Local Battle స్థానిక పోరుకు సన్నద్ధం
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:32 AM
Ready for the Local Battle మరికొన్ని నెలల్లో జరిగే స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీల నాయకులు సమాయత్తమవుతున్నారు. ఈసారి ఎలాగైనా బరిలో నిలవాలని ఉత్సాహపడుతున్నారు. ప్రధానంగా తెలుగు తమ్ముళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలు
పార్వతీపురం, మార్చి27(ఆంధ్రజ్యోతి): మరికొన్ని నెలల్లో జరిగే స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీల నాయకులు సమాయత్తమవుతున్నారు. ఈసారి ఎలాగైనా బరిలో నిలవాలని ఉత్సాహపడుతున్నారు. ప్రధానంగా తెలుగు తమ్ముళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొంతమంది పోటీకి దిగినా గత ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసింది. కాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఈ దఫా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. కౌన్సిలర్, ఎంపీటీసీ, జడ్పీటీసీతో పాటు సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఒక్కో పంచాయతీ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు వరకు తెలుగు తమ్ముళ్లు వ్యూహ రచన చేస్తున్నారు. జిల్లాలోని 15 మండలాలతో పాటు పార్వతీపుం, సాలూరు పురపాలక సంఘాలు, పాలకొండ నగర పంచాయతీలో రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయో తెలియక పోయినప్పటికీ ఇప్పటికే రహస్యంగా ప్రచారాలు సాగిస్తున్నారు. మరికొందరు అధిష్ఠానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. ఇంకొందరు కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
గ్రూప్‌లుగా విడిపోతూ..
జిల్లాలో పలు మండలాలకు చెందిన కొంతమంది తెలుగు తమ్ముళ్లు గ్రూపులుగా విడిపోతున్నారు. కురుపాం నియోజకవర్గంలో కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం నియోజకవర్గంలో బలిజిపేట, పార్వతీపురం టౌన్, పాలకొండ నియోజకవర్గంలో టీడీపీతో పాటు జనసేన పార్టీ నాయకుల మధ్య గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్నాం కదా తామెందుకు ఎందుకు పోటీ చేయకూడదనే ఆలోచనలో కొంతమంది నాయకులు ఉన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలు కూడా తమ వర్గాన్ని నిలబెట్టుకుంటూ స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. దీంతో పార్టీని నమ్ముకుని ఉన్న తెలుగు తమ్ముళ్లకు, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారి మధ్య వర్గ విభేదాలు కనిపిస్తున్నాయి. టీడీపీలోకి వచ్చిన వైసీపీ నాయకులతో ఇమడలేక కొంతమంది టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు తమ వర్గాలతో వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న ఈ పరిస్థితిపై అధిష్ఠానం దృష్టి సారించాల్సి ఉందని కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు కోరుతున్నారు.