Relief for employees ఉద్యోగులకు ఊరట
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:21 AM
Relief for employees ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కంట్రీబ్యూటరీ పెన్సన్ స్కీం (సీపీఎస్)లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను పాత పెన్షన్ విధానంలోకి(ఓల్డ్ పెన్షన్ స్కీం) మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జిల్లాలో దాదాపు 1100 మందికి మేలు జరుగనుంది. ప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులకు ఊరట
2004కు ముందు చేరిన వారికి ఓపీఎస్
కూటమి ప్రభుత్వ సానుకూల నిర్ణయం
జిల్లాలో 1100 మంది వరకూ లబ్ధి
హర్షం వ్యక్తంచేస్తున్న ఉద్యోగులు
విజయనగరం, జూన్ 24(ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కంట్రీబ్యూటరీ పెన్సన్ స్కీం (సీపీఎస్)లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను పాత పెన్షన్ విధానంలోకి(ఓల్డ్ పెన్షన్ స్కీం) మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జిల్లాలో దాదాపు 1100 మందికి మేలు జరుగనుంది. ప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో 2004 సెప్టెంబరు నుంచి సీపీఎస్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం రద్దయ్యింది. సీపీఎస్ అమలు చేస్తున్నారు. అయితే 2004కు ముందే వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. కానీ నియమాక ప్రక్రియ సీపీఎస్ అమల్లోకి వచ్చిన తరువాత పూర్తికావడంతో వారంతా పాత పెన్షన్ స్కీంను కోల్పోయారు. రెండు దశాబ్దాలుగా వీరు పాత పెన్షన్ స్కీం కోసం పోరాడుతున్నారు. అటువంటి వారికి పాత పెన్షన్ స్కీం వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం 2020లోనే స్పష్టం చేసింది. కానీ జగన్ సర్కారు పెడచెవిన పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 10,715 మంది ఉద్యోగులు పాత పెన్షన్ విధానానికి దూరంగా ఉన్నారు. వారి సమస్యను అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పాత పెన్షన్ విధానం అమలుచేసేందుకు మంగళవారం కేబినెట్ భేటీలో సానుకూల నిర్ణయం తీసుకుంది.
టీడీపీ హయాంలో డీఎస్సీలు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువసార్లు ఉపాధ్యాయ నియామకానికి నోటిఫికేషన్లు వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 1998, 2000, 2001, 2003లో వరుస డీఎస్సీలను ప్రకటించారు. దాదాపు 50 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశారు. అయితే 2003 డీఎస్పీ పరీక్ష టీడీపీ హయాంలో జరిగింది కానీ నియామక ప్రక్రియ మాత్రం 2004లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పూర్తిచేశారు. దీంతో జిల్లాలో వందలాది మంది సీపీఎస్ పరిధిలోకి వచ్చేశారు. 2003లో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అంతకు ముందే వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, ఇతరత్ర శాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. నియామకాలు మాత్రం 2004 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగాయి. దీంతో అప్పట్లో వారంతా పాత పెన్షన్ విధానంపై కాకుండా కొత్తగా కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన సీపీఎస్ పరిధిలోకి వచ్చారు. వీరంతా గతకొంతకాలంగా సీపీఎస్ రద్దు కోరుతూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.
కేంద్ర మార్గనిర్దేశం
2004 సెప్టెంబరుకు ముందు నోటిఫికేషన్లు వచ్చి నియామక పరీక్షలు జరిగి ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం 2020లోనే స్పష్టం చేసింది. కానీ జగన్ సర్కారు పెడచెవిన పెట్టింది. ఆర్థికభారం అని చెప్పి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,700 మంది విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో సైతం జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం చేకూరనుంది.
హర్చించదగ్గ విషయం
ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. 2004కు ముందు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ అయిన వారిని పాత పెన్షన్ స్కీంలోకి తీసుకోవడం శుభ పరిణామం. మంత్రి వర్గం ఆమోదించడం ఆనందదాయకం. ఈ విషయంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అయితే మిగతా ఉద్యోగుల విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకోవాలి. వేతన బకాయిలతో పాటు డీఏలు విడుదల చేయాలి.
- సురేష్, అధ్యక్షుడు, ఏపీఎన్జీవో ఉద్యోగ సంఘం, విజయనగరం
చారిత్రక నిర్ణయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పాత పింఛను అమలుపై తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి ఉద్యోగికి ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరుగుతుంది. రెట్టింపు ఉత్సాహంతో మరింత అంకితభావంతో పనిచేస్తాం.
అల్లాడ జయప్రకాశ్, పీడీవో, గజరాయునివలస, బాడంగి మండలం
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
ప్రభుత్వం పాత పెన్షన్ పథకాన్ని వర్తింపజేయడం సాహసోపేత నిర్ణయం. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందే ప్రతి ఉద్యోగి ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. ప్రభుత్వ నిర్ణయాలు అమలుకు మరింత ఉత్సాహంగా పనిచేస్తాం.
శంబంగి గణపతిరావు, పీడీవో, గూడెపువలస, బాడంగి మండలం