Ready for the pura Battle పుర పోరుకు సన్నద్ధం
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:54 PM
Ready for the pura Battle పుర పోరుకు రాజకీయ నేతలు సిద్ధమవుతున్నారు. మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. అధిష్ఠానం ఆశీస్సుల కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపైనే కూటమి పార్టీల ఆశలు
పార్వతీపురం, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): పుర పోరుకు రాజకీయ నేతలు సిద్ధమవుతున్నారు. మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. అధిష్ఠానం ఆశీస్సుల కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై కూటమి పార్టీ నేతలు ఆశలు పెట్టుకోగా.. ఈ ఎన్నికలపై వైసీపీ నాయకులు కూడా దృష్టి కేంద్రీకరించారు. ఎలాగైనా ఈ పోరులో గెలవాలని పావులు కదుపుతున్నారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. కాగా ఇటీవల పాలకొండ, పార్వతీపురంలో సంఘాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అభివృద్ధి పనులకు పెద్దపీట వేయాలని ఆయన ఆదేశించడంతో పాటు పరోక్షంగా ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. దీంతో కూటమి పార్టీలకు చెందిన ఆశావహులు పుర బరికి సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంతో పాటు సాలూరు పురపాలక సంఘంలో కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఆ రెండు చోట్ల పలు నిర్మాణాలకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి , ఎమ్మెల్యే విజయచంద్ర శిలాఫలకాలు ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై కూడా దృష్టి సారిస్తున్నారు. ప్రతి వార్డులో విజయం సాధించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాల్లో నేతలకు పిలుపునిస్తున్నారు. ఇక పాలకొండ నగర పంచాయతీలోని టీడీపీలో ఉన్న వర్గాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తంగా రెండు పురపాలక సంఘాలతో పాటు పాలకొండలో విజయమే లక్ష్యంగా కూటమి పార్టీలు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాయి.