Come Join Us! రిజర్వేషన్లు చేస్తాం.. వచ్చేయండి
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:17 AM
Reservations Assured… Come Join Us! వలస ఓటర్లపై రాజకీయపార్టీ నేతలు దృష్టి సారించారు. ప్రధానంగా బరిలో నిలిచిన అభ్యర్థులు వారికి ఫోన్లు చేసి పలకరిస్తున్నారు. క్షేమ సమాచారం తెలుసుకుని.. ‘ ట్రైన్, బస్సు టిక్కెట్లు రిజర్వేషన్లు చేస్తాం.. వచ్చి తమకే ఓటేయండి.’ అంటూ కోరుతున్నారు. మొత్తంగా దూర ప్రాంత ఓటర్లను జిల్లాకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫోన్లు చేసి పలకరింపులు
తమకే ఓటేయాలని కోరుతున్న వైనం
పార్వతీపురం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): వలస ఓటర్లపై రాజకీయపార్టీ నేతలు దృష్టి సారించారు. ప్రధానంగా బరిలో నిలిచిన అభ్యర్థులు వారికి ఫోన్లు చేసి పలకరిస్తున్నారు. క్షేమ సమాచారం తెలుసుకుని.. ‘ ట్రైన్, బస్సు టిక్కెట్లు రిజర్వేషన్లు చేస్తాం.. వచ్చి తమకే ఓటేయండి.’ అంటూ కోరుతున్నారు. మొత్తంగా దూర ప్రాంత ఓటర్లను జిల్లాకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపాధి కోసం స్వగ్రామాలను వదిలి.. విజయవాడ, విశాఖ, హైదరాబాద్, బెంగళూర్, చెన్నై తదితర ప్రాంతాల్లో ఎంతోమంది జిల్లావాసులు పనిచేస్తున్నారు. అయితే పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ.. చైర్పర్సన్, కౌన్సిలర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు వలస ఓటర్లకు పిలుపు చేస్తున్నారు. ఇదే సమయంలో వేరే ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులు, కుటుంబ సభ్యులకు సైతం కబుర్లు పంపుతున్నారు. పోలింగ్ రోజున వచ్చి.. తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అయితే కొంతమంది ఓటర్లు వచ్చేందుకు సుముఖత చూపిస్తున్నప్పటికీ మరికొంతమంది ఓటర్లు మాత్రం వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి జిల్లాకు రావాలంటే.. రెండు, మూడు రోజుల కూలీ ఆదాయం పోతుందని యోచిస్తున్నారు. మరికొందరు మాత్రం కాదనలేక బంధు వర్గాలను దృష్టిలో పెట్టుకుని ‘పోలింగ్ రోజున జిల్లాలో ఉండే విధంగా రిజర్వేషన్లు చేయండి’ అంటూ చెబుతున్నారు. కాగా వలస ఓటర్లను జిల్లాకు రప్పించాలంటే అభ్యర్థులకు భారీగా వెచ్చించాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కో ఓటరు రానుపోను రిజర్వేషన్ చార్జీలు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కేటాయించాల్సి వస్తోంది. వచ్చిన తర్వాత మర్యాదల కోసం కనీసం ఓటుకు రూ.వెయ్యి అదనంగా ఖర్చులు చేయాల్సి ఉంటుందని కొందరు అభ్యర్థులు భావిస్తున్నారు. ఏదేమైనా ఓటు కోసం తప్పడం లేదని అభిప్రాయపడుతున్నారు.
రమ్మని పిలిచాం..
మా గ్రామానికి చెందిన కొంతమంది ఓటర్లు ఉపాధి కోసం దూర ప్రాంతంలో ఉంటున్నారు. వారిని వచ్చి ఓటు వేయాలని అభ్యర్థించాం. ఇక వస్తారో లేదో వారి ఇష్టం. వస్తామంటే రిజర్వేషన్లు చేస్తాం. రిజరేషన్లు అక్కర్లేదంటే ఖర్చులు ఇచ్చేస్తాం అని చెప్పాం.
- ఎంపీటీసీ అభ్యర్థి, పార్వతీపురం
=================================
ఖర్చులు తప్పవు కదా..
దూర ప్రాంతంలో మా బంధువులు ఉంటున్నారు. వారికి స్థానికంగా ఓట్లు ఉన్నాయి. ఉపాధి కోసం వేరే ప్రాంతంలో ఉంటున్న వారు ఏటా సంక్రాంతి పండుగ సమయంలో ఇక్కడకి వస్తుంటారు. కానీ ఎన్నికలు ఉండడంతో దసరాకు రావొద్దు.. పోలింగ్‌కు రావాలని కోరాం. అభ్యర్థుల అభ్యర్థన మేరకు వారికి అలాగే చెప్పాం. వచ్చిన వారికి రానుపోను చార్జీలతో పాట మర్యాదల కోసం అదనపు ఖర్చులు తప్పవు కదా.
- జడ్పీటీసీ అభ్యర్థి దగ్గర బంధువు, పార్వతీపురం