Share News

గ్రామకంఠాలకు రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - May 22 , 2026 | 11:34 PM

ఇది ఒక్క రాములమ్మ సమస్యే కాదు. జిల్లాలో వేలాది మందిది ఇదే పరిస్థితి. చాలామంది భూములు, ఇంటి స్థలాలు, నివాస ప్రాంతాలు గ్రామకంఠంలో ఉండిపోయాయి.

గ్రామకంఠాలకు రిజిస్ట్రేషన్‌

- ఆస్తి, ఇంటి పన్ను రశీదు ఉంటే చాలు

- మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

- సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అక్రమాలకు చెక్‌

- జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం

- మెంటాడ గ్రామానికి చెందిన రాములమ్మ అనే వృద్ధురాలు కుటుంబ అవసరాల కోసం తనకు ఉన్న సెంటున్నర స్థలం విక్రయించేందుకు సిద్ధపడింది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లగా అది గ్రామకంఠం భూమిగా ఉంది. దీంతో తహసీల్దార్‌ ధ్రువీకరణపత్రం లేదు. కానీ స్టాంప్‌ డ్యూటీకి అదనంగా రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వచ్చింది.

విజయనగరం, మే 22 (ఆంధ్రజ్యోతి): ఇది ఒక్క రాములమ్మ సమస్యే కాదు. జిల్లాలో వేలాది మందిది ఇదే పరిస్థితి. చాలామంది భూములు, ఇంటి స్థలాలు, నివాస ప్రాంతాలు గ్రామకంఠంలో ఉండిపోయాయి. అటువంటి వాటికి రిజిస్ట్రేషన్లు జరగవు. ఒకవేళ చేయాలంటే తహసీల్దార్‌ ధ్రువీకరణపత్రం తప్పనిసరి. దీంతో వేలాది మంది తమ స్థలాలను విక్రయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వారికి కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. గ్రామకంఠం భూములకు ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో ఒకే సర్వేనంబర్‌ గ్రామకంఠంగా నమోదైతే.. అది నిషేధిత జాబితాలో ఉన్నా? లేకపోయినా? రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ఆ భూములు/స్థలానికి సంబంధించి ఆస్తిపన్ను రశీదు, ఖాళీ పన్ను రశీదుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి, ఖాళీ స్థలానికి పన్ను రశీదు లేకుంటే క్రయ, విక్రయదారుడు సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో రిజిస్ట్రేషన్‌కు అవకాశమిచ్చింది. దీంతో జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం కలగనుంది.

ఆ ఇబ్బందులు ఇక ఉండవు..

గ్రామకంఠం భూముల విషయంలో ఇప్పటివరకూ ఉన్న నిబంధనలతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దోపిడీ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. రకరకాల కొర్రీలు పెడుతూ గ్రామకంఠం భూములు, స్థలాలను రిజిస్ట్రేషన్లు చేసేవారు కాదు. ఒకవేళ రిజిస్ట్రేషన్లు చేయాలంటే అదనంగా చెల్లించాల్సి వచ్చేది. డాక్యుమెంట్‌ రైటర్లను అడ్డం పెట్టుకొని చేతివాటం ప్రదరించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంటి అవసరాల కోసం గ్రామకంఠం భూములను విక్రయించుకోవాలనుకునే వారికి చుక్కలు కనిపించేవి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద దళారులు మాటు వేసి మరీ వసూళ్లపర్వానికి తెరలేపేవారు. ఇక నుంచి ఆ ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు గ్రామకంఠం భూముల విషయంలో ప్రభుత్వమే నేరుగా మార్గదర్శకాలు జారీచేయడంతో ఈ అక్రమ తంతుకు చెక్‌ పడనుంది.

మార్గదర్శకాలు వచ్చాయి..

గ్రామకఠం భూములకు సంబంధించి మార్గదర్శకాలు వచ్చాయి. వాటికి ధ్రువపత్రాల అవసరం లేదు. కేవలం పన్ను రశీదు ఉంటే చాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఆ రశీదులు లేనివారు వీఆర్వో ధ్రువకరిస్తే చాలు. జిల్లాలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై నిఘా కొనసాగుతోంది. పర్యవేక్షణ సైతం చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసినా.. అక్రమ వసూళ్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రిజిస్ట్రేషన్లు చేయాలి.

- జిల్లా రిజిస్ట్రార్‌, విజయనగరం

Updated Date - May 22 , 2026 | 11:34 PM