Share News

Reduced Burden తగ్గిన మోత భారం

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:52 PM

Reduced Burden of Mota Charges విద్యార్థులకు మోత భారం తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ మేరకు పాఠ్యపుస్తకాల సంఖ్యతో పాటు వాటి బరువు కూడా తగ్గించింది.

Reduced Burden  తగ్గిన మోత భారం
పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు

  • రెండు, మూడు సబ్జెక్టులకు ఒకటే పాఠ్యపుస్తకం

  • విద్యార్థులకు ఉపశమనం

పాలకొండ, జూన్‌17(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మోత భారం తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ మేరకు పాఠ్యపుస్తకాల సంఖ్యతో పాటు వాటి బరువు కూడా తగ్గించింది. గతంలో ప్రతి సబ్జెక్టుకు రెండు పాఠ్యపుస్తకాలు, వాటికి నోట్‌ పుస్తకాలు, కాపీ రైటింగ్‌ పుస్తకాలు ఉండేవి. దీంతో బ్యాగ్‌లను మోయలేక విద్యార్థులు అపసోపాలు పడేవారు. అయితే ఆ కష్టాలకు కూటమి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. తక్కువ పుస్తకాలతో మెరుగైన విద్యను అందించే విధంగా అడుగులు వేసింది. దీనితో విద్యార్థులకు పుస్తకాల భారం సగానికి సగం తగ్గినట్టయింది.

గత ఏడాది వరకు ఒకటో తరగతి విద్యార్థికి తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, టెస్ట్‌బుక్‌, వర్క్‌బుక్‌లు కలిపి 12 పుస్తకాలు ఉండేవి. అయితే ఇప్పుడు కేవలం రెండు సెమిస్ర్టీలకు కలిపి నాలుగు పుస్తకాలకే పరిమితం చేశారు. నాలుగో తరగతి విద్యార్థికి తెలుగు, ఇంగ్లీష్‌, గణితం, ఈవీఎస్‌లు కలిపి రెండు సెమిస్ర్టీలలో 16 పుస్తకాలు ఉండేవి. వాటిని రెండు సెమిస్ర్టీలకు కలిపి 8 పుస్తకాలకే పరిమితం చేశారు. ఒకటో తరగతిలో తెలుగు, ఇంగ్లిష్‌, గణతం మూడు సబ్జెక్టులను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. ఆరో తరగతికి సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ సబ్జెక్టుల పాఠ్యాంశాలను సైతం ఒక పుస్తకంగా రూపొందించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో ఒక వైపు తెలుగు, మరో వైపు ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో పాఠాలు చేర్పించారు. ఎన్‌సీఈఆర్‌టీ ఆదేశాల మేరకు ఒకటి నుంచి 8వ తరగతుల వరకు ఈ ఏడాది కొత్త పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు పాఠాలు సులభతరంగా అర్థమయ్యేలా బొమ్మల రూపంలో పాఠాలు ఉన్నాయి. 9, 10 తరగతుల పుస్తకాల్లో విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో సులువుగా అర్థమయ్యేలా సుమారు 20 శాతం మార్పులు చేశారు. మొత్తంగా విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థులకు పుస్తకాల మోత బరువు తగ్గిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:52 PM