Share News

వీఆర్‌ఎస్‌ పనులకు మోక్షం

ABN , Publish Date - May 11 , 2026 | 11:57 PM

Relief for VRS Works వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని కాలువల్లో పూడిక తీతలు, ఇతర మరమ్మతు పనుల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రూ. కోటీ 34 లక్షల మేర నిధులు మంజూరు చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వీఆర్‌ఎస్‌ పనులకు మోక్షం
వీఆర్‌ఎస్‌ గట్టుపై తుప్పలు,డొంకలను తొలగిస్తున్న దృశ్యం

  • వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు కాలువల్లో పూడికతీత, ఇతర మరమ్మతులకు చర్యలు

మక్కువ రూరల్‌, మే11(ఆంధ్రజ్యోతి): వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని కాలువల్లో పూడిక తీతలు, ఇతర మరమ్మతు పనుల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రూ. కోటీ 34 లక్షల మేర నిధులు మంజూరు చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాల్లో సుమారు 24,700ఎకరాలకు ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టు పరిధిలో మొత్తం 25 పనులు చేపట్టేందుకుగాను అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పనులన్నీ ఆయకట్టు సంఘాల ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. మంజూరైన నిధులతో కాలువల్లో పూడిక తీతలతో పాటు సువర్ణముఖి, గోముఖి రిజర్వాయర్ల పరిధిలో పలు పనులు, షట్టర్ల మరమ్మతులు, డిస్ట్రిబ్యూటరీలను అభివృద్ధి చేయనున్నారు. దీనిపై వీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు డీఈ డి.సురేష్‌ను వివరణ కోరగా.. ‘ ప్రాజెక్టు పరిధిలోని కాలువల్లో పూడికతీత, ఇతర మరమ్మతు పనులకు నిధులు మంజూరయ్యాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందుగానే కాలువ పనులు పూర్తిచేసి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఓఎన్‌డీ ఎం కింద మంజూరైన పనులన్నీ ఆయకట్టు సంఘాల ఆధ్వర్యంలో జరగనున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు గట్టుపైన పేరుకుపోయిన డొంకలు, తుప్పలు తొలగిస్తున్నాం. జూలై నెలాఖరు నాటికి పనులన్నీ పూర్తిచేస్తాం. సాగునీటి సరఫరాలో అడ్డంకులు లేకుండా చూస్తాం.’ అని తెలిపారు.

Updated Date - May 11 , 2026 | 11:57 PM