ZPTC and MPTC జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:20 AM
Reservations Finalized for ZPTC and MPTC Posts జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పార్వతీపురం, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీటీసీలకు సంబంధించి.. కొమరాడ, భామిని స్థానాలను ఎస్టీ మహిళకు కేటాయించారు. గుమ్మలక్ష్మీపురం, మక్కువ, సీతంపేట ఎస్టీ జనరల్‌కు, సాలూరు, బలిజిపేట, గరుగుబిల్లి, పాచిపెంట, సీతానగరం స్థానాలను జనరల్ మహిళకు కేటాయించారు. పాలకొండ ఎస్సీ, కురుపాం, వీరఘట్టం, పార్వతీపురం, జియ్యమ్మవలస స్థానాలను జనరల్‌కు రిజర్వ్ చేశారు.
ఎంపీపీలకు సంబంధించి కొమరాడ, భామిని స్థానాలను ఎస్టీ జనరల్‌కు, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట స్థానాలను ఎస్టీ మహిళకు, సీతానగరం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. బలిజిపేట, మక్కువ స్థానాలను జనరల్ మహిళకు కేటాయించారు. పార్వతీపురం, పాచిపెంట, గరుగుబిల్లి, సాలూరు ఎంపీపీ స్థానాలు జనరల్‌కు రిజర్వ్ చేశారు. వీరఘట్టం ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. జియమ్మవలస మండలం అన్రిజర్డ్వ్ మహిళగా నిర్ణయించారు.
ఇదీ పరిస్థితి..
- జడ్పీటీసీ , ఎంపీపీ స్థానాలు కూటమి పార్టీల్లో ఎవరెవరికి దక్కుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా టీడీపీ అభ్యర్థులు అత్యధిక జడ్పీటీసీ, ఎంపీపీపీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇక జనసేన పార్టీ, బీజేపీకి ఏయే స్థానాలు కేటాయిస్తారో వేచి చూడాల్సి ఉంది.
- కొన్ని మండలాల్లో ఎంపీపీ స్థానాలను మహిళలకు రిజర్వ్‌చేశారు. దీంతో ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకుల అంచనాలు తలకిందులయ్యాయి. ఎంపీటీసీలుగా గెలుపొంది ఎంపీపీ పీఠం దక్కించుకోవాలని చాలామంది భావించారు. కానీ ఆయా స్థానాలు మహిళలకు రిజర్వేషన్ కావడంతో వారంతా పునరాలోచనలో పడ్డారు. తమ కుటుంబ సభ్యుల్లో మహిళలను రంగంలోకి దించేందుకు సన్నద్ధమవుతున్నారు.
- జడ్పీ చైర్మన్ పీఠం ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో జిల్లాలో ఎస్టీలకు రిజర్వ్ చేసిన జడ్పీ టీసీ స్థానాలు ఇప్పుడు కీలకంగా మారాయి. మొత్తంగా ఆయా స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థుల్లో ఎవరికి జడ్పీ పీఠం వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.