిడి గ్రామంలో అన్నదాతలకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు.
బిన్నిడిలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
కొమరాడ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తోందని.. దీనిలో భాగంగానే రైతులకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోందని ప్రభుత్వ విప్ జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం బిన్నిడి గ్రామంలో అన్నదాతలకు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. అర్హులైన రైతుల భూ సమస్యలను పరిష్కరించి భూ హక్కు పత్రాలు అందిస్తున్నామని వారు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. అంతకుముందు బిన్నిడి గ్రామస్థులు ‘థాంక్యూ కలెక్టర్ సార్, థాంక్యూ ఎమ్మెల్యే మేడం’ అంటూ ప్లకార్డులతో వినూత్నంగా స్వాగతం పలికారు. అనంతరం ‘గట్టు మీద చెట్టు’ కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామంలోని కలెక్టర్ మొక్కలు నాటారు. రైతులు పొలాల గట్లపై మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు అదనపు ఆదాయం పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాధురి, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- జిల్లాలో వినూత్నంగా అమలవుతున్న ముస్తాబు కార్యక్రమం విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చిందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దళాయిపేట ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముస్తాబు కార్య క్రమం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతను గమనించి వారిని అభినందించారు. విద్యార్థులు సబ్బు పెట్టేలను తీసుకురావడం.. ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై పెరిగిన అవగాహనకు ఇది నిదర్శనమన్నారు.
గడువులోగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
పార్వతీపురం, జూలై 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. రూ.60 లక్షలతో నిర్మిస్తున్న ఐదు మోడల్ అంగన్‌వాడీ భవనాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం పనుల పురోగతిని ఎక్సెల్ నివేదిక రూపంలో అందించాలని తెలిపారు. వచ్చే నెల భవనాలను అందుబాటులో తీసుకురావాలన్నారు. భామిని మండలం సింగిడి అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల్లో రూఫ్ లెవెల్, ఫినిషింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బత్తిలి-1 అంగన్‌వాడీ వద్ద అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. వెలుగుశాఖ ఆధ్వర్యంలో రూ.15 లక్షలతో ఏర్పాటు చేస్తున్న టైలరింగ్ శిక్షణ కేం ద్రానికి సంబంధించి 20 కుట్టు మిషన్ల కొనుగోలు పూర్తయిందన్నారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహంలో భాగంగా రూ.22 లక్షల విలువైన జీవామృతం, ఫిట్స్, వర్మీ కంపోస్టు యూనిట్లుకు సంబంధించి పెండింగ్ వర్క్ ఆర్డర్లను వెంటనే జారీ చేయాలని సూచించారు. సవరపాడు పాఠశాలలో పూర్తయిన మౌలిక వసతుల పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరగా చెల్లించాలన్నారు.
- జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో టాయిలెట్ కల్చర్, స్ర్టైచ్, సిప్, ఇంగుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ వంటి కార్యక్రమాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అవసరమైన చోట అదనపు మరుగుదొడ్లు, ఆర్‌వో ప్లాంట్లు, డిజిటల్ క్లాస్‌రూంలు, ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, వర్షపు నీటి నిల్వలకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జేసీ వైశాలి, సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.