Share News

Registered documents delivered directly to house రిజిస్టర్డ్‌ దస్తావేజులు నేరుగా ఇంటికే..

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:47 PM

Registered documents delivered directly to your doorstep... స్థిర ఆస్తుల రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లను ఇకపై రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా నేరుగా ఇంటికే పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో అమలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అమలులో ఇబ్బందులు వస్తాయని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు.

Registered documents delivered directly to house రిజిస్టర్డ్‌ దస్తావేజులు  నేరుగా ఇంటికే..

రిజిస్టర్డ్‌ దస్తావేజులు

నేరుగా ఇంటికే..

నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

జిల్లా అధికారులకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశం

కసరత్తు చేస్తున్న స్టాంపులు రిజిస్ర్టేషన్ల శాఖ

స్థిర ఆస్తుల రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లను ఇకపై రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా నేరుగా ఇంటికే పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో అమలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అమలులో ఇబ్బందులు వస్తాయని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆస్తి కొనుగోలుదారులకు ఆ డాక్యుమెంట్‌ అందకపోతే బాధ్యత వహించాల్సి వస్తుందేమోనని సందేహ పడుతున్నారు. మరోవైపు ఆచరణ దిశగా కసరత్తు చేస్తున్నారు.

కొత్తవలస, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి):

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో కొత్త విధానాలను అమలులోకి తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. దస్తావేజులను నేరుగా ఆస్తులను కొనుగోలు చేసుకున్నవారింటికే పంపించాలని తాజాగా నిర్ణయించింది. ఈ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే రిజిస్ర్టేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పాస్‌పోర్టు కార్యాలయాల్లో ఈ విధానం అమలులో ఉంది. ఇదే తరహాలో రిజిస్ర్టేషన్ల శాఖలో కూడా అమలు చేయాలని భావిస్తోంది. గతంలో దస్తావేజులను చేతితో రాసే వారు. 1995 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజిస్ర్టేషన్ల శాఖను కంప్యూటరీకరణ చేసి కార్డు సిస్టమ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. తర్వాత రోజుల్లో స్టాంపుల కుంభకోణం చోటుచేసుకోవడంతో రిజిస్ర్టేషన్‌ ఫీజు, స్టాంప్‌ డ్యూటీని నేరుగా బ్యాంక్‌లో చలానా రూపేణా చెల్లించే పద్ధతిని అమలులోకి తీసుకొచ్చారు. దీంతో స్టాంపులపై దస్తావేజుల తయారీ పద్ధతికి స్వస్తి పలికారు. ఇటీవల కాలంలో మరిన్ని మార్పులు వచ్చాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలను అనుసంధానం చేయడంతో ఎనీవేర్‌ రిజిస్ర్టేషన్‌ విధానం అమలులోకి వచ్చింది. దీనివల్ల రాష్ట్రంలోని ఎక్కడి ఆస్తినైనా ఎక్కడ నుంచైనా రిజిస్ర్టేషన్‌ చేసుకునే వీలు కలిగింది. స్తిరాస్తులు కొనుగోలు చేసుకునే వారు నేరుగా తాము కొనుగోలు చేసుకునే ప్రాంతానికి వెళ్లి రిజిస్ర్టేషన్‌ చేసుకోకుండా తాము నివాసం ఉంటున్న రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వెళ్లి రిజిస్ర్టేషన్‌ చేసుకుంటున్నారు. ఈపద్ధతి ద్వారా మంచి ఫలితాలు రావడంతో రాష్ట్రప్రభుత్వం ఆస్తుల రిజిస్ర్టేషన్‌ కోసం నిరీక్షణ లేకుండా ముందుగా స్లాట్‌లను బుక్‌ చేసుకుని, సూచించిన సమయానికి వెళ్లి రిజిస్ర్టేషన్‌ చేసుకునే సౌకర్యం కల్పించింది.

అంతా ఆన్‌లైన్‌లోనే...

ఆస్తి కొనుగోలుదారులు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వెళ్లకుండా కంప్యూటర్‌లో పబ్లిక్‌ డేటా ఎంట్రీ ద్వారా మొత్తం దస్తావేజును నమోదు చేసుకుని, స్టాంపుడ్యూటీ, రిజిస్ర్టేషన్‌ ఫీజులను ఆన్‌లైన్‌లోనే చెల్లించుకోవచ్చు. స్లాట్‌ బుక్‌ చేసుకుని ఇచ్చిన సమయానికి వెళ్లి మాన్యువల్‌గా తయారు చేసిన దస్తావేజును సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి అందజేసి వాటిలో వేలిముద్రలు, సంతకాలు చేస్తే చాలు.

- గతంలో రిజస్టర్డ్‌ దస్తావేజును స్కానింగ్‌ చేసి ఇవ్వడానికి రోజుల వ్యవధి పట్టేది. ప్రస్తుత పద్ధతిలో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న గంటల వ్యవధిలోనే దస్తావేజు చేతికి వస్తోంది. దస్తావేజు రిజస్టర్‌ అయి స్కానింగ్‌ అయిన వెంటనే కొనుగోలుదారు సెల్‌ నంబర్‌కు మెసేజ్‌ వస్తుంది. దస్తావేజుసిద్ధంగా ఉంది తీసుకోవాలని మెసేజ్‌ రావడంతో కార్యాలయానికి వెళ్లి తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో రిజస్టర్‌ అయిన దస్తావేజు పోస్టులో నేరుగా ఇంటికే రానుంది.

వెంటవెంటనే మ్యుటేషన్‌

వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌ విషయంలో మ్యుటేషన్లు వెంటవెంటనే జరగడం కూడా శుభపరిణామంగా చెప్పవచ్చు. గతంలో వ్యవసాయ భూములను రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే ఆ దస్తావేజును రెవెన్యూశాఖ కార్యాలయానికి తీసుకెళ్లి మ్యూటేషన్‌ కోసం కాళ్లు అరిగేలా తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం అలా కాకుండా వ్యవసాయ భూమి రిజస్ర్టేషన్‌ చేసుకున్న గంటల వ్యవధిలోనే మ్యూటేషన్‌ జరిగి 1-బీ కాపీ కూడా కొనుగోలుదారుని చేతికి వస్తోంది.

సిబ్బంది కొరత, సర్వర్‌ సమస్యలు యథాతథం

రాష్ట్రప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలతో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ బాగున్నప్పటికీ కార్యాలయాల్లో సిబ్బంది సమస్య, సర్వర్‌ మొరాయింపు యథాతథంగా కొనసాగుతోంది. అదనపు సిబ్బందిని నియమిస్తేనే సేవలు ప్రభుత్వ ఆశయం మేరకు అందజేయగలమని సిబ్బంది చెబుతున్నారు. సర్వర్‌ ఆగిపోతుండడం వల్ల చలానాలు చెల్లించే సమయంలో ఇబ్బందులు వస్తున్నాయని, చలానాలు సక్రమంగా పేమెంట్‌ అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

--------------

Updated Date - Jun 16 , 2026 | 11:47 PM