Re-NEET is today. నేడే రీ నీట్
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:59 PM
Re-NEET is today.జిల్లాలో రీ-నీట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై 5.15 గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో 1901 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
నేడే రీ నీట్
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో పరీక్ష
హాజరు కానున్న 1901 మంది విద్యార్థులు
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, జూన్20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రీ-నీట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై 5.15 గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో 1901 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రానికి తప్పకుండా 11 గంటలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు మధ్యాహ్నం 1.40 గంటలకు తమ కేటాయించిన గదికి చేరుకోవాలి. ఆడ్మిట్ కార్డుతో పాటు రెండు కలర్ ఫొటోలు, ఒక పోస్టుకార్డు సైజ్ ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, కాలిక్యూలేటర్ వంటి పరికరాలు తీసుకువెళ్లకూడదు. విద్యార్థినులు హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, ఆభరణాలు, లోహపు వస్తువులు తీసుకురాకూడదు. సాధారణ దుస్తులు, చెప్పులతో మాత్రమే కేంద్రాలకు రావాల్సి ఉంది. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.15 వరకూ 08922-236947 నెంబరుతో సహాయ కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు.
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
జిల్లా కేంద్రంలోని జెఎన్‌టీయూ పరీక్ష కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం పరిశీలించారు. పరీక్ష కేంద్రంలోని ఎనిమిది గదులను పరిశీలించారు. చెంచీలపై రోల్ నెంబర్ల ప్రదర్శన, సీసీ కెమెరాల పనితీరు, విద్యుత్ సరఫరా, తాగునీరు సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీనీట్ పరీక్ష పారదర్శంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి ముందుగా చేరుకోవాలని, ప్రవేశ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్ష రాయాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట జేసీ సేతుమాధవన్, జేఎన్‌టీయూ వీసీ సుబ్బారావు, ప్రిన్సిపాల్ కేసీబీ రావు ఉన్నారు.