Resolutions Yet to Reach తీర్మానాలు అందట్లే!
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:18 AM
Resolutions Yet to Reach జిల్లాలో ఆవాస్ ప్లస్ యోజన గృహ నిర్మాణాలకు గ్రామ సభల తీర్మానాలు అందడం లేదు. ఈ నెల ఏడో తేదీలోగా వాటిని అందించాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయి సిబ్బంది స్పందించడం లేదు.
గ్రామ సభల నిర్వహణకు ముందుకురాని క్షేత్రస్థాయి సిబ్బంది
ఏడో తేదీతో ముగియనున్న గడువు
గరుగుబిల్లి, జూలై4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆవాస్ ప్లస్ యోజన గృహ నిర్మాణాలకు గ్రామ సభల తీర్మానాలు అందడం లేదు. ఈ నెల ఏడో తేదీలోగా వాటిని అందించాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయి సిబ్బంది స్పందించడం లేదు. ఆవాస్ ప్లస్‌లో భాగంగా 15 మండలాల్లోని 445 పంచాయతీల్లో 31,325 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారికి సంబంధించి గతంలో గ్రామస్థాయిలో సచివాల యం కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు జియోట్యాగింగ్ నిర్వహించారు. అయితే వారు పథకా నికి అర్హులుగా గుర్తించేందుకు విధిగా గ్రామసభ నిర్వహించాల్సి ఉంది. అనంతరం అర్హుల జాబితాను తీర్మానం చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 52 పంచాయతీల్లోనే గ్రామసభలు నిర్వహించి తీర్మానించారు. సుమారు 393 పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణకు కార్యదర్శులు ముందుకు రావడం లేదు. గృహ నిర్మాణశాఖ సిబ్బంది ఈ విషయాన్ని ఎంపీడీవోల దృష్టికి తీసుకువెళ్లినా కదలిక ఉండడం లేదు. అయితే దీనిపై తమకు ఆదేశాలు రాలేదని మరోవైపు కార్యదర్శులు చెబుతున్నారు. వాస్తవంగా అర్హులను ఆమోదిస్తూ ప్రత్యేకాధికారి, కార్యదర్శి తీర్మానం చేయాల్సి ఉంది. విధిగా సంబంధిత ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉన్నా.. ఆ పనులేవీ జరగడం లేదు.
ఫిర్యాదు చేస్తాం..
జిల్లాలో 393 పంచాయతీల నుంచి గ్రామసభల తీర్మానాలు అందలేదు. దీనిపై ఎంపీడీవోలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాం. తీర్మానాలు అందించిన తర్వాతే ఇళ్ల నిర్మాణాలకు సిఫారసు చేస్తాం. ఈ నెల 7లోగా తీర్మానాలు అందించకుంటే కార్యదర్శులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.
ధర్మారావు, జిల్లా గృహ నిర్మాణశాఖ అధికారి