Share News

Recognition through service సేవతోనే గుర్తింపు

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:56 PM

Recognition through service గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ/ యూపీహెచ్‌సీ) పనితీరు మదింపునకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ కేవలం ఐదు పరిమిత అంశాల ఆధారంగా ఆరోగ్య కేంద్రాల సేవలకు గ్రేడింగ్‌ ఇస్తుండగా ఇకపై 21 కీలక సూచికల ప్రాతిపదికన ర్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయనుంది.

Recognition through service సేవతోనే గుర్తింపు

సేవతోనే గుర్తింపు

పీహెచ్‌సీలకు ర్యాంకులు ప్రకటించనున్న ప్రభుత్వం

21 అంశాల ఆధారంగా మార్కులు

మాతృత్వ మరణాలు, అనవసర సిజేరియన్లు తగ్గిస్తే మెరుగైన స్కోరు

ప్రజాభిప్రాయాలు, ఆసుపత్రి పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం

గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ/ యూపీహెచ్‌సీ) పనితీరు మదింపునకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ కేవలం ఐదు పరిమిత అంశాల ఆధారంగా ఆరోగ్య కేంద్రాల సేవలకు గ్రేడింగ్‌ ఇస్తుండగా ఇకపై 21 కీలక సూచికల ప్రాతిపదికన ర్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయనుంది. పీహెచ్‌సీల పనితీరును నాలుగు గ్రేడులుగా విభజించి ప్రతినెలా ర్యాంకులను ప్రకటించనుంది. గ్రామస్థాయిలో వైద్య వ్యవస్థను మరింత జవాబుదారీగా మార్చడంతో పాటు వెనుకబడిన కేంద్రాలను గుర్తించి అక్కడ లోపాలు సరిదిద్దేందుకే ఈనూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

విజయనగరం రింగురోడ్డు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో 48 పీహెచ్‌సీలు, యూపీఎహెచ్‌సీలువున్నాయి. ఇప్పటిదాకా ఆసుపత్రుల్లో ఎంత మందికి ఓపీ సేవలు అందించారు? ఎన్ని పరీక్షలు చేశారు?ఎన్ని ప్రసవాలు నిర్వహించారనే సంఖ్య ఽఆధారంగా మాత్రమే గ్రేడింగ్‌ ఇచ్చేవారు. ఈ పాత విధానం వల్ల వ్యాధుల నివారణలో సాధించిన పురోగతి, మాతా శిశు ఆరోగ్య ఫలితాలు, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ వంటి అసలైన ఆరోగ్య అంశాలు ప్రతిబింబించడం లేదని పునఃసమీక్షలో ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో వైద్య సేవలు మరింత మెరుగుపడాలంటే 21 ప్రమాణాలు ఆధారంగా ర్యాంకింగ్‌ ఇవ్వాలని తీర్మానించారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మాతృత్వ మరణాలు, సీజేరియన్లు తగ్గితేనే మెరుగైన ర్యాంకు సాధించడం సాధ్యపడుతుంది. టీనేజ్‌ గర్భదారణలు, హై రిస్క్‌ గర్భిణుల నమోదు, ప్రసవ సమయంలో అందించే వైద్యసేవలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల శాతం, సంతానోత్పత్తి రేటు తదితర అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోనున్నారు. సేవలు బాగున్న కేంద్రాలకే మెరుగైన స్కోరు లభిస్తుంది. అంతే కాకుండా రోగులకు ఉన్నతస్థాయి ఆసుపత్రికి రిఫర్‌ చేసి పీహెచ్‌సీ వైద్యులు చేతులు దులుపు కోకుండా, వాస్తవంగా చికిత్స అందిందా?లేదా అన్న అంశాన్ని అఖరి దశ వరకూ పర్యవేక్షించే వారికి గుర్తింపు లభిస్తుంది.

ప్రజల ఫీడ్‌బ్యాక్‌కు మార్కులు

ఈ నూతన ర్యాంకింగ్‌ విధానంలో పీహెచ్‌సీల్లో వైద్య సేవలు పొందిన ప్రజలు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా తెలియజేసే అభిప్రాయాన్ని కూడా కీలక అంశంగా చేర్చారు. వైద్యులు, సిబ్బంది ప్రవర్తన, ఆసుపత్రి ప్రాంగణ పరిశుభ్రత, వైద్యుల కోసం వేచి వుండే సమయం, ఉచిత మందులు లభ్యత, రోగులకు ఇచ్చే గౌరవం వంటి అంశాలు ర్యాంకింగ్‌ నిర్ణయించడంలో ముఖ్య భూమిక పోషించనున్నాయి. వీటితో పాటు ప్రజల్లో బీపీ, మధుమేహం, సాధారణ క్యాన్సర్‌ పరీక్షలు ఎంత వరకూ పూర్తిచేశారు? వ్యాధి నిర్ధారణ అయిన వారికి క్రమం తప్పకుండా మందులు అందుతున్నాయా? లేదా అన్న వివరాలను క్షేత్రస్థాయిలో మదింపు చేసి నెలవారీ ర్యాంకులను ఖరారు చేస్తారు.

నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం

డాక్టరు జీవనరాణి, డీఎంహెచ్‌వో, విజయనగరం

ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నూతన ర్యాంకింగ్‌ విధానాన్ని తీసుకువచ్చింది. కేవలం సేవలు పొందిన రోగుల సంఖ్యకే పరిమితం కాకుండా, మాతా శిశు సంరక్షణ, సాఽధారణ ప్రసవాలు, ఉచిత మందుల సరఫరా, ఆసుపత్రి పరిశుభ్రత, రోగుల అభిప్రాయాలు ఆధారంగా పీహెచ్‌సీల పనితీరును అంచనా వేస్తాం. ప్రతినెల ఇచ్చే ఈ ర్యాంకింగ్స్‌ ద్వారా వెనుకబడిన ఆరోగ్య కేంద్రాలను గుర్తించి, అక్కడి లోపాలను సరిదిద్ది సిబ్బందిని జవాబుదారీ చేస్తాం.

---------------------

Updated Date - Aug 04 , 2026 | 11:56 PM