Share News

Local’ elections ‘స్థానిక’ సమారానికి సై

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:09 AM

Ready for the ‘Local’ elections స్థానిక పోరుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేసింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉండడంతో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో ‘స్థానిక’ సందడి ఊపందుకుంది. స్థానిక సమరానికి సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ఆశావహులు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

 Local’ elections ‘స్థానిక’ సమారానికి సై
సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పీ వెంకటేశ్వరరావు

  • పోరుకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీల నేతలు

  • ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం

  • త్వరలో రిజర్వేషన్లు ఖరారుపై ఆదేశాలు

పార్వతీపురం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): స్థానిక పోరుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేసింది. రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉండడంతో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల్లో ‘స్థానిక’ సందడి ఊపందుకుంది. స్థానిక సమరానికి సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ఆశావహులు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం తగు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితాను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల జాబితా విడుదలైన మరుక్షణమే ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు.

- బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్‌ కల్పించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్లారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దీనిపై కూటమి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలతో ఆరు వారాల్లోపు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. కాగా బీసీలకు 34 శాతానికి మించి స్థానిక ఎన్నికల్లో అవకాశాన్ని కల్పిస్తామని ఇప్పటికే టీడీపీ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో ఆశావహుల్లో ఆశలు చిగు రిస్తున్నాయి.

- నామినేషన్‌ స్వీకరణ, ఉపసంహరణ, ఎన్నికల తేదీల ఖరారుకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కోడ్‌ అమలులోకి రానుంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందుగా ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లపై ఆదే శాలు జారీ చేయాల్సి ఉంది. ముందుగా పుర ఎన్నికలు జరగనుండడంతో జిల్లాలో పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఈ మూడింటికి సంబంధించి చైర్మన్లు, వార్డులు, కౌన్సిలర్లు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారుకు సంబంధించిన ప్రక్రియ ముందుగా ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత మండల , జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. 15 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలతో ఎంపీపీలు, జడ్పీ చైర్మన్‌ పీఠానికి కూడా త్వరలోనే రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఇప్పటికే కులాల వారీగా ఓటర్ల వివరాలతో పాటు రిజర్వేషన్లకు సం బంధించిన పూర్తి సమాచారాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిన వెంటనే వాటిని ప్రకటించనున్నారు.

గతంలో ఇలా..

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1985లో మొట్టమొదటిసారిగా బీసీలకు స్థానిక ఎన్నికల్లో 20 శాతం రిజర్వేషన్‌ ఖరారు చేశారు. 1995లో ఈ రిజర్వేషన్‌ శాతాన్ని 34కు పెంచారు. ఇదే రిజర్వేషన్‌తో గత టీడీపీ ప్రభుత్వం, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికలు ఎన్నికలు నిర్వహించారు. 50 శాతానికి మించి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉండకూడదని కొంతమంది కోర్టుకు వెళ్లడంతో గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ స్థానిక ఎన్నికలు నిర్వహించింది. కానీ దీనిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లలేదు. తాజాగా కూటమి సర్కారు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై కొంతమంది వైసీపీ మద్దతుదారులు కోర్టుకు వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి...

- గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలు, పాలకొండ నగర పంచాయతీతో పాటు 15 మండలాల్లో ఎంపీపీ , జడ్పీటీసీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. అప్పట్లో ఎన్నికల బరిలో దిగాలనుకున్న ప్రతిపక్ష పార్టీ నేతలను గత వైసీపీ సర్కారు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొనేలా చేసింది. భయబ్రాంతులకు గురి చేసింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కూటమి పార్టీలకు చెందిన ఎంతోమంది నాయకులు స్థానిక పోరుకు ఆసక్తి చూపుతున్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలతో పాటు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన జడ్పీ పీఠం, సాలూరు, పార్వతీపురం , పాలకొండ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమ వుతున్నారు.

- జిల్లాకేంద్రం పార్వతీపురం పురపాలక సంఘంలో 50,384 మంది జనాభా ఉన్నారు. ఇందులో 40,765 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 30 వార్డులు ఉండేవి. పునర్విభజన తర్వాత వార్డుల సంఖ్య 36కు పెరిగింది.

- సాలూరు మున్సిపాల్టీలో 49,500 మంది జనాభా ఉండగా 41,934 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో ఇక్కడ 29 వార్డులు ఉండగా నేడు ఆ సంఖ్య 32కు చేరింది.

- పాలకొండ నగరపంచాయతీలో 31,466 మంది జనాభా ఉన్నారు. 23,466 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 11,453 మంది, మహిళలు 12012 మంది ఓటర్లు ఉండగా ఇతరులు ఒకరు ఉన్నారు. గతంలో 20 వార్డులు ఉండగా తాజాగా ఆ సంఖ్య 28కు చేరింది. మొత్తంగా మూడు ప్రాంతాల్లో వార్డుల సంఖ్య 79 నుంచి 96కు చేరింది. కాగా గెజిట్‌ ప్రకారం.. ప్రతి వెయ్యి మంది ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాలను ఖరారు చేస్తారు.

- జిల్లాలో 451 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 4128 వార్డులు ఉండగా సర్పంచ్‌లతో పాటు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు నిర్వహించేందుకు 4144 పోలింగ్‌ కేం ద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. జిల్లాలో 6,43,859 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,14,904 మంది పురుషులు, 3,28,889 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 66 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. వీరందరూ స్థానిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎన్నికల విధులకు సిద్ధం కావాలి: ఏఎస్పీ

బెలగాం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల విధులకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఏఎస్పీ వెంకటేశ్వరరావు సూచించారు.ఎన్నికల ముందస్తు చర్యలు, కార్యాచరణ ప్రణాళిక, విధి విధానాలపై శుక్రవారం తన కార్యాలయంలో ఎలక్షన్‌ సెల్‌ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. విధులపై సిబ్బంది పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్‌బీ సీఐ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 12:09 AM