Relief for employees ఉద్యోగులకు ఊరట
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:37 AM
Relief for employees ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఆర్సీ అమలుకు కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. అలాగే రెండు డీఏలు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. 2022 ఏడాది సరెండర్ లీవ్‌లు, రిటైరయిన వారికి క్వాంటం ఆఫ్ పెన్షన్ రీస్టోరేషన్, ఈహెచ్‌ఎస్ బకాయిలు సైతం ప్రతినెలా చెల్లించేందుకు ఆమోదించింది
ఉద్యోగులకు ఊరట
12వ వేతన సవరణకు కమిటీ
అక్టోబరు 1 నుంచి 2 డీఏలు అమలు
ఇక క్రమం తప్పకుండా ఈహెచ్‌ఎస్‌కు చెల్లింపులు
పెన్షనర్లకు ప్రయోజనం కల్పిస్తూ నిర్ణయం
జిల్లాలో 32వేల మందికి ప్రయోజనం
విజయనగరం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఆర్సీ అమలుకు కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. అలాగే రెండు డీఏలు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. 2022 ఏడాది సరెండర్ లీవ్‌లు, రిటైరయిన వారికి క్వాంటం ఆఫ్ పెన్షన్ రీస్టోరేషన్, ఈహెచ్‌ఎస్ బకాయిలు సైతం ప్రతినెలా చెల్లించేందుకు ఆమోదించింది. సీఎం చంద్రబాబుతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తాజాగా సమావేశమై తమ సమస్యలను ఆయన ముందు ఉంచారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఉద్యోగుల అపరిష్కృత డిమాండ్లు కావడంతో సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. దీనిపై ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజా నిర్ణయంతో జిల్లాలో వేలాది మంది ఉద్యోగులకు ఎన్నోరకాల ప్రయోజనాలు దక్కనున్నాయి. ప్రధానంగా 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటుచేయాలని నిర్ణయించడం ఊరటనిచ్చే విషయం.
సీఎం నిర్ణయం సాహసోపేతం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. గత ముఖ్యమంత్రి హయాంలో కనీసం ఉద్యోగ సంఘాలకు కలవటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ ముఖ్యమంత్రి స్వయంగా ఉద్యోగ సంఘాలను పిలిపించి... మాట్లాడి.. సమస్యలు విని.. న్యాయం చేయటం పట్ల ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 33వేల మందికి ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.
ఫ పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను అక్టోబరు 1 నుంచి అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంపై ఉద్యోగులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో 22,205 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రకటించిన డీఏతో వీరంతా ప్రయోజనం పొందనున్నారు. అయితే రెండు డీఏలు వేర్వేరుగా అమలుచేస్తే.. ఒక్కో డీఏకు రూ.1000 నుంచి రూ.3000 వరకూ ప్రయోజనం కలుగుతుంది. సగటున రూ.1400 తప్పనిసరి అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు లెక్కలు వేసుకుంటున్నారు. అదే రెండు డీఏలతో రెట్టింపు ప్రయోజనాలు దక్కుతాయి. జిల్లా మొత్తంగా ఒక్క డీఏతో రూ.3.10 కోట్ల మేర లబ్ధి కలుగుతుంది. అదే రెండు డీఏలు ఒకేసారి ఇస్తే మాత్రం రూ.6.20 కోట్లు ప్రయోజనం కలగనుంది.
సరెండర్ లీవ్స్ మంజూరు
మరోవైపు 2022 సరెండర్ లీవ్స్ నగదును రాబోయే సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అటు శాంతిభద్రతల పర్యవేక్షణలో శ్రమిస్తున్న పోలీసులకు దసరాకు అదనంగా సరెండర్ లీవ్‌ను మంజూరు చేయనున్నారు. జిల్లాలో వేలాది మంది పోలీస్ సిబ్బందికి ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. పెన్సన్‌దారులకు సాంత్వన చేకూర్చుతూ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను 2027 జనవరి 1 నుంచి అమలుచేయాలని నిర్ణయించారు. ఈ ప్రకారం 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు నిండిన వారికి 15 శాతం మేరకు అదనపు పెన్షన్ దక్కనుంది. ఇంకోవైపు ఉద్యోగులకు ఇబ్బందులకు గురిచేస్తున్న ఎంప్లాయిస్ హెల్త్‌స్కీంను సమూలంగా ప్రక్షాళన చేయనున్నారు. ఉద్యోగుల ఆరోగ్యకార్డులపై ఆస్పత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వచ్చే నెల నుంచి ఎప్పటికప్పుడు ..ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్‌కు ప్రభుత్వ వాటా నిధులను నెలవారీ విడుదలకు ప్రభుత్వం నిర్ణయించడం శుభ పరిణామం.
బాగానే ఉంది
ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో 32 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరటం బాగానే ఉంది. ఉద్యోగుల బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. పాలనలో ఉద్యోగులదే కీలక పాత్ర అన్న విషయం గుర్తుచేసుకోవాలి. ఇంకా చాలా సమస్యలు పరిష్కారానికి పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని సైతం పరిష్కరించి న్యాయం చేయాలి. వేతన సవరణ కమిటీ ఏర్పాటుతో పాటు రెండు డీఏల ప్రకటన ఆనందంగా ఉంది.
- ఏ.సురేష్, ఏపీఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు