Reduce urea..! యూరియా.. తగ్గించండయ్యా..!
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:26 AM
Reduce urea..! వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాలు బట్టి జిల్లాలో పంటల సాగులో మోతాదుకు మించి నత్రజని అందిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఎరువుల కంటే అతి తక్కువ ధరకు యూరియా దొరుకుతుండడంతో పంటలకు అత్యధికంగా వాడేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు ఈ ఎరువు అందిన వెంటనే పైరు పచ్చగా మారడం కూడా మరో కారణం. జిల్లాలో చిన్న చిన్న కమతాలు ఎక్కువ.
యూరియా.. తగ్గించండయ్యా..!
జిల్లాలో పెరుగుతున్న వాడకం
మట్టి, భూగర్భ జలాల్లో నైట్రేట్ పెరిగే ప్రమాదం
ఆందోళన వ్యక్తంచేస్తున్న వ్యవసాయ శాస్త్ర వేత్తలు
వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ ముప్పునకు దారి
వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్న వివరాలు బట్టి జిల్లాలో పంటల సాగులో మోతాదుకు మించి నత్రజని అందిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఎరువుల కంటే అతి తక్కువ ధరకు యూరియా దొరుకుతుండడంతో పంటలకు అత్యధికంగా వాడేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు ఈ ఎరువు అందిన వెంటనే పైరు పచ్చగా మారడం కూడా మరో కారణం. జిల్లాలో చిన్న చిన్న కమతాలు ఎక్కువ. రెండు, మూడు ఎకరాలలోపు వున్న రైతులు అత్యధికం. దీంతో పొటాష్, కాంప్లెక్స్ వంటి ఎరువులను కొనుగోలు చేసి వాడలేని పరిస్థితిలో యూరియా ఎరువును విరివిగా భూమిలో కలిపేస్తున్నారు. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు మాత్రం యూరియా వాడకాన్ని తగ్గించాలని కోరుతున్నారు.
-----------------------
జిల్లాలో వరి సాగు అత్యధికంగా ఉంది కానీ దిగుబడుల కోసం యూరియాను పోటాపోటీగా జల్లుతున్నారు. భూమిని కెమికల్‌గా మార్చేస్తున్నారు. దీనివల్ల నిశ్శబ్ధంగా క్యాన్సర్ వ్యాపిస్తుంది. వ్యవసాయాధారిత రాష్ట్రాలుగా ఉన్న పంజాబ్, హర్యానాలో దిగుబడుల కోసం యూరియాను అధికంగా వాడడంతో ఆ రాష్ట్రాల్లో 30శాతం క్యాన్సర్ పేషెంట్‌లు ఉన్నారు. ఢిల్లీ ఆసుపత్రులకు వెళ్లేందుకు ఓ ట్రైన్‌లో వీరే ఎక్కువ కనిపిస్తుంటారు. ఈ విషయాన్ని గమనించాలి. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి.
- గత ఏడాది నవంబరు 20న వేపాడలో జరిగిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి అన్న మాటలివి.
శృంగవరపుకోట, మార్చి 28 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 1,16,993 హెక్టార్ల సాగు భూమి ఉంది. ఖరీఫ్‌లో 97,000 హెక్టార్లు, రబీలో 57,661 హెక్టార్లలో సాగు జరుగుతోంది. ఖరీఫ్ సీజన్‌లో అత్యధికంగా వరిపంట, రబీ సీజన్‌లో అధికంగా మొక్కజొన్న వేస్తున్నారు. అయితే వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన దానికంటే ఎక్కువగా యూరియాను వాడుతున్నారు. వరి పంటకు ఎకరాకు 130 నుంచి 135 కిలోలు, మొక్కజొన్నకు ఎకరాకు 175 నుంచి 180 కిలోల యూరియా అందించాలని చెబుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయితే రైతులు మాత్రం వరికి ఎకరాకు 200 నుంచి 250 కిలోలు, మొక్కజొన్న పంటకు ఎకరాకు మరింత ఎక్కువగా 350 నుంచి 400 కిలోల వరకు వినియోగిస్తున్నారు. దీనివల్ల కాలక్రమంలో మట్టి, భూగర్భజలాల్లో నైట్రేట్ (నత్రజని) శాతం పెరిగి దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము యూరియా సరఫరాను తగ్గించి ఇస్తున్నప్పటికీ పక్క జిల్లాల నుంచి తెచ్చుకొని వాడేస్తున్నారని వ్యవసాయ శాఖ అంటోంది. రైతులు అడిగిన వెంటనే యూరియాను ఇవ్వకపోతే వ్యవసాయ కార్యాలయాలతో పాటు ఎరువుల డీలర్‌ల కార్యాలయాల వద్ద రసాభాస చేసేస్తున్నారని, వీరికి స్థానిక రాజకీయ నాయకులు తోడువడంతో రైతులకు నచ్చచెప్పలేకపోతున్నామని వాపోతోంది. అయితే ఇప్పటికే భూమిలో మోతాదుకు మించి యూరియా కలవడంతో భూగర్భ జలాల్లో నత్రజని శాతం ఎక్కువగా వున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాల వారీగా వ్యవసాయ అధికారులకు నివేదికలు అందినట్లు సమాచారం. దీనిని వ్యవసాయ శాఖ బయటపెట్టడం లేదు. పంటలకు యూరియా వాడకం తగ్గించేలా చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గత ఏడాది నవంబర్‌లో జరిగిన కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన టాప్-5 వ్యాధుల్లో ఒకటిగా ఉందని గుర్తుచేశారు. యూరియా అధిక వాడకంపై ప్రభుత్వం రైతుల్లో విస్తృత చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు.
నత్రజని ఎక్కువైతే..
- వరి మొక్కలు చాలా పొడవుగా పెరిగి బలహీనంగా మారుతాయి. నేలకొరుగుతుంది. పురుగులు, వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. దిగుబడిలో నాణ్యత తగ్గుతుంది.
- మొక్కజొన్న మొక్కలు గాలికి ఎక్కువగా పడిపోతుంటాయి. పుష్పధారణ ఆలస్యమవుతుంది.
- గింజలు సరిగా రావు. ఎరువుల ఖర్చు పెరుగుతుంది.
- నెలలో ఉప్పుతనం పెరుగుతుంది. పోషణ సమతుల్యత దెబ్బతింటుంది. జీవాణు కార్యకలాపాలు తగ్గుతాయి. దీర్ఘకాలంలో నేల సారవంతం తగ్గుతుంది.
- మొక్కజొన్నలో గింజ దిగుబడి తగ్గుతుంది.
- భూగర్భంలో నైట్రేట్ కలవడంతో అది తాగునీటి ద్వారా మానవ శరీరంలో కలుస్తుంది. కొన్ని రకాల ఎరువుల్లో కాడ్మియం వంటి భారీ లోహాలు నేలలో కలుస్తున్నాయి. దీంతో మూత్రపిండ వ్యాధులు, ఎముకుల బలహీనత, చర్మవ్యాధులు, పిల్లల్లో పెరుగుదల మందగించడం, క్యాన్సర్ వంటి రోగాలకు గురవుతారు.
- స్త్రీపురుషుల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. సంతోనోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది.
భూగర్భ జలాల్లో నైట్రేట్స్
జిల్లాల్లో సేకరించిన 20శాతం నీటి నమూనాల్లో నైట్రేట్‌లు ఉండాల్సిన వాటికంటే అధికంగా ఉన్నాయని ఓ సర్వే తెలిపింది. ఇలా సేకరించిన నమూనాల్లో రాష్ట్రంలో పల్నాడు జిల్లా కూడా ఉంది. 2023మేలో దేశ వ్యాప్తంగా 15,529 నమూనాలను సేకరించగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్యురో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ నిర్దేశించిన లీటరు నీటిలో 45 మిల్లీగ్రాములు నత్రజని పరిమితి కంటే ఎక్కువ ఉన్నట్లు గుర్తించాయి. 25శాతం బావులను అధ్యయనం చేయగా 4,982 ప్రాంతాల్లోని భూగర్భజలాల నీటి నమూనాలు వర్షాకాలానికి ముందు, తరువాత కూడా పరిశీలించింది. ఆ మేరకు 20శాతం నీటి నమూనాల్లో పరిమితికి మించి నైట్రేట్ వున్నట్లు తెలిపింది. నీటిలో నైట్రేట్ స్థాయిలు అధికంగా వుంటే తాగేందుకు సురక్షితం కాదని, శిశువుల్లో బ్లూబేబి సిండ్రోమ్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది.
సమపాలలో ఉంటేనే ప్రయోజనం
మట్టి పరిక్షలు చేయాలి. దీని ప్రకారం ఎరువులు వేయాలి. వరి పంట నాటేటప్పుడు 35శాతం, 25 రోజులకు 35శాతం, 45రోజులకు 35శాతం విడతల వారీగా అందించాలి. ఎరువు వేసిన తరువాత తక్కువ నీరు ఉంచాలి. ఆర్గానిక్ ఎరువులు పశువుల ఎరువుల వర్మీకంపోస్ట్, గ్రీన్‌మాన్యూర్ వాడితే నత్రజని వినియోగం మెరుగుపడుతుంది. నానో యూరియా వాడితే యూరియా వినియోగం తగ్గుతుంది. సరైన నత్రజని వినియోగంతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు. ఎరువుల ఖర్చు తగ్గుతుంది. నేల ఆరోగ్యం మెరుగ్గావుంటుంది.
డాక్టర్ ఎంఎంవీ శ్రీనివాసరావు, ప్రధాన శాస్త్రవేత్త, శాస్త్రపోషణ్, ఎరువాక కేంద్రం, విజయనగరం
ఎక్కువగా నత్రజని వాడేస్తున్నారు
ఖరీఫ్‌లో ఎకరా వరి పంటకు 32 కేజీల నత్రజనికి 70కేజీల యూరియా, రబీలో 48 కేజీల నత్రజనికి 110 కేజీల యూరియాను అందిస్తే సరిపోతుంది. ఇదే విధంగా ఖరీఫ్‌లో మెక్కజొన్నకు 80కేజీల నత్రజని కోసం 170కేజీల యూరియా, రబీలో 100 కేజీల నత్రజని కోసం 220కేజీల యూరియా, రబీలో పెసర, మినుమ పంటకు 8కేజీల నత్రజని కోసం 20కేజీల యూరియా ఎకరా పొలంలో వేస్తే సరిపోతుంది. జిల్లాలో రైతాంగం సిఫార్స్ చేసిన యూరియాను మరింత ఎక్కువగా వాడేస్తున్నారు.
- లక్ష్మణ్, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎరువాక కేంద్రం, విజయనగరం
యూరియా తగ్గించేందుకు చర్యలు
యూరియా వాడకం తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఖరీఫ్, రబీ పంటలకు రైతుల భూ విస్తీర్ణం బట్టి యూరియాను లెక్కకడతాం. ఈ వివరాలను రైతు సేవా కేంద్రాల ద్వారా సేకరిస్తున్నాం. రైతుకు వున్న భూమికి నిబంధనల ప్రకారం ఎంత యూరియా సరిపోతుందో కట్టే లెక్కకు సాంకేతికత ఉపయోగిస్తున్నాం. అలాగే యూరియా సరఫరా తగ్గించి నత్రజని వాడకం తగ్గేలా చేస్తున్నాం. ఇందుకు ముందుగా రైతులకు అవగాహన కల్పిస్తాం.
- వీటీ రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి, విజయనగరం
శిశువులకూ ప్రమాదం
శిశువులు బ్లూబేబి సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఉంది. పెదాలు, నాలుక, చేతులు, కాళ్లు నీలంగా మారతాయి. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడతారు. బలహీనత, అలసట, స్పృహకోల్పోవడం తదితర లక్షణాలు వుంటాయి. పిల్లల జీర్ణవ్యవస్థలో నైట్రేట్‌లుగా మారుతాయి. ఇవి రక్తంలో ఆక్షిజన్‌ను మోసుకువెళ్లే సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి.
- డాక్టర్ ఎస్‌వీ సత్యశేఖర్ (ఎంఎస్ సర్జన్), సివిల్ సర్జన్, స్పెషలిస్టు
-----------------------