Share News

ready to airport inaguration వాయువేగంతో సన్నద్ధం

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:59 AM

ready to airport inaguration భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వాయువేగంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉంటున్నారు. ప్రతిరోజు మంత్రులు పర్యటిస్తూ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ పర్యటన షెడ్యూల్‌ కూడా ఖరారైంది. దాదాపు ఏడు వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ready to  airport  inaguration వాయువేగంతో సన్నద్ధం
సిద్ధమవుతున్న ప్రధాని బహిరంగ సభా వేదిక

వాయువేగంతో సన్నద్ధం

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు

ప్రధాని పర్యటన ఖరారు

అధికార యంత్రాంగం అంతా అక్కడే

ప్రతిరోజు మంత్రుల పర్యటనలు.. సమీక్షలు

ఏడు వేల మంది పోలీసుతో భారీ బందోబస్తు

ఐదు లక్షల మందితో జన సమీకరణకు ఏర్పాట్లు

విజయనగరం కలెక్టరేట్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి):

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వాయువేగంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉంటున్నారు. ప్రతిరోజు మంత్రులు పర్యటిస్తూ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ పర్యటన షెడ్యూల్‌ కూడా ఖరారైంది. దాదాపు ఏడు వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటనలో ఎటువంటి లోపాలకు తావులేకుండా ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అన్నిశాఖలతో నిరంతరం సమన్వయం ఉండేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. కలెక్టరు రామసుందర్‌ రెడ్డి, జేసీ సేతుమాధవన్‌ లు నిరంతరం జిల్లా యంత్రాంగాన్ని సంసిద్ధం చేస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలన్న లక్ష్యంతో అంతా ముందుకెళ్తున్నారు. రూ.4592 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధానికి వేల మంది బాలికలతో థింసా నృత్య ప్రదర్శనతో స్వాగతం పలకనున్నారు.

ఫ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 6 వేల మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 5వేల మంది, పోలవరం ప్రాంతం నుంచి 2 వేల మంది బాలికలు పాల్గొంటారు. ఉత్తరాంధ్రలోని 43 నియోజకవర్గాల నుంచి 5వేల బస్సులతో ఐదు లక్షల మందితో జన సమీకరణ చేపడుతున్నారు. ప్రతి మండలానికీ 40 బస్సులు చొప్పున కేటాయిస్తున్నారు. జన సమీకరణను ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు. అదే రోజు ఉదయం 8 గంటలకే ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందరికీ టిఫిన్‌, మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా 18 మంది ఎస్పీలు, 17 మంది అడిషనల్‌ డీఎస్పీలు, 51 మంది డీఎస్‌పిలు, 134 మంది సీఐలు, 20 మంది ఆర్‌ఎస్‌ఐలు, 268 ఎస్‌ఐలు, 110 మంది ఆర్‌ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ,ఏఆర్‌ఎస్‌ఐలు, హెచ్‌సిలు 518 కలిపి మొత్తం 7 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు.

ఖచ్చితమైన ప్రణాళికలతో ఏర్పాట్లు

మంత్రులు అనిత, శ్రీనివాస్‌, బీసీ జనార్థనరెడ్డి, సంధ్యారాణి

భోగాపురం, జూలై26(ఆంధ్రజ్యోతి): భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభకు ఖచ్చితమైన ప్రణాళికలతో ఏర్పాట్లు చేయాలని, పొరపాట్లకు తావులేకుండా చూడాలని మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్థనరెడ్డి, కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. ఎయిర్‌పోర్టులో జీఎంఆర్‌ అడ్మిన్‌ బ్లాక్‌లో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు తదితరులతో చర్చించారు. ఆగస్టు 1న జరిగే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి అందరూ శక్తి వంచనలేకుండా కృషి చేయాలన్నారు. స్వాగత ఏర్పాట్లు, కార్యాచరణ, భద్రతా చర్యలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాహనాల రద్దీ, మళ్లింపు, భోజన వసతులు, వీవీఐపీ, వీఐపీ పాసుల జారీతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలనుంచి భారీ జన సమీకరణపై చర్చించారు. బాలికల థింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకాలన్నారు. ఉదయం 8గంటలకే ప్రజలు వేదికకు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ మాట్లాడుతూ భద్రత, ట్రాఫిక్‌, పార్కింగ్‌ తదితర అంశాలపై పోలీస్‌ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

ప్రధాని సభను విజయవంతం చేయాలి

వచ్చేనెల 1న చేపట్టే ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం, మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు. పోలిపల్లి గ్రామ సమీప ప్రైవేటు లేఅవుట్‌లో నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో నాయకులు, పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. మోదీ సభను విజయవంతం చేసేలా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొంటూ విస్తృత స్థాయిలో జన సమీకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరిశింహారెడ్డి, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, పార్టీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌, నాయకులు చిన్నంనాయుడు, పతివాడ అప్పలనారాయణ, ఆకిరి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

మోదీ సభకు తరలిరావాలి: మంత్రి శ్రీనివాస్‌

గజపతినగరం, జూలై25(ఆంధ్రజ్యోతి): ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సభకు తరలిరావాలని మంత్రి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నియోజవర్గం నుంచి 50 వేల మందికి తగ్గకుండా ప్రజలు తరలివచ్చేలా నాయకులు, కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, నియోజకవర్గ అబ్జర్వర్‌ వి.బాబ్జి, బొగ్గు అర్చన తదితరులు పాల్గొన్నారు.

సైనేజెస్‌ ఏర్పాటు చేయాలి: ఎస్పీ దామోదర్‌

భోగాపురం, జూలై26(ఆంధ్రజ్యోతి): ప్రధాని పర్యటనలో వాహనదారులు పొరబడకుండా అక్కడికక్కడ పెద్దవిగా కనిపించేలా సైనేజెస్‌ ఏర్పాటు చేయాలని పోలీస్‌ సిబ్బందికి ఎస్పీ ఎఆర్‌ దామోదర్‌ ఆదేశించారు. ఆగస్టు 1న మోదీ బహిరంగ సమావేశం సందర్భంగా ఆదివారం ట్రంపెట్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు రహదారిని పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనెందుకు బస్సుల్లో వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వాహనదారులు పొరబడకుండా అక్కడికక్కడ పెద్దగా కనిపించే విధంగా సైనేజెస్‌ ఏర్పాటు చేయాలన్నారు. భోగాపురం ఎయిర్‌ పోర్టుకు వెళ్లే అన్ని మార్గాల్లో తాత్కాలిక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎయిర్‌పోర్టు పరిసర గ్రామాల్లో పెరిఫెరల్‌ కూంబింగ్‌, పుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించాలని పోలీసు అధికారులకు ఆదే శించారు.

ప్రధాని పర్యటన షెడ్యూల్‌ ఖరారు

భోగాపురం, జూలై26(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అగస్టు 1న విజయనగరం జిల్లా భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగనుంది. ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ ఖరారు అయింది. శనివారం ఉదయం 10.45 నుంచి మఽధ్యాహ్నం 1.05వరకు సుమారు 2.25 గంటల పాటు భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నారు. ఆ రోజు ఉదయం 10.45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకొంటారు. 10.45 నుంచి 10.50 మధ్యలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. 10.50 నుంచి 10.55 సమయంలో కారులో భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనానికి ప్రధాని చేరుకొంటారు. 10.55 నుంచి 10.58 సమయంలో 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతారు. 11.00 గంటల నుంచి భోగాపురం విమానాశ్రయాన్ని పీఎం పరిశీలిస్తారు. 11.17 నుంచి 11.25 మధ్యలో భోగాపురం ఎయిర్‌ పోర్టు టెర్మినల్‌ భవనం నుంచి ఓపెన్‌ టాప్‌ జీపులో బహిరంగ సభావేదికకు చేరుకొంటారు. 11.30నుంచి 12.55 వరకు భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం, శిలా ఫలకం ఆవిష్కరణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.05 తరువాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు.

Updated Date - Jul 27 , 2026 | 12:59 AM