Liquor Shops మద్యం షాపుల రెన్యువల్
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:22 PM
Renewal of Liquor Shops మద్యం షాపులను మరో ఏడాది పాటు రెన్యువల్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అక్టోబరు 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు లైసెన్సులు పొడిగిస్తూ 2026-27 పాలసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో 56 మద్యం దుకాణాలు రెన్యువల్స్ కోసం ఈనెల 21లోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది.
21లోగా దరఖాస్తు చేసుకోవాలి
మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
పార్వతీపురం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): మద్యం షాపులను మరో ఏడాది పాటు రెన్యువల్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అక్టోబరు 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు లైసెన్సులు పొడిగిస్తూ 2026-27 పాలసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో 56 మద్యం దుకాణాలు రెన్యువల్స్ కోసం ఈనెల 21లోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. వాటిల్లో నాలుగు గీత కులాలకు రిజర్వ్‌డ్ షాపులున్నాయి. రెన్యువల్ చేసుకునే లైసెన్సీలు లైసెన్స్ ఫీజులో 38 శాతం రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఆర్‌ఈటీ) చెల్లించాలి. మొత్తంగా ప్రభుత్వానికి రూ.53.84 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
చెల్లించాల్సిన ఫీజులు ఇలా..
- రూ.71.50 లక్షల శ్లాబ్ ఓపెన్ కేటగిరీలో ఉన్న దుకాణాలు లైసెన్స్ రెన్యువల్ కోసం ఒకేసారి 38 శాతం అంటే రూ. 27.20 లక్షలు చెల్లించాలి. అదేవిధంగా వార్షిక ఫీజు మొదటి వాయిదా రూ. 17.87 లక్షలు, పర్మిట్ రూమ్ మొదటి వాయిదా రూ.2.50 లక్షలు చెల్లించాల్సిఉ ఉంది.
- రూ.60.50 లక్షల శ్లాబ్ ఓపెన్ కేటగిరీలో ఉన్న దుకాణదారులు రెన్యువల్ కోసం 38 శాతం చోప్పున రూ.23 లక్షలు కట్టాలి. వార్షిక మొదటి వాయిదా కింద రూ.15.12 లక్షలు, పర్మిట్ రూమ్ కోసం 1.66 లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుంది.
- రూ.35.80 లక్షల రిజర్వ్ కేటగిరీ శ్లాబ్‌లో ఉన్న దుకాణదారులు 38 శాతం చొప్పున రూ.13.60 లక్షలు, అదే విధంగా వార్షిక మొదటి వాయిదా రూ. 8.9 లక్షలు, పర్మిట్ రూమ్ కోసం రూ.2.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. అదే విధంగా రూ.30.30 లక్షల శ్లాబ్ దుకాణాలు 38 శాతం రెన్యువల్ ఫీజు రూ. 11.50లక్షలు చెల్లించాలి. వార్షిక మొదటి వాయిదా రూ.7.57 లక్షలు, పర్మిట్ రూమ్ కోసం రూ.1.66 లక్షలు చెల్లించాల్సి ఉంది.
- వార్షిక ట్యాక్స్ ఒకేసారి లేదా నాలుగు సమాన వాయిదాలలో, పర్మిట్ రూమ్ ట్యాక్స్ మూడు సమాన వాయిదాలలో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. వాయిదాల పద్ధతిని ఎంచుకునే వారు దరఖాస్తు సమయంలో మొదటి వాయిదా చెల్లించంతో పాటు లైసెన్స్ గడువు తేదీ వరకు చెల్లుబాటు అయ్యేలా ఒక వాయిదా మొత్తానికి సమానమైన ఫారం ఏ ఫైవ్ బ్యాంక్ గ్యారెంటీని 30 రోజుల్లోపు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు ఆన్‌లైన్ రిటైలర్ అప్లికేషన్ మాడ్యూల్ ద్వారా ఫార్మ్ ఏ త్రీలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. వాటితో పాటు నిబంధనల మేరకు చలనాలు చెల్లించడంతో పాటు అవసరమైన పత్రాలను దరఖాస్తుతో జత చేయాల్సి ఉంది.
21తో ముగియనున్న గడువు
దరఖాస్తుల చేసుకునేందుకు ఈ నెల 21 సాయంత్రం ఐదు గంటల వరకే గడువు ఇచ్చారు. అర్హత సాధించిన దుకాణదారులకు 22న లైసెన్స్‌లు రెన్యువల్ చేస్తారు. అయితే అధికారులు ఇప్పటికే దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించారు. ప్రస్తుత దుకాణదారులు రెన్యువల్‌కు గడువులోగా దరఖాస్తు చేసుకోకపోతే వాటికి కొత్తగా నోటిపకేషన్ జారీ చేస్తారు. కనీసం నాలుగు దరఖాస్తులు వస్తే లాటరీ రూపంలో దుకాణాలను కేటాయిస్తారు. దీని కోసం దరఖాస్తుదారులు రూ.మూడు లక్షల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. నిబంధనలు ప్రకారం దరఖాస్తులు రాకపోతే.. లాటరీ నిర్వహించలేని పరిస్థితులు ఉంటే.. ఆ రూ.3 లక్షలను తిరిగి చెల్లిస్తారు. లాటరీ పద్ధతిలోనే దుకాణాలు కేటాయిస్తారు. ‘జిల్లాలో 56 మద్యం దుకాణాలకు సంబంధించి రెన్యువల్స్ దరఖాస్తులను ఈ నెల 21 వరకు స్వీకరిస్తాం. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు రెన్యువల్స్ అవుతాయి. అదే విధంగా రెన్యువల్స్ కాని దుకాణాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి షాపులు కేటాయిస్తాం.’ అని జిల్లా ఎక్సైజ్ శాఖాధికారి సహదేవ్ తెలిపారు.