Share News

ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందుల విక్రయాలు.. శ్రీకాకుళం జిల్లాలో నిబంధనలు నామమాత్రం

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:47 PM

Regulations are merely nominal. ‘తలనొప్పిగా ఉంది. జ్వరం సైతం వస్తోంది. ఏమైనా మందులు ఇవ్వండి’ అని రాజాంలో మందుల దుకాణం వద్దకు వచ్చి ఓ వృద్ధురాలు కోరగా మెడికల్‌ దుకాణ యజమాని ఉదయం ఒకటి.. తగ్గకపోతే రాత్రికి ఒకటి మాత్ర వేస్తూ యాంటీ బయోటిక్‌ అదనంగా వేసుకోండి అని ఇచ్చాడు. ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే మందులిచ్చి పంపించాడు.

ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మందుల విక్రయాలు.. శ్రీకాకుళం జిల్లాలో నిబంధనలు నామమాత్రం

నిబంధనలు నామ‘మాత్ర’ం

జిల్లాలో ఇష్టారాజ్యంగా మందుల విక్రయాలు

పుట్టగొడుగుల్లా దుకాణాలు

ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణ కరువు

డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండా అమ్మకాలు

ప్రజలకు తప్పని అదనపు బాధలు

రాజాం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):

‘తలనొప్పిగా ఉంది. జ్వరం సైతం వస్తోంది. ఏమైనా మందులు ఇవ్వండి’ అని రాజాంలో మందుల దుకాణం వద్దకు వచ్చి ఓ వృద్ధురాలు కోరగా మెడికల్‌ దుకాణ యజమాని ఉదయం ఒకటి.. తగ్గకపోతే రాత్రికి ఒకటి మాత్ర వేస్తూ యాంటీ బయోటిక్‌ అదనంగా వేసుకోండి అని ఇచ్చాడు. ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే మందులిచ్చి పంపించాడు. ఇక్కడే కాదు జిల్లా వ్యాప్తంగా చాలా మెడికల్‌ దుకాణాల్లో ఇదే తీరు సాగుతోంది. రోగం ఏదైనా కావొచ్చు..పరుగున వెళ్లి మందుల షాపుల వద్ద మందులు కొనుక్కోవడం చాలామందికి అలవాటు. లోపల సమస్య ఏంటో కచ్చితంగా తెలుసుకోకుండా విచ్చలవిడిగా మందులు వాడేస్తున్నారు. ఇది ముప్పు అన్న విషయం మరిచిపోతున్నారు. విపరీతంగా యాంటీ బయోటిక్స్‌ వాడితే కాలేయంతో పాటు కిడ్నీలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిబంధనల ప్రకారం వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌ ఉంటేనే దుకాణాల్లో మందులు ఇవ్వాలి. కానీ మెడికల్‌ షాపులు అడ్డదారుల్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. మాత్రల కోసం వచ్చేవారికి ఏదో ఒకటి అంటకట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. అవగాహన పరిచేందుకు కనీసం ప్రయత్నించడం లేదు.

జిల్లాలో హోల్‌సేల్‌, రిటైల్‌ మందుల దుకాణాలు 1626 వరకూ ఉన్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన డ్రగ్‌ రెగ్యులేటరీ అథారిటీకి చెందిన ఉద్యోగులు కేవలం ముగ్గురే ఉన్నారు. రోజుకు రూ.కోట్లలో ముందుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మందుల షాపు వద్దకు వెళితే.. ఒక కంపెనీ మందులకు బదులు మరో మందులు ఇస్తున్నారు. దీంతో కొన్నిసార్లు దుష్పరిణామాలు కలుగుతున్నాయి. అసలు మందుల షాపులు నిర్వహించేవారికి కూడా మందులపై అవగాహన లేని పరిస్థితి. డీ ఫార్మసీ చేసేవారి సర్టిఫికెట్‌ను ఏడాదికి ఇంత అని లీజుకు తీసుకుంటున్నారు. అదో వ్యాపారంగా మలుచుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందిలో కొందరు పదో తరగతి లోపువారే ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొన్ని మందుల షాపుల్లో అసలు చలామణిలో లేనివి, కనీస అనుమతులు లేని కంపెనీల నుంచి మందులను తెప్పించి రోగులకు అంటగడుతున్నారు.

కానరాని జనరిక్‌ మందులు

వాస్తవానికి ప్రభుత్వం జనరిక్‌ మందులనే వాడాలని..ఆ మేరకు విక్రయించాలని.. వైద్యులు ప్రిస్ర్కిప్షన్‌పై వాటినే రాయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి కానీ అవి జిల్లాలో అమలుకావడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా జనరిక్‌ మందుల షాపులు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకూ ఆ వైపుగా చర్యలు లేవు. అయితే వీటిని ఏర్పాటుచేయడమే కాదు.. దుకాణాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

తనిఖీలు చేస్తున్నాం

మందుల షాపుల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నాం. శాఖలో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. అయినా సరే తనిఖీలు ఆపడం లేదు. అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదు చేస్తున్నాం.

- కె.రజిత, జిల్లా ఔషధ నియంత్రణ అధికారి, శ్రీకాకుళం

----------------

Updated Date - Aug 13 , 2026 | 02:17 PM