Resolve Public Issues గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:25 AM
Resolve Public Issues at the Village Level Itself గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. పల్లెల్లో పారిశుధ్య మెరుగుకు శుభ్రత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.
పార్వతీపురం, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. పల్లెల్లో పారిశుధ్య మెరుగుకు శుభ్రత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ సమీపంలోని ఓ సామాజిక భవనంలో పంచాయతీల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐదు లేదా ఆరు గ్రామాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి.. ఆయా ప్రాంతాల్లో పారిశుఽధ్య కార్మికులు, ఇతర వనరులను ఒక చోట కేంద్రీకరించి పూర్తిస్థాయిలో క్లీనింగ్ చేయించాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం తప్పు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామాన్ని శుభ్రం చేసు కోవాలి. పారిశుధ్య నిర్వహణపై ప్రతి అధికారి బాధ్యత వహించాలి. అభివృద్ధి పనుల్లో విఫలమైన వారిని తక్షణమే సస్పెండ్ చేస్తాం. వచ్చే సోమవారం నుంచి స్పెషల్ ఆఫీసర్లు రోజూ గ్రామాలను సందర్శించాలి. ప్రతి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలి. త్వరలో ఫోన్ ఇన్ లేదా వీడియో కాల్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెస్తాం. మన మిత్ర వాట్సాప్ సేవలను ప్రతి పౌరుడు వినియోగించుకునేలా చూడాలి. జలధార, జలహారతి కింద చెరువులను శుభ్రం చేయడంతో పాటు ఆక్రమణకు గురైన వాటిని పరిరక్షించాలి. జిల్లాలోని ప్రతి గ్రామంలో యువత, మహిళల కోసం ప్రత్యేక క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలి. ’ అని తెలిపారు. ఈ సదస్సులో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీపీవో టి.కొండలరావు, డ్వామా పీడీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం
జిల్లాలో మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని, సభ్యత్వ నమోదు ప్ర క్రియలో వేగం పెంచి లక్ష్యాలు చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. గతంలో సభ్యత్వ నమోదులో తలెత్తిన లోపాలను విశ్లేషించి ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించడానికి ఒక ప్రత్యేకమైన మై క్రోప్లాన్ రూపొందించాలని సూచించారు. కొత్త సభ్యుల వివరాలను తక్షణమే క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపై మహిళా సంఘాలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. వంట చేసే విధానం, వాడే నూనెలు, కూరగాయల నాణ్యతపై అవగాహన కల్పించాలన్నారు. ముస్తాబు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి వార్డును ఒక మెడల్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సమావేశంలో మెప్మా పీడీ నాగభూషణరావు, పార్వతీపురం, పాలకొండ, సాలూరు ప్రాంతాల సీఎంఎంలు, ఆర్‌ిపీలు, సీవోలు పాల్గొన్నారు.