Tribal Farmers’ గిరిజన రైతుల ‘చింత’ తీరేలా!
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:42 PM
Relief for Tribal Farmers’ Worries! గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు సేకరించే చింతపండు ధరను పెంచుతూ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. కిలో రూ.45గా నిర్ణయిస్తూ ఉత్తర్వులిచ్చింది.
పిక్క తీసింది రూ.130
ధర పెంచిన ప్రభుత్వం
పార్వతీపురం, మార్చి13(ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు సేకరించే చింతపండు ధరను పెంచుతూ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. కిలో రూ.45గా నిర్ణయిస్తూ ఉత్తర్వులిచ్చింది. గత కొంతకాలంగా చింతపండుకు మద్దతు ధర లేక గిరిజన రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఏటా కిలో ధర రూ.32 నుంచి రూ.36 మధ్య ఉండడంతో వారికి గిట్టుబాటు కావడం లేదు. వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. ధరను పెంచాలని కొన్నాళ్లుగా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సమస్యను పరిగణనలోకి తీసుకున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి ఇటీవల గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్ కె.శ్రావణ్ కుమార్ కూడా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కిలో చింతపండు ధర రూ. 45కు పెంచుతూ జీసీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పిక్క తీసిన చింతపండు కిలో ధర రూ. 115 నుంచి రూ.130కు పెంచారు. గిరిజన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని, దళారులను నమ్మి మోసపోవద్దని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్ కుమార్ రెడి,్డ జీసీసీ డివిజన్ మేనేజర్ రామారావు కోరారు.