Tribal Farmers గిరిజన రైతులకు తీరిన ‘చింత’
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:49 PM
Relief for Tribal Farmers from ‘Worry’ ఏజెన్సీలో చింతపండు సేకరించే గిరిజన రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. కిలో చింతపండు ధరను రూ.55కు పెంచి వారి చింతను తీర్చింది. వాస్తవంగా గిరిజన రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల ప్రభుత్వం కిలో చింతపండు ధరను రూ.36 నుంచి రూ.45కు పెంచింది. అయితే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర , పంట దిగుబడి ఇతర పరిస్థితుల రీత్యా.. అదనంగా మరో రూ.10 పెంచింది.
ప్రభుత్వ ఆదేశాలపై గిరిపుత్రుల హర్షం
పార్వతీపురం, ఏప్రిల్7(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో చింతపండు సేకరించే గిరిజన రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. కిలో చింతపండు ధరను రూ.55కు పెంచి వారి చింతను తీర్చింది. వాస్తవంగా గిరిజన రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల ప్రభుత్వం కిలో చింతపండు ధరను రూ.36 నుంచి రూ.45కు పెంచింది. అయితే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర , పంట దిగుబడి ఇతర పరిస్థితుల రీత్యా.. అదనంగా మరో రూ.10 పెంచింది. దీంతో ఇకపై కిలో చింతపండును రూ.55 కొనుగోలు చేయనున్నట్లు జీసీసీ వెల్లడించింది. గతంలో జీసీసీ కిలోకు రూ. రెండు లేదా రూ.మూడు పెంచేది. దీంతో గిరిజన రైతులు దళారుల దోపిడీకి గురయ్యేవారు. అయితే ఈ సారి ప్రభుత్వం భారీగా ధర పెంచడంతో గిరిపుత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఈ ఏడాది జిల్లాలో చింతపండు దిగుబడి తక్కువగా ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం ధర పెంచడంతో కొందరు వ్యాపారులు కిలోకు రూ.55 చెల్లించేందుకు వెనుకాడడం లేదు. గతంలో గిరిజనులకు తక్కువ ధర చెల్లించి చింతపండును కొనుగోలు చేసేవారు నేడు డైలమాలో పడ్డారు. కాగా గిరిజన రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ ఏడాది చింతపండు కొనుగోలులో జీసీసీ లక్ష్యాలు విధించుకోలేదు. గత ఏడాది 29 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. ఈ సారి అంతకుమించి సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు. చింతపండు ధర పెంపు విషయంపై గిరిజన రైతులకు అవగాహన కల్పించాల్సి ఉందని, ఉన్నతాఽధికారులు కూడా పర్యవేక్షించాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. ‘గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం చింతపండు ధరను పెంచింది. కిలోకు సుమారు రూ.19 వరకు పెంచింది. గిరిజన రైతులు జీసీసీలోనే పంటను విక్రయించుకుని మద్దతు ధర పొందాలి. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. ‘గిరిజన రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. కిలో చింతపండు ధరను రూ.45 నుంచి రూ.55కు పెంచడం ఆనం దంగా ఉంది.’ అని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. గిరిజన రైతుల నుంచి పూర్తిస్థాయిలో చింతపండు సేకరణకు చర్యలు చేపడుతున్నామని జీసీసీ డివిజనల్ మేనేజర్ రామారావు తెలిపారు.