సేవ చేసే వారికే గుర్తింపు
ABN , Publish Date - May 23 , 2026 | 11:12 PM
‘చాలా మంది దగ్గర డబ్బు ఉన్నా సేవా గుణం ఉండదు. సేవ చేసే వారికే సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి.’ అని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
- చాలామందికి డబ్బు ఉన్నా సేవా గుణం ఉండదు
- హర్యానామాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
- గురుదేవ చారిటబుల్ ట్రస్టు సందర్శన
కొత్తవలస, మే 23 (ఆంధ్రజ్యోతి): ‘చాలా మంది దగ్గర డబ్బు ఉన్నా సేవా గుణం ఉండదు. సేవ చేసే వారికే సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి.’ అని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం రాత్రి మండలంలోని మంగళపాలెంలో ఉన్న గురుదేవ చారిటబుల్ ట్రస్టును బీజేపీ నాయకులతో కలసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. మంగళపాలెం లాంటి గ్రామంలో దేశం గర్వపడే సేవలను అందిస్తున్న ట్రస్టు ఉండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇంతటి చిన్నగ్రామంలో ట్రస్టు ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ట్రస్టు చైర్మన్ జగదీష్‌బాబు మంచి పేరు తెచ్చుకుంటున్నారన్నారు. త్వరలోనే ఆయనకు గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ కార్యక్రమం చేపట్టారని, అందులో గురుదేవ ట్రస్టు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించేందుకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు, క్యాన్సర్ రోగులకు వైద్యం చేయడానికి దేవుడు గురుదేవ ట్రస్టు రూపంలో వచ్చాడన్నారు. ఈ ట్రస్టు ద్వారా భవిష్యత్తులో ఎన్నో సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. తొలుత దివ్యాంగులకు అందిస్తున్న కృత్రిమ అవయవాల కేంద్రాన్ని, గురుదేవ ఆసుపత్రిని, ఉప్పలపాటి విజయశ్రీ క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించి సేవలను పరిశీలించారు. అంతకు ముందు కర్ణాటక బీజేపీ నాయకుడు, సినీనటుడు సాయికుమార్ సోదరుడు పి.అయ్యప్పశర్మ.. బండారు దత్తాత్రేయను కలసి వెళ్లారు. ఈ సందర్భంగా అయ్యప్ప శర్మనుట్రస్టు కార్యాలయంలో సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ జగదీష్ బాబుతో పాటు బీజేపీ నాయకులు రామ కోటయ్య, మల్లా రెడ్డి, సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు మెంబర్ కరక దేముడు తదితరులు పాల్గొన్నారు.