Share News

Kharif Cultivation ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:24 AM

Ready for Kharif Cultivation జిల్లా రైతులు ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే విరివిగా వర్షాలు కురుస్తుండడంతో కొన్ని చోట్ల దుక్కులు పూర్తి చేసేశారు. మరికొద్దిరోజుల్లో వరి నారు వేయనున్నారు. మరికొందరు రైతులు ఎదలు జల్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం విత్తనాల పంపిణీ ప్రక్రియ శ్రీకారం చుట్టింది.

  Kharif Cultivation ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం

  • తొలివిడత విత్తనాల పంపిణీ ప్రారంభించిన అధికారులు

పార్వతీపురం, జూన్‌10(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులు ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే విరివిగా వర్షాలు కురుస్తుండడంతో కొన్ని చోట్ల దుక్కులు పూర్తి చేసేశారు. మరికొద్దిరోజుల్లో వరి నారు వేయనున్నారు. మరికొందరు రైతులు ఎదలు జల్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం విత్తనాల పంపిణీ ప్రక్రియ శ్రీకారం చుట్టింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు 22,098 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం కాగా ఇప్పటివరకు జిల్లాకు 12,873 క్వింటాళ్ల విత్తనాలు చేరుకున్నాయి. ఇందులో ఎంటీయూ 1064 రకం విత్తనాలు 7121 క్వింటాళ్లు, ఎంటీయూ 1121 రకం 1148 క్వింటాళ్లు, ఆర్‌జీఎల్‌ 2537 రకం 2017 క్వింటాళ్లు, బీపీటీ 5204 రకం 894 క్వింటాళ్లు, బీపీటీ 3291 రకం విత్తనాలు 338 క్వింటాళ్ల వరకు ఉన్నాయి. 13 మండలాల్లో మొదటివిడత విత్తనాల పంపిణీని అధికారులు ప్రారంభించారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో రైతులకు అనుకూలంగా ఉండే ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం విత్తనాలు సరఫరా చేయనున్నారు. బుధవారం జిల్లా కేంద్రం నుంచి సుమారు 580 క్వింటాళ్ల విత్తనాలు ఆయా మండలాలకు చేరుకున్నాయి. ఇక గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. 25 కేజీల విత్తనాల బస్తా రూ.1050 అయితే రూ.945 వరకు సబ్సిడీ ఉంటుంది. గిరిజన రైతులు కేవలం రూ. 105 చెల్లించాల్సి ఉంది. మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన రైతులకు విత్తనాలు 10 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 79 వేల హెక్టార్లలో ఖరీఫ్‌ వరి సాగు జరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఎల్‌నినో ప్రభావంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. సాఽధారణం కంటే తక్కువ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సాగు ఎలా చేపట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే వాతావరణ మార్పులకు తగ్గట్లుగా పంటలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు అన్నదాతలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. పెద్దగా సాగునీరు అవసరంలేని ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:24 AM